జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడితో యావత్ దేశం ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో పర్యాటకం అభివృద్ధి చెందుతోంది. దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారు, స్థానికులకు చేతి నిండా పని లభిస్తోంది. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి దిగారు. కశ్మీర్‌లో అస్థిరత సృష్టించడమే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ఎంతో మంది అమాయక ప్రజలు మరణించారు.
దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు పర్యాటకులను అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన దేశాన్ని ఒక్కసారి షేక్ చేసింది. పహల్గాం సమీపంలోని బైసరన్ మైదానంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు మరణించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
ఉగ్రవాదులు జరిపిన దాడిలో తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన వారు మరణించారు. ఏ మతం అని ప్రశ్నించిన తర్వాత దాడులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారు. కొండ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారిలో హైదరాబాద్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి మనీష్ రంజన్ కూడా ఉన్నారు. ఆయన భార్య ఈ దాడి నుంచి క్షేమంగా బయటపడగా.. వారి పిల్లలు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. మనీష్ రంజన్ కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన ఐడెంటింటి తెలిసిన తర్వాతే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సమాచారం. మనీష్ రంజన్ మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ ఉగ్రదాడిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఇలాంటి కిరాతక చర్యలు భారత ప్రజల ఐక్యతను, ధైర్యాన్ని ఎన్నటికీ దెబ్బతీయలేవని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రజల ఐక్యతకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.