Congress: ప్రతిపక్ష కూటమికి అయోధ్య సవాల్.. రామ మందిర కార్యక్రమానికి వెళ్లాలా? వద్దా?

By Mahesh K  |  First Published Dec 28, 2023, 4:33 PM IST

ప్రతిపక్ష ఇండియా కూటమికి అయోధ్య రూపంలో మరో సవాల్ ఎదురైంది. వచ్చే నెల 22వ తేదీన రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఉన్నది. ఇండియా కూటమి ఈ కార్యక్రమానికి వెళ్లాలా? వద్దా? అనే మీమాంసలో పడింది. ఇది పూర్తిగా బీజేపీ కార్యక్రమం అని, దానికి వెళ్లినా.. దూరంగా ఉన్నా.. ఆ పార్టీ నుంచి దాడి తప్పదని చెబుతున్నారు.
 


Ayodhya: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమికి సంకటంగా మారింది. ఈ కార్యక్రమానికి వెళ్లాలా? వద్దా? అనే మీమాంసలో పార్టీలు పడిపోయాయి. ఈ కూటమిలో భిన్న భావజాలాలు గల పార్టీలు ఉన్నాయి. దీంతో వచ్చే నెల 22వ తేదీన జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి తప్పక వెళ్లాల్సిందేనని కొన్ని పార్టీలు చెబుతుండగా.. మరికొన్ని పార్టీలు మాత్రం తాము వెళ్లేదే లేదని మీడియా ముఖంగా తేల్చేశాయి. కూటమిలోని పార్టీల మధ్యే కాదు.. కూటమి సారథి కాంగ్రెస్ పార్టీలోనే రెండు రకాల మాటలు వినిపిస్తున్నాయి.

ఈ కార్యక్రమానికి వెళ్లడంపై కాంగ్రెస్ జాగ్రత్తగా ఆలోచిస్తున్నది. బీజేపీ ట్రాప్‌లో పడొద్దని ఇప్పటికే కొన్ని పార్టీలు వార్నింగ్ ఇస్తూనే ఉన్నాయి. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరిలకు ఆహ్వానాలు అందాయి. అయితే, వీళ్లు వెళ్లుతున్నారా? లేదా? అనేదానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ ప్రకటన చేయడానికి కేసీ వేణుగోపాల్ కూడా వెనుకాముందు ఆడుతున్నారు.

Latest Videos

undefined

Also Read: Ayodhya: డ్రైనేజీ, రోడ్లు శుభ్రం చేస్తున్న యూపీ డిప్యూటీ సీఎం

ఈ కూటమిలోని తృణమూల్ కాంగ్రెస్, ముస్లిం లీగ్ సీపీఎం పార్టీలు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లబోమని స్పష్టం చేశాయి. ఇది కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగానే మారింది. ఈ నిర్ణయాలను బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంటుందనడంలో సందేహం లేదు. అయోధ్యకు వెళ్లినా, డుమ్మా కొట్టినా బీజేపీ ఫలితం రాబట్టం ఖాయంగా ఉన్నది. దీంతో కాంగ్రెస్ దిగ్గజాలు మేధోమథం చేస్తున్నారు.

‘ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని రాజకీయం చేస్తున్నారు. ఇది సమంజసమేనా? ఇందులో కాంగ్రెస్ పై ఏదో ముద్ర వేయడానికి చూస్తున్నారు. ఒక వేళ హాజరైతే బీజేపీ చెప్పిన మాట వినక తప్పలేదు అని అంటారు. అదే వెళ్లకపోతే హిందూ వ్యతిరేకులు అంటారు. అందుకే నా అభిప్రాయం ఏమిటంటే.. ఆ కార్యక్రమానికి వెళ్లాలా? లేదా? అనేది వ్యక్తిగత నిర్ణయంగా తీసుకోవాలి. ఈ వేడుకకు వెళ్లనంత మాత్రానా హిందూ వ్యతిరేకి కాదు’ అని సీనియర్ ఎంపీ, సీడబ్ల్యూసీ సభ్యుడు శశిథరూర్ అన్నారు. మరో కాంగ్రెస్ సీనియర్ నేత షకీల్ అహ్మద్ మాట్లాడుతూ.. బీజేపీ దీన్ని ఒక రాజకీయ అజెండాగా మారుస్తున్నది అని అన్నారు.

Also Read: Ram Mandhir: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ వ్యూహం.. రామ మందిరానికి ప్రాధాన్యత

కాగా, దిగ్విజయ్ సింగ్ మాత్రం.. కాంగ్రెస్ తప్పక ఈ కార్యక్రమానికి హాజరు కావాలని అన్నారు. 

శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ మాత్రం.. బీజేపీ నిర్వహించే ఈ కార్యక్రమానికి తాము హాజరు కాబోమని స్పష్టం చేశారు. ‘బీజేపీ నిర్వహించే కార్యక్రమానికి హాజరు కావాలని ఎవరు కోరుకుంటారు? ఇది జాతీయ కార్యక్రమం ఏమీ కాదే! ఇది బీజేపీ కార్యక్రమం, బీజేపీ ర్యాలీ. ఇందులో పవిత్రత ఏమున్నది? బీజేపీ కార్యక్రమం ముగిశాక మేం అయోధ్యకు వెళ్లుతాం. వారు రాముడిని కిడ్నాప్ చేసినట్టుగా ఉన్నది’ అంటూ షార్ప్‌గా రియాక్ట్ అయ్యారు. టీఎంసీ కూడా ఇదే ఆలోచనలో ఉన్నది. జనవరి 22 కార్యక్రమం ముగిశాక తర్వాత వెళ్లాలని అనుకుంటున్నది.

సమాజ్‌వాదీ పార్టీ మాత్రం తమకు ఆహ్వానం వస్తే తప్పక వెళ్లుతామని చెప్పింది. ఒక వేళ ఆహ్వానం రాకుంటే.. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ముగిశాక వెళ్లుతామని తెలిపింది. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. బీజేపీ ఈ కార్యక్రమాన్ని ఒక రాజకీయ వ్యవహారంగా మార్చేసిందని, అందుకే ఆ కార్యక్రమం ముగిశాక అయోధ్యకు వెళ్లుతామని తెలిపారు.

click me!