ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌.. క్రికెట్‌కు వీరాభిమాని.. 2011 వరల్డ్ కప్ సంబురాల్లో అగర్వాల్ ఫొటోలు

Published : Nov 30, 2021, 05:28 PM IST
ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌.. క్రికెట్‌కు వీరాభిమాని.. 2011 వరల్డ్ కప్ సంబురాల్లో అగర్వాల్ ఫొటోలు

సారాంశం

ట్విట్టర్ సీఈవోగా భారత సంతతి పరాగ్ అగర్వాల్ బాధ్యతలు తీసుకున్న ఆయన గురించిన వివరాలపై భారత్‌లో తీవ్రస్థాయిలో వెతుకులాట జరుగుతున్నది. గూగుల్, సోషల్ మీడియాలో పరాగ్ అగర్వాల్ గురించిన చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంగానే 2011లో టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలుచున్నప్పుడు చేసిన సంబురాలకు సంబంధించి ఆయన ఫొటోలు మళ్లీ తెర మీదకు వచ్చాయి. ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి.  

న్యూఢిల్లీ: ట్విట్టర్(Twitter) సీఈవో(CEO)గా జాక్ డోర్సీ(Jack Dorsey) ఈ నెల 29న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అదే రోజు భారత సంతతి పరాగ్ అగర్వాల్(Parag Agrawal) ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. ఈయన భారత సంతతి కావడంతో దేశమంతటా ట్విట్టర్ సీఈవో మార్పుపై ఆసక్తి రేపింది. ఐఐటీ బాంబేలో చదువుకున్న పరాగ్ అగర్వాల్ గురించి ఆరా తీయడం పెరిగింది. గూగుల్‌లో ఆయన గురించి తెగ వెతికేస్తున్నారు. ఆయన పుట్టి పెరిగిన ప్రాంతాలు, చదువుకున్న సంస్థలు, ఇష్టాలు, అభిరుచులు అన్నీ తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపారు. అందుకే గూగుల్, సోషల్ మీడియాలో ఆయన వివరాల కోసం వెతుకులాట జరుగుతూనే ఉన్నది. ఈ క్రమంలోనే ఆయన గురించి ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పరాగ్ అగర్వాల్‌ క్రికెట్‌కు వీరాభిమాని అనే విషయం బయటకు వచ్చింది.

2011 భారత క్రికెట్ టీమ్ వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకున్న సంగతి విధితమే. ఆ ప్రపంచ కప్ వేడుకలను ప్రతి భారతీయుడు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. సగటు పౌరుడు సంబురపడ్డాడు. ఆ ప్రపంచ కప్ సమయంలోనే పరాగ్ అగర్వాల్ కూడా తనలోని క్రికెట్ అభిమానాన్ని వెల్లడించిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ ముందుకు వచ్చాయి. 2011 వన్డే ప్రపంచ కప్ సమయంలో ఆయన ప్రతి మ్యాచ్‌లో టీమ్ ఇండియాను ఎంకరేజ్ చేసినట్టే అర్థం అవుతున్నది. టీమిండియా ప్రపంచ కప్ గెలిచాక త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకుని వీధుల్లో వేడుకలు చేసుకున్నట్టూ ఆ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. 2011 వన్డే ప్రపంచ కప్‌కు భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: ఇండియా సీఈవో వైరస్‌కు వ్యాక్సిన్ లేదు.. భారత సంతతి సీఈవోలపై ఆనంద్ మహీంద్రా ట్వీట్

బాంబే ఐఐటీలో చదువుకున్న పరాగ్ అగ్రావాల్ ఆ తర్వాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. పరాగ్ అగ్రావాల్ 2011లో ట్విట్టర్ సంస్థలో చేరారు. 2017లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ట్విట్టర్ సంస్థలో చేరక ముందు పరాగ్ అగ్రావాల్ యాహూ, మైక్రోసాఫ్ట్, ఏటీఅండ్‌టీ ల్యాబ్స్‌లో సేవలు అందించారు. 2006 నుంచి 2010 వరకు ఆయన రీసెర్చ్ టీమ్స్‌తో కలిసి పని చేశారు. అగ్రావాల్ బీటెక్ డిగ్రీ పట్టా పొందారు. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీర్స్ చేశారు. అనంతరం కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేశారు. ట్విట్టర్‌ అనూహ్యంగా అభివృద్ధి చెందడంలో (సాంకేతికపరంగా) పరాగ్ అగ్రావాల్ టెక్నికల్ స్ట్రాటజీ కీలకంగా ఉన్నది. ఆయనను ట్విట్టర్ సీఈవోగా ఎన్నుకోవడంపై పరాగ్ అగ్రావాల్ హర్షం వ్యక్తం చేశారు.

Also Read: తనను నిషేధించిన ట్విట్టర్ సంస్థ మాజీ సీఈవో జాక్ డోర్సీపై కంగనా కామెంట్.. ఎలన్ మస్క్ స్పందన

ట్విట్టర్ సీఈవోగా భారత సంతతి వ్యక్తి బాధ్యతలు స్వీకరించడంపై దేశమంతటా మారుమోగుతున్నది. ఇదే సందర్భంగా ఇది వరకే దిగ్గజ సంస్థలకు సీఈవోలుగా కొనసాగుతున్న వారిపైనా చర్చ జరిగింది. మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవోగా సుందర్ పిచయ్, అడాబ్ సంస్థ సీఈవోగా శాంతాను నారాయణ్, ఐబీఎం సీఈవోగా అరవింద్ క్రిష్ణ, మైక్రాన్ టెక్నాలజీగా సంజయ్ మెహ్రోత్రా, పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈవోగా నికేశ్ అరోరా, ఆరిస్టా నెట్‌వర్క్స్ సీఈవోగా జయశ్రీ ఉల్లాల్, నెట్‌యాప్ సీఈవోగా జార్జ్ కురియన్, ఫ్లెక్స్ సీఈవోగా రేవతి అద్వైతి, వీమియో సీఈవోగా అంజలి సుద్‌లు ఇప్పటికే బాధ్యతల్లో ఉన్న సంగతి తెలిసిందే. వీరంతా భారత సంతతి వారే కావడం గమనార్హం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu