
Prime Minister Narendra Modi: ప్రతిపక్షాలు నెగిటివ్ పాలిటిక్స్ చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధిని మెచ్చుకోదని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ ప్రతిపక్షంలోని ఒక వర్గం నేటికీ పాత పద్దతులనే అనుసరిస్తోందనీ, తామే ఏ పనీ చేయబోమని, ఇతరులను ఏ పనీ చేయనివ్వమనే తరహాలో ముందుకు సాగుతున్నదని విమర్శించారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా ఏమీ చేయాలనుకోవడం లేదనీ, గత కొన్నేళ్లుగా చేసిన అభివృద్ధి పనులను అభినందించబోవని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 508 రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం వర్చువల్ ప్రసంగంలో మోడీ మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తూ ప్రతిపక్షాల్లోని ఒక వర్గం నేటికీ పాత పద్ధతులనే అనుసరిస్తోందన్నారు. వారు ఏ పనినీ తామే చేసుకోరు, ఇతరులను ఏమీ చేయనివ్వరని విమర్శించారు. దేశం ఆధునిక పార్లమెంటు భవనాన్ని నిర్మించింది. అయితే, ఈ వర్గం కొత్త పార్లమెంటు భవనాన్ని వ్యతిరేకించిందని ప్రతిపక్షాల తీరుపై విమర్శలు గుప్పించారు, "మేము మన కర్తవ్య మార్గాన్ని పునర్నిర్మించాము, కానీ వారు దానిని కూడా వ్యతిరేకించారు. మేము నేషనల్ వార్ మెమోరియల్ నిర్మించినప్పుడు, వారు దానిని కూడా విమర్శించారు" అని ఆయన ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.
సర్దార్ పటేల్ గౌరవార్థం గుజరాత్ లో 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' ఏర్పాటు చేస్తే.. దానిని కూడా విమర్శించడంతో పాటు ప్రతిపక్ష నేతలెవరూ దానిని సందర్శించి స్వాతంత్య్ర సమరయోధుడికి నివాళులు అర్పించలేదన్నారు. ఎన్నికల సమయంలోనే వారికి సర్దార్ పటేల్ గుర్తుకు వస్తారు. నెగిటివ్ రాజకీయాలను వదిలేసి అభివృద్ధి సానుకూల రాజకీయాలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమానికి అంకితమైన జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటామని ప్రధాని తెలిపారు. నేడు ప్రతి భారతీయుడికి 'వోకల్ ఫర్ లోకల్'ను గుర్తుచేస్తుందని పేర్కొన్నారు. కొన్ని రోజుల తర్వాత వినాయక చవితి సందర్భంగా పర్యావరణహిత వేడుకలను ఎంచుకోవాలని కూడా పీఎం మోడీ పిలుపునిచ్చారు.