
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవన్నారు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో గొప్పదన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (ramnath kovind) . రాష్ట్రపతిగా నేటితో పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో ఆయన ఆదివారం చివరిసారిగా జాతినుద్దేశించి ప్రసంగించారు. తాను సాధారణ పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి చేరుకున్నానని.. ఎంతటి సామాన్యులైనా అత్యున్నత పదవిని పొందడం ప్రజాస్వామ్యంలోనే సాధ్యమవుతుందని రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. రాష్ట్రపతిగా కాన్పూర్‌లోని తన ఉపాధ్యాయుల పాదాలకు నమస్కరించడాన్ని తాను జీవితంలో ఎన్నడూ మరిచిపోలేనని రాష్ట్రపతి అన్నారు. 21వ శతబ్ధాన్ని భారతదేశ శతాబ్ధంగా మార్చుకునేందుకు మనదేశం సన్నద్ధమవుతోందని రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. తన పదవీకాలంలో శక్తిమేరకు బాధ్యతలు నిర్వర్తించినట్లు ఆయన వెల్లడించారు. భావి తరాల కోసం పర్యావరణం, భూమి, గాలి, నీటిని సంరక్షించుకోవాలని రాష్ట్రపతి సూచించారు.
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, దేశ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలు హాజరవుతారని కేంద్ర హోం వ్యవహారాల శాఖ తెలిపింది. వీరితోపాటు మంత్రి మండలి సభ్యులు, రాష్ట్ర గవర్నర్లు, సీఎంలు, దౌత్య వేత్తలు, ఎంపీలు, ఇతర అధికారులు సెంట్రల్ హాల్‌లో కార్యక్రమానికి హాజరు అవుతారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ములు సెంట్రల్ హాల్‌కు సాదర స్వాగతంతో విచ్చేస్తారు. సీజేఐ ఎన్వీ రమణ సమక్షంలో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత 21 గన్ సెల్యూట్‌లతో గౌరవిస్తారు.
Also Read:గాంధేయ మార్గాన్ని ఫాలో అవ్వండి .. వీడ్కోలు సభలో ఎంపీలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
అనంతరం, రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము (draupadi murmu swearing) ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆమె రాష్ట్రపతి భవన్‌కు చేరుతారు. ఇంటర్ సర్వీస్ గార్డుల గౌరవాన్ని స్వీకరిస్తారు. అదే విధంగా రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్‌కు వీడ్కోలు పలుకుతారు. నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము గెలుపొందారు. రాష్ట్రపతి ఎన్నికలో పోలైన ఓట్లను గురువారం ఎన్నికల సంఘం సిబ్బంది లెక్కించారు. ద్రౌపది ముర్ము భారీ మెజార్టీతో గెలిచారు. రామ్‌నాథ్‌గా రాష్ట్రపతి పదవీ కాలం ఆదివారం తో ముగిసిపోనుంది. తొలి గిరిజన మహిళా నేతగా ఆమె రాష్ట్రపతి కుర్చీని అలంకరించనున్నారు. మహిళగా ఆమె రెండో రాష్ట్రపతి. తొలి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ సేవలు అందించిన సంగతి తెలిసిందే.