భారత జనాభాలో సగానికి పైగా యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్.. డిజిటల్ చెల్లింపుల్లో 13 శాతం పెరుగుదల..!

Published : May 04, 2023, 01:00 PM IST
భారత జనాభాలో సగానికి పైగా యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్.. డిజిటల్ చెల్లింపుల్లో 13 శాతం పెరుగుదల..!

సారాంశం

భారతదేశంలో సగానికి పైగా ప్రజలు ప్రస్తుతం యాక్టివ్ వినియోగదారులుగా ఉన్నారని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. డిజిటల్ చెల్లింపులు కూడా 13 శాతం పెరిగాయని తెలిపింది.

భారతదేశంలో సగానికి పైగా ప్రజలు ప్రస్తుతం యాక్టివ్ వినియోగదారులుగా ఉన్నారని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. డిజిటల్ చెల్లింపులు కూడా 13 శాతం పెరిగాయని తెలిపింది. 2022 నాటికి భారతదేశంలోని 759 మిలియన్ల యాక్టివ్ ఇంటర్నెట్ వినియోగదారులు ఉండగా.. అందులో 399 మిలియన్లు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు కాగా, 360 మిలియన్లు పట్టణ ప్రాంతానికి చెందినవారని పేర్కొంది. గ్రామీణ భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారులలో వృద్దిని ఈ డేటా సూచిస్తుంది. 

ఐఏఎంఏఐ, మార్కెట్ డేటా అనలిటిక్స్ సంస్థ కాంటార్ సంయుక్తంగా రూపొందించిన ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2022 ప్రకారం.. దేశంలో సగం కంటే ఎక్కువ మంది(759 మిలియన్ల మంది) పౌరులు యాక్టివ్ ఇంటర్నెట్ వినియోగదారులు కాగా.. వీరు కనీసం నెలకు ఒకసారి ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేస్తున్నారు. భారతదేశంలో యాక్టివ్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 2025 నాటికి 900 మిలియన్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ఇంత పెద్ద సంఖ్యలో భారతీయులు యాక్టివ్ ఇంటర్నెట్ వినియోగదారులుగా మారడం ఇదే మొదటిసారి అని నివేదిక పేర్కొంది.

‘‘పట్టణ ప్రాంతాల్లో సుమారు 71 శాతం ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. అయితే పట్టణ ప్రాంతాల్లో గతేడాదితో పోలిస్తే..కేవలం 6 శాతం వృద్ధి నమోదైంది. మరోవైపు ఇంటర్నెట్ వినియోగంలో గ్రామీణ ప్రాంతాలు గత ఏడాది కాలంలో 14 శాతం వృద్ధి రేటు సాధించాయి. 2025 నాటికి భారతదేశంలోని మొత్తం కొత్త ఇంటర్నెట్ వినియోగదారులలో 56 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచే ఉంటారని అంచనా వేయబడింది’’ అని నివేదిక పేర్కొంది.

అయితే రాష్ట్రాల వారీగా  ఇంటర్నెట్ వినియోగదారులలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని  నివేదిక పేర్కొంది. బీహార్‌లో కేవలం 32 శాతం మంది వినియోగదారులు ఉండగా.. గోవాలో అత్యధికంగా 70 శాతం మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు.  

అయితే ఇంటర్నెట్ వినియోగంలో కూడా లింగ సమానత్వం లేదని రోజుల్లో మార్పు కనిపిస్తున్నట్టుగా నివేదిక పేర్కొంది. ‘‘ఇప్పటివరకు ఇంటర్నెట్ వినియోగదారులలో 54 శాతం మంది పురుషులే కాగా..  2022లో మొత్తం కొత్త వినియోగదారులలో 57 శాతం మంది మహిళలే కావడం హర్షణీయం. 2025 నాటికి మొత్తం కొత్త వినియోగదారులలో 65 శాతం మంది మహిళలు ఉంటారని అంచనా. ఇది లింగ విభజనను సరిదిద్దడంలో సహాయపడుతుంది’’ అని నివేదిక పేర్కొంది.

‘‘వినియోగం పరంగా డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్, డిజిటల్ కమ్యూనికేషన్‌లు, సోషల్ మీడియా భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సేవలుగా కొనసాగుతున్నాయి. వాస్తవానికి భారతీయులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను తదుపరి ఇ-కామర్స్ గమ్యస్థానంగా వేగంగా స్వీకరించారు’’ అని నివేదిక తెలిపింది. 

‘‘డిజిటల్ చెల్లింపులు 2021తో పోలిస్తే 13 శాతం వృద్ధిని సాధించి 338 మిలియన్ల వినియోగదారులను చేరుకోగలిగాయి. అందులో 36 శాతం మంది గ్రామీణ భారతదేశానికి చెందిన వారు. మొత్తం డిజిటల్ చెల్లింపు వినియోగదారులలో తొంభై తొమ్మిది శాతం మంది యూపీఐ వినియోగదారులే’’ అని నివేదిక పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్