2024 Elections: ప్రధాని మోడీపై వారణాసి నుంచి విపక్ష కూటమి నుంచి పోటీ చేసేది ఎవరు?

By Mahesh K  |  First Published Dec 20, 2023, 10:55 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విపక్ష కూటమి నుంచి ఎవరు పోటీ చేయాలనే చర్చ జోరుగా సాగుతున్నది. తాజాగా ఇద్దరి పేర్లు బయటికి వచ్చాయి. అందులో నితీశ్ కుమార్, ప్రియాంక గాంధీలు ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ పేరుపైనా చర్చలు జరుగుతున్నాయి.
 


INDIA Bloc: ప్రతిపక్ష కూటమి ఇండియా అలయెన్స్ నేతలు నాలుగో సమావేశం ఢిల్లీలో జరిగింది. సీట్ల సర్దుబాటుపై ఈ సమావేశం నిర్వహించారు. ఇందులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. విపక్ష కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే ఉండాలని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు. ఆయన సున్నితంగా తిరస్కరించారు. తాజాగా మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎదుర్కొనే నేతలపై అన్వేషణ జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ముగ్గురు, నలుగురి నేతల పేర్లు వినిపించాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూపీలోని వారణాసి నుంచి పోటీ చేసి గెలుస్తున్నారు. 2014, 2019లో భారీ మెజార్టీతో గెలిచారు. 1991 నుంచి (2004 మినహా) వారణాసిలో బీజేపీనే గెలుస్తున్నది. 1952 నుంచి దశాబ్ద కాలంపాటు కాంగ్రెస్ ఈ ఆధ్యాత్మిక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినా.. పూర్తి స్థాయిలో చేపట్టలేదు. ఈ తరుణంలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని బలంగా ఢీకొనడమే కాదు.. ఈ పార్టీకి ముఖచిత్రంగా ఉన్న ప్రధాని మోడీని ఓడించడమూ అంతే కీలకం. అందుకే ఆయనను ఓడించడానికి కొందరి పేర్లను ఇండియా కూటమి నేతలు ప్రతిపాదించినట్టు తెలిసింది.

Latest Videos

బిహార్ సీఎం నితీశ్ కుమార్, కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రాల పేర్లు వినిపించాయి. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పేరు బయటికి వచ్చింది. వీటిపై అధికారిక ప్రకటన ఏమీ రాలేదు.

Also Read: పోర్న్ వెబ్ సైట్‌లకు ఈయూ చట్టాల తలనొప్పి.. ఆ నిబంధనలు పాటించాలటా!

నితీశ్ కుమార్ ప్రధానమంత్రి అభ్యర్థి అని గత లోక్ సభ ఎన్నికల్లోనూ ప్రచారం జరిగింది. ఈ సారి కూడా బిహార్‌లో ఈ చర్చ జరుగుతున్నది. ప్రియాంక గాంధీ గత లోక్ సభ ఎన్నికల్లోనే వారణాసి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా.. చివరి నిమిషంలో అజయ్ రాయ్‌నే కాంగ్రెస్ మళ్లీ బరిలోకి దింపింది. ప్రధాని మోడీ కంటే ఐదు లక్షల ఓట్లు తక్కువగా సంపాదించుకుని మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఎన్నికల రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తారని, వారణాసి నుంచి పోటీ చేయడానికీ సిద్ధమేనన్నట్టు ప్రియాంక గాంధీ నాలుగేళ్ల క్రితమే సంకేతాలు ఇచ్చారు.

అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా వినిపిస్తున్నది. 2014లో కేజ్రీవాల్ వారణాసి నుంచి మోడీపై పోటీ చేశారు. అయితే.. ఆయన రెండో స్థానానికే పరిమితం అయ్యారు.

ఇదిలా ఉండగా.. ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు పెద్ద రాష్ట్రాల్లో విజయ పతాకాన్ని ఎగరేసింది. ఈ మూడు రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా మోడీని ముందు పెట్టే మంచి మెజార్టీతో గెలిచింది. ఇది ఒక రకంగా బీజేపీకి ట్రయల్ రన్‌గా, మోడీ ప్రతిష్టకూ పరీక్షగా నిర్వహించగా.. సత్ఫలితాలు వచ్చాయి.

click me!