కొత్త కోవిడ్ వేరియంట్ విజృంభిస్తోంది. దేశంలో ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు ఈ జేఎన్.1 వేరియంట్ 21 కేసులు నమోదు అయ్యాయి. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
JN.1 Covid variant : కొత్త కోవిడ్ వేరియంట్ కలవరానికి గురి చేస్తోంది. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ వేరియంట్ మన దేశంలోనూ వేగంగా వ్యాప్తిస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 21 కోవిడ్-19 సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులను అధికారులు గుర్తించారు. అయితే దీని పట్ల భయాందోళన చెందాల్సిన అవసరం లేదని నీతి ఆయోగ్ మెంబర్ (హెల్త్) డాక్టర్ వీకే పాల్ స్పష్టం చేశారు.
కొత్త వేరియంట్ ను భారతదేశంలోని శాస్త్రీయ సమాజం నిశితంగా పరిశీలిస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్రాలు పరీక్షలను పెంచాల్సిన అవసరం ఉందని, నిఘా వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ పాల్ నొక్కి చెప్పారు. కరోనా సోకిన వారిలో 91 నుంచి 92 శాతం మంది ఇంట్లోనే చికిత్స తీసుకునే విధానాన్ని ఎంచుకుంటున్నారని తెలిపారు.
ఈ నెల నుంచే రూ.500 కు గ్యాస్ సిలిండర్.. ప్రభుత్వంపై ఎంత భారం పడనుందంటే ?
కోవిడ్-19 సబ్ వేరియంట్ జేఎన్.1కు సంబంధించిన 19 కేసులను గోవాలో, కేరళ, మహారాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున గుర్తించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. గత రెండు వారాల్లో కోవిడ్-19కు సంబంధించి 16 మరణాలు నమోదయ్యాయి. వీరు తీవ్రమైన ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతుండటం, కొత్త జేఎన్.1 వేరియంట్ ను గుర్తించిన నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది.
కొత్త కోవిడ్ వేరియంట్ నేపథ్యంలో ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం అధికారులతో సమీక్ష జరిపారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాలు సన్నద్ధంగా ఉండాలని, కరోనా వైరస్ స్ట్రెయిన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నొక్కి చెప్పారు. కేసులు పెరుగుతున్నప్పటికీ 92.8 శాతం మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారని, ఇది స్వల్ప అనారోగ్యాన్ని సూచిస్తోందని ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సుధాంశ్ పంత్ తెలిపారు.
కోవిడ్-19 కారణంగా ఆస్పత్రుల్లో చేరే రేటులో ఎలాంటి పెరుగుదల కనిపించలేదని తెలిపారు. ఆసుపత్రిలో చేరిన కేసులు ఇతర వైద్య పరిస్థితుల వల్ల సంభవించాయని, కోవిడ్ యాదృచ్ఛికంగా కనుగొనబడిందని ఆయన అన్నారు. కొత్త జేఎన్.1 వేరియంట్ గురించి పంత్ మాట్లాడుతూ.. ఈ వేరియంట్ ప్రస్తుతం తీవ్రమైన శాస్త్రీయ పరిశీలనలో ఉందని, అయితే తక్షణ ఆందోళనకు కారణం కాదని అన్నారు. కేసులన్నీ తేలికపాటివేనని, రోగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోలుకున్నారని అధికారులు తెలిపారు.
మూడు క్రిమినల్ చట్టాల వల్ల న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు - అమిత్ షా
ఇదిలా ఉండగా.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 614 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఇది మే 21 తర్వాత ఇవే అత్యధిక అత్యధిక కేసులు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,311కు చేరాయి. కాగా.. ఈ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉన్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ జెఎన్.1 ను స్పెషల్ ‘‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’’గా వర్గీకరించింది. ఇది తక్కువ ప్రపంచ ప్రజారోగ్య ప్రమాదాన్ని కలిగిస్తుందని తెలిపింది.