
న్యూఢిల్లీ: పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చిన హిందూ శరణార్థులు బుల్‌డోజర్ యాక్షన్‌తో నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా నివాసాలు ఏర్పరుచుకుని నివసిస్తున్నారని, వారి ఆవాసాలను కూల్చేయాలన్న రాజస్తాన్‌లోని జైసల్మేర్ కలెక్టర్ టీనా దాబి ఆదేశాలతో బుల్‌డోజర్ ఆ ఏరియాకు వెళ్లింది. అక్కడున్న సుమారు 50 తాత్కాలిక ఆవాసాలను నేలమట్టం చేసింది. దీంతో సుమారు 150 మంది మహిళలు, పురుషులు, చిన్నారులు నిరాశ్రయులయ్యారు. ఏ గూడు లేని వారిగా మిగిలిపోయారు.
వారి ఆవాసాలను అక్రమ కట్టడాలుగా అర్బన్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్ట్ భావించింది. దీంతో యాక్షన్ తీసుకున్నారు. జిల్లా యంత్రాంగం ప్కారం, ఈ శరణార్థులు జైసల్మేర్‌లోని అమర్ సాగర్ లేక్ తీరాన అక్రమంగా ఆవాసాలు ఏర్పరుచుకున్నారు. దీని వల్ల నదిలోకి వెళ్లాల్సిన నీటికి వీరి ఆవాసాలు అడ్డంగా నిలుస్తున్నాయి.
అమర్ సాగర్ గ్రామ హెడ్, స్థానికంగా నివసిస్తున్న పలువురు వారిపై ఫిర్యాదులు అందించారని ఐఏఎస్ టీనా దాబి తమ చర్యలకు సమర్థింపుగా తెలిపారు.
ఆ భూమిని వదిలి వెళ్లాల్సిందిగా వారికి ముందస్తుగానే నోటీసులు ఇచ్చామని టీనా దాబి తెలిపారు. కానీ, వారు ఆ నోటీసులను పాటించలేదు. ఇప్పటి వరకు 28 అక్రమ కట్టడాలను తొలగించినట్టు వివరించారు.
పాకిస్తాన్‌లో విస్తాపితులుగా మారి భారత్‌లోకి అడుగుపెట్టి.. అక్కడ నివాసమున్న కిషన్ రాజ్ భిల్ ఈ విషయంపై మాట్లాడారు. తాము పాకిస్తాన్ నుంచి బహిష్కృతులు కావడమే కాదు.. ఇప్పుడు భారత్‌లోనూ తమ ఇళ్లను నేలమట్టం చేశారని అన్నారు. తమ మొత్తం కల్లా క్రషర్ భిల్ ఆవాసాలను కూల్చేశారని తెలిపారు. పాకిస్తాన్‌లో తమ జీవితాలు దుర్భరంగా మారిన తర్వాతే తాము ఇక్కడికి వచ్చామని, ఇప్పుడు ఇక్కడ కూడా తాము మరింత క్షీణించిపోతున్నామని వివరించారు.
Also Read: భార్య ప్రైవేట్ పార్టులపై గొడ్డలి, కొడవలితో దాడి చేసి దారుణ హత్య.. అనంతరం భర్త ఆత్మహత్య
తాము తమ డిమాండ్లను ఇది వరకే తెలియజేశామని, కానీ, ఎవరూ వాటిని ఆలకించలేదని అన్నారు. సోమవారం సాయంత్రం అర్బన్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్ట్ తమకు నోటీసులు ఇచ్చి ఇళ్లు ఖాళీ చేయాలని చెప్పిందని తెలిపారు. ఆ తర్వాతే తమ ఇళ్లను కూల్చేశారని, కానీ, తమకు పునరావాసం కోసం మాత్రం ఏమీ చేయలేదని భోరుమన్నారు.
గతేడాది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పౌర సవరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి శరణార్థులుగా వచ్చిన హిందువులు, సిక్కులు, జైననులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు పౌరసత్వం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, వారు 2014 డిసెంబర్ 31వ తేదీ లోపే వచ్చి ఉండాలి.
టీనా దాబి మాట్లాడుతూ, ఈ ఏరియా మొత్తంగా అక్రమ కట్టడాలతో నిండి ఉన్నదని తెలిపారు. ల్యాండ్ మాఫియాలు, దళారులు పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులను మోసం చేశారని, వారిని తప్పుదారి పట్టించారని చెప్పారు. వారిని అక్కడ ఆవాసాలు ఏర్పరుచుకునేలా చేశారని వివరించారు. అక్కడకు వచ్చిన శరణార్థులకు తామ పలుమార్లు నోటీసులు ఇచ్చామని చెప్పారు.
వీరికి భారత పౌరసత్వం ఇవ్వలేదని, వారు దీర్ఘకాల వీసాలు (లాంగ్ టర్మ్ వీసాలు) తీసుకుని ఇక్కడ ఉంటున్నారని డీఎం టీనా దాబి తెలిపారు. అయితే, వీరికి ఆవాసాలు కల్పించడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు అందించలేదు.