లోక్‌సభలో వీగిపోయిన విపక్షాల అవిశ్వాస తీర్మానం.. స్పీకర్ ప్రకటన

Siva Kodati |  
Published : Aug 10, 2023, 07:43 PM IST
లోక్‌సభలో వీగిపోయిన విపక్షాల అవిశ్వాస తీర్మానం.. స్పీకర్ ప్రకటన

సారాంశం

కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ముందుగా అనుకున్నట్లుగానే వీగిపోయింది. అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించిన స్పీకర్ అది వీగిపోయినట్లుగా ప్రకటించారు. 

కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ముందుగా అనుకున్నట్లుగానే వీగిపోయింది. లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం అనంతరం అవిశ్వాసంపై జరిగిన ఓటింగ్‌లో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. 

అంతకుముందు అవిశ్వాస తీర్మానం పెట్టిన విపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. అవిశ్వాస తీర్మానంపై గురువారం ఆయన లోక్‌సభలో ప్రసంగించారు. అవిశ్వాసం పెట్టాలని దేవుడే విపక్షాలకు చెప్పాడంటూ మోడీ సెటైర్లు వేశారు. గడిచిన మూడు రోజులుగా చాలా మంది మాట్లాడారని.. 2018లోనూ అవిశ్వాసం పెట్టారని ఆయన గుర్తుచేశారు. కానీ విపక్షాలకు ఎంతమంది సభ్యులున్నారో అన్ని ఓట్లు కూడా రాలేదని మోడీ సెటైర్లు వేశారు. అవిశ్వాసం తమపై కాదని.. విపక్షాలపైనే అని ప్రధాని అన్నారు. 2024లో ఎన్డీఏ కూటమి అన్ని రికార్డులను బద్ధలు కొడుతుందని.. విపక్షాల అవిశ్వాసం తమకు శుభదాయకమన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం వుందని.. విపక్షాలకు అధికార దాహం పెరిగిందని ప్రధాని చురకలంటించారు. 

పేదల భవిష్యత్ కంటే విపక్షాలకు అధికారమే ముఖ్యమని.. ఐదేళ్ల కాలంలో ప్రజల విశ్వాసం చూరగొనడంలో విపక్షాలు విఫలమయ్యాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఐదేళ్లు టైం ఇచ్చినా విపక్షాలు సిద్ధం కాలేదని.. అవిశ్వాసంపై జరిగిన చర్చ ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఫిల్డింగ్ విపక్షాలు చేస్తుంటే.. ఫోర్లు, సిక్సులు తమవైపు నుంచి పడ్డాయని ప్రధాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయన్నారు. నో కాన్ఫిడెన్స్ నో బాల్‌గానే మిగిలిపోయిందని.. అధీర్‌ను ఎందుకు మాట్లాడనివ్వలేదో అర్ధం కాలేదన్నారు. కోల్‌కతా నుంచి ఫోన్ వచ్చిందేమోనంటూ మోడీ సెటైర్లు వేశారు. 

చర్చ సమయంలో మీరు మాట్లాడిన ప్రతీ మాట దేశం మొత్తం విన్నదని ఆయన పేర్కొన్నారు. మా పాలన స్కామ్ ఫ్రీ భారత్‌ను అందించిందన్నారు. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసేందుకు విపక్షాలు ప్రయత్నించాయని.. దేశ ప్రతిష్టను ఖండాంతరాలకు వ్యాపింపజేశామని మోడీ చెప్పారు. భారత్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు విపక్షాలు ప్రయత్నించాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం ఎంత బలపడిందో చెప్పడానికి విదేశీ పెట్టుబడులే నిదర్శనమని.. ప్రపంచం నలుమూలలా భారత్‌కు విస్తారంగా అవకాశాలు వస్తున్నాయన్నారు. మన సంక్షేమ పథకాలను ఐఎంఎఫ్ ప్రశంసించిందని.. అవిశ్వాసం, అహంకారం విపక్షాల నరనరాల్లో జీర్ణించుకుపోయాయని మోడీ దుయ్యబట్టారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu
Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!