
అఫ్గానిస్థాన్ పరిణామాలపై భారత్ ప్రభుత్వం నవంబర్ 10వ తేదీన సదస్సు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ రీజినల్ సెక్యూరిటీ డైలాగ్ (Delhi regional security dialogue) పేరుతో నిర్వహిస్తున్న ఈ కీలక సదస్సు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval) అధ్యక్షత వహించనున్నారు. జాతీయ భద్రతా సలహాదారుల స్థాయి అధికారులతో ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఇందుకు భారత ప్రభుత్వం పలు దేశాలకు ఆహ్వానం పంపింది. భారత్ ఆహ్వానానికి చాలా దేశాలు సానుకూలంగా స్పందించాయి. రష్యా, ఇరాన్‌తో సహా మధ్య ఆసియా దేశాలు ఈ సమావేశంలో పాల్గొనున్నట్టుగా సమాచారం పంపాయి. అఫ్గానిస్తాన్‌లో శాంతి, భద్రతలను పునరుద్ధరించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలపై ఆ దేశాలు ఆసక్తి కనబరిచాయి.
అయితే ఈ సమావేశానికి పాకిస్తాన్ (Pakistan), చైనాలకు భారత విదేశీ వ్యవహారాల శాఖ ఆహ్వానం పంపింది. అయితే చైనా ఈ సెక్యూరిటీ డైలాగ్ సమావేశానికి హాజరుకాకూడదనే నిర్ణయించింది. షెడ్యూల్ కుదరకపోవడం వల్ల తమ ప్రతినిధులు హాజరుకాలేరని China తెలియజేసింది. మరోవైపు పాకిస్తాన్‌ను ఈ మీటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే దాయాది దేశం భారత్‌పై మరోసారి బురదజల్లే ప్రయత్నం చేసింది. వినాశనానికి కారణమైన వారు శాంతిని ప్రారంభించలేరు అంటూ ఆయన తీవ్ర్య వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్ ఇలా చేయడం దురదృష్టకరమని విదేశాంగ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇందులో ఆశ్చర్యం లేదని తెలిపాయి. అఫ్గానిస్తాన్ గురించి పాకిస్థాన్ ఆలోచన ఏమిటో ఇది చూపిస్తుందని ఆ వర్గాలు తెలిపాయి.
అజిత్ దోవల్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో.. కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్థాన్‌లకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొంటారు. రష్యా, ఇరాన్ భద్రతాధికారులతో కూడా అజిత్ దోవల్ ద్వైపాక్షిక చర్చలు జరపుతున్నారు.
అప్గానిస్తాన్‌లో తాలిబాన్‌లు అధికారాన్ని చేజిక్కించుకోవడం వల్ల కలిగే భద్రతాపరమైన చిక్కులును.. ఈ సమావేశంలో పాల్గొనే దేశాలు కలిగిఉన్నాయని, ఆ సవాళ్లను ఎదుర్కొవడానికి ఆచరణాత్మక సహకారాన్ని కలిగి ఉండటమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సదస్సులో పాల్గొనే దేశాలు సమస్య పరిష్కారంలో భాగం కావాలని కోరుకుంటున్నాయి అని పేర్కొన్నాయి.
ఉగ్రవాదం, రాడికలైజేషన్, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సరిహద్దుల్లోని ప్రజల కదలికలు, అమెరికా సైన్యం వదిలిపెట్టిన సైనిక ఆయుధాలు.. వంటి సవాళ్లను ఈ సదస్సులో సుదీర్ఘంగా చర్చించనున్నట్లుగా తెలిపాయి. ‘ఉన్నత స్థాయి చర్చలు.. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవలి పరిణామాలకు సంబంధించిన భద్రతా పరిస్థితిని సమీక్షిస్తాయి. భద్రతా సవాళ్లను పరిష్కరించడానికి.. శాంతి, భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించడంలో అప్గానిస్తాన్ ప్రజలకు మద్దతు ఇచ్చే చర్యలపై ఇది ఉద్దేశించబడినది’అని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.