మోడీ తరహా చరిష్మా ఇండియా కూటమిలో ఎవరికీ లేదు: హెచ్‌.డీ. దేవేగౌడ

By narsimha lode  |  First Published Dec 28, 2023, 1:50 PM IST

2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(ఎస్)లు కలిసి పోటీ చేయనున్నాయి.ఈ రెండు పార్టీల  మధ్య సీట్ల సర్ధుబాటుపై త్వరలోనే చర్చలు జరగనున్నాయి. 



న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చరిష్మా ఉన్న నాయకుడు ఇండియా కూటమిలో లేరని  మాజీ ప్రధాన మంత్రి హెచ్‌.డీ. దేవేగౌడ అభిప్రాయపడ్డారు.

కన్నడ ప్రభకు  మాజీ ప్రధాన మంత్రి హెచ్ . డీ. దేవేగౌడకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.  

Latest Videos

కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత  బీజేపీ, జేడీ(ఎస్) మధ్య  పొత్తు కుదిరింది.  2024 లోక్ సభ ఎన్నికల్లో  ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని  కుమారస్వామి చెప్పారు.  భవిష్యత్తులో జరిగే  అసెంబ్లీ ఎన్నికల్లో  ఈ పార్టీలు కలిసి పనిచేస్తాయన్నారు.  గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

ప్రపంచ స్థాయిలో మోడీ చరిష్మా గురించి  హెచ్.‌డీ. దేవేగౌడ ప్రస్తావించారు.  రోజు రోజుకు మోడీ చరిష్మా పెరుగుతుందన్నారు.దేశంలో ఉన్న నేతలు  ఎవరూ కూడ మోడీ చరిష్మా ముందు సరిపోలేరన్నారు.  2024 పార్లమెంట్ ఎన్నికల్లో  బీజేపీ మరోసారి విజయం సాధించి  నరేంద్ర మోడీ  తిరిగి ప్రధానమంత్రి అవుతారని  దేవేగౌడ విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో  మోడీ పాత్రను ఎవరూ కూడ విస్మరించలేరన్నారు.

ఇండియా కూటమిలో  మోడీ తరహాలో చరిష్మా నేత లేడన్నారు. ఇండియా కూటమిలో  ఉన్న నేతల్లో  శరద్ పవార్, నితీష్ కుమార్, మమత బెనర్జీ,  మల్లికార్జున ఖర్గే వంటి నేతల పేర్లను ప్రస్తావిస్తూ  మోడీతో పోల్చదగిన చరిష్మా వారికి లేదన్నారు.

కర్ణాటక రాష్ట్రంలో  వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో  జేడీఎస్- బీజేపీ కూటమి  గణనీయమైన స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

బీజేపీతో పొత్తు పెట్టుకున్నందున దేవేగౌడ పార్టీలో ఉన్న సెక్యులర్ పదాన్ని తొలగించుకోవాలని కాంగ్రెస్ చేసిన సూచనపై ఆయన స్పందించారు.  కరుణానిధి వంటి నేతలు బీజేపీతో కూడ  అనుబంధం కలిగిన సందర్భాలను ఆయన ప్రస్తావించారు.  ఓటర్లు చాలా తెలివితేటలు కలిగి ఉన్నారన్నారు.

హిందూ మతానికి బీజేపీ ప్రాధాన్యత ఇస్తుందనే విషయమై  కూడ దేవేగౌడ స్పందించారు.  హిందువుగా  ఉండడం వ్యక్తిగత ధృవీకరణ అని దేవేగౌడ అభిప్రాయపడ్డారు.అజ్మీర్, గోల్డెన్ టెంపుల్, దర్గా సహా విభిన్న  మతాలకు చెందిన ప్రముఖ ప్రార్థనా స్థలాలను  సందర్శించిన విషయాన్ని దేవేగౌడ గుర్తు చేశారు. రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి  సోనియా, రాహుల్  గాంధీలకు కూడ ఆహ్వానాలు పంపిన విషయాన్ని  దేవేగౌడ గుర్తు చేశారు. తన ఆరోగ్య పరిస్థితులను బట్టి ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్టుగా  దేవేగౌడ చెప్పారు. అయితే కుమారస్వామి మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. 

జేడీఎస్‌లోని ముస్లిం సంఘాల నేతలను సంప్రదించిన తర్వాతే  బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా  దేవేగౌడ ప్రకటించారు. బీజేపీతో పొత్తు అంశాన్ని బూచిగా చూపి  ఇబ్రహీం పార్టీపై విమర్శలు చేశారన్నారు.ఇబ్రహీం  ఇతర ప్రయోజనాల కోసం  పార్టీపై ఈ ఆరోపణలు చేశారన్నారు.

ముస్లిం సమాజానికి న్యాయం చేసేందుకు గతంలో తాను చేసిన పనులను కూడ ఆయన ప్రస్తావించారు.  పార్లమెంట్ ఎన్నికల్లో  బీజేపీ, జేడీఎస్ కూటమి మెరుగైన ఫలితాలను సాధించనుందన్నారు.  కుమారస్వామి తనయుడు ఎంపీగా పోటీ చేసే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.

కుల గనణ విషయమై  రాజ్యసభలో ఈ విషయాన్ని చర్చించేందుకు తాను ప్రయత్నించినట్టుగా  దేవేగౌడ గుర్తు చేసుకున్నారు. ఆర్ఎస్ఎస్ విషయమై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో  బీజేపీ, జేడీఎస్ మధ్య సీట్ల సర్దుబాటు విషయమై  నరేంద్ర మోడీ, అమిత్ షా, జే.పీ. నడ్డా,  యడియూరప్పలతో తమ పార్టీ నేతలు చర్చించనున్నారని  దేవేగౌడ ప్రకటించారు. 


 

click me!