కశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ తన సౌదీ పర్యటనను రద్దు చేసుకుని తిరిగి వస్తున్నారు. బుధవారం ఇండియాకు చేరుకోనున్న మోదీ బాధితులను పరామర్శించి, ఉన్నతాధికారులతో భద్రతా చర్యలపై చర్చించనున్నారు.
Pahalgam terror attack : కశ్మీర్ లో ఉగ్రవాదులు అమాయక టూరిస్టులపై కాల్పులకు తెగబడి 27 మందిని పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో జరిగిన ఈ ఉగ్రదాడిలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు... ఇంకొందరు బుల్లెట్ గాయాలకు గురయి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ దుర్ఘటన యావత్ దేశాన్ని విస్మయానికి గురిచేస్తోంది.
ప్రస్తుతం దేశంలో అలజడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్వదేశానికి తిరుగుపయనం అయ్యారు. ఇవాళ ఉదయమే సౌదీ అరేబియాకు చేరుకున్న ప్రధాని రేపు రాత్రి తిరుగుపయనం కావాల్సి ఉంది. కానీ కాశ్మీర్ ఉగ్రదాడి, దేశంలో అలజడి పరిస్థితుల నేపథ్యంలో ఆయన పర్యటనను అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. ఇవాళ రాత్రికే మోదీ తిరుగుపయనం కాగా రేపు(బుధవారం) ఉదయానికి ఆయన భారత్ చేరుకుంటారు.
రేపు(బుధవారం) ప్రధాని మోదీ కాశ్మీర్ లో పర్యటించే అవకాశాలున్నాయి. ఉగ్రవాదుల దాడిలో గాయపడ్డ బాధితులను ఆయన పరామర్శించనున్నారు... ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను కూడా కలుసుకునే అవకాశాలున్నాయి. ఇలా బాధితులకు ప్రధాని స్వయంగా ధైర్యం చెప్పనున్నారు. అలాగే కాశ్మీర్ లో ప్రస్తుతం చేపట్టిన భద్రతా చర్యలపై కూడా ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. ఈ దాడికి కారణమైన ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇప్పటికే మోదీ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వయంగా ఆయనే రంగంలోకి దిగుతున్నారు.