
Operation Sindoor : భారత్-పాకిస్థాన్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ 'ఆపరేషన్ సిందూర్' పేరిట దాడులకు దిగింది. ఇందుకు ప్రతీకారంగా పాక్ భారత ఆర్మీపై దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. అయితే పాక్ మిస్సైల్స్ భారత భూభాగంలోకి ఎంటర్ కాగానే గాల్లోనే ధ్వంసం చేయడంతో ప్రమాదం తప్పింది.
పాకిస్థాన్ దాడులను తిప్పికొట్టడంలో భారత్ బలగాలు సమర్ధవంతంగా పనిచేసాయి. పాక్ క్షిపణులను టార్గెట్ కు చేరకముందే కూల్చివేసారు. లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ యూనిట్లతో పాక్ ఈ దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. పాక్ మిస్సైల్స్‌ను గగనతలంలోనే పేల్చేయడంతో ప్రమాదం తప్పింది.
జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ లక్ష్యంగా పాక్ ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. భారత్‌లోని 15 సైనిక పోస్టులపై పాక్ దాడులకు యత్నించింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌ను లక్ష్యంగా చేసుకుని మిస్సైల్ ప్రయోగించింది. భారత వైమానిక రక్షణ వ్యవస్థ దీన్ని అడ్డుకుంది. మిస్సైల్ మూడు ముక్కలైంది.
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని మూడు గ్రామాలు దుధాలా, జేతువాల్, పంధేర్‌లలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని మిస్సైళ్లు కనిపించాయి. అమృత్‌సర్ గ్రామీణ ఎస్ఎస్పీ మన్‌ఇందర్ సింగ్ ఈ వస్తువులను మిస్సైల్‌లుగా గుర్తించారు. భారత సైన్యానికి సమాచారం అందించారు. మిస్సైల్ శకలాలు పరీక్ష కోసం తీసుకెళ్లారు.
మిస్సైల్‌ను పాకిస్తాన్ నుంచి ప్రయోగించినట్లు తెలుస్తోంది. భారత గగనతల రక్షణ వ్యవస్థ వీటిని అడ్డుకోవడంతో అది మూడు ముక్కలైంది. దానిని ఫోరెన్సిక్ నిపుణులకు పంపారు పోలీసులు.
బుధవారం రాత్రి 1:02 నుంచి 1:09 గంటల మధ్య అమృత్‌సర్‌లో ఆరు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇవి మిస్సైల్ దాడికి సంబంధించినవని అంచనా వేస్తున్నారు. అధికారులు నగరంలో బ్లాక్‌అవుట్ విధించారు.
అమృత్‌సర్‌లో బుధవారం రాత్రి రెండు బ్లాక్‌అవుట్‌లు సంభవించాయి. మొదటిది రాత్రి 10:30 నుంచి 11:00 గంటల మధ్య, రెండోది 1:56 గంటలకు జరిగింది. ఇది రెండున్నర గంటల పాటు కొనసాగింది. ఉదయం 4:30 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడింది.