Operation Sindoor : అసలు స్టోరీ ఇదే... సక్సెస్, ముఖ్యాంశాలు

Published : May 14, 2025, 04:35 PM IST
Operation Sindoor : అసలు స్టోరీ ఇదే... సక్సెస్, ముఖ్యాంశాలు

సారాంశం

మోదీ నాన్ కాంటాక్ట్ వార్ వ్యూహంతో ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ పాకిస్తాన్‌పై దాడి చేసింది. రాఫెల్, స్కాల్ప్, హామర్ క్షిపణులు, కమికాజీ డ్రోన్లు, బ్రహ్మోస్ వంటి ఆధునిక ఆయుధాలతో ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేయబడ్డాయి. S-400 వ్యవస్థ పాక్ ప్రతీకార దాడులను అడ్డుకుంది. భారత ఆర్థిక వృద్ధి, మోదీ అంతర్జాతీయ సంబంధాలు ఈ సమయంలో కీలకం మారాయి. 

భారతదేశం ఇటీవల నిర్వహించిన కీలక సైనిక కార్యాచరణ "ఆపరేషన్ సింధూర్" ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఉగ్రవాదానికి స్థావరంగా మారిన పాకిస్తాన్‌ను శిక్షించేందుకు భారత రక్షణ దళాలు ఈ ఆపరేషన్‌ను కేవలం రెండు వారాల్లో సఫలంగా పూర్తి చేయగలిగాయి. కానీ ఈ ఘనత రెండు వారాల్లో మాత్రమే సాధించబడింది అనుకోవడం తప్పు... దీని వెనుక సంవత్సరాల శ్రమ, సాంకేతిక పరిజ్ఞానం, వ్యూహాత్మక మార్పులు ఉన్నాయి.

ఈ ప్రణాళిక రూపకల్పనకు ప్రేరణగా నిలిచింది ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన నాన్ కాంటాక్ట్ వార్ మోడల్‌. గతంలో జరిగిన ఉరి సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ వైమానిక దాడులు సంప్రదాయ యుద్ధ మోడల్‌పై ఆధారపడగా ఈ ఆపరేషన్ సింధూర్ మాత్రం సాంకేతికత, నిఘా, వ్యూహాల పరంగా పూర్తిగా ఆధునిక తత్వాన్ని ప్రతిబింబించింది.

పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను సమూలంగా నాశనం చేయాలంటే లోతైన స్టడీతో దాడులు చేయడం తప్పనిసరి. ఈ అవసరాన్ని గుర్తించిన మోదీ సంప్రదాయ యుద్ధ విధానానికి బదులుగా సైనిక శక్తిని ఆధునీకరించేందుకు కృషి చేశారు. ఇది ఆపరేషన్ సింధూర్ విజయానికి పునాది వేసింది.

ఇంకా భారతదేశంలో గత పదేళ్లలో ఆర్థిక, వ్యూహాత్మక మరియు భౌగోళిక రాజకీయాల్లో జరిగిన శక్తివంతమైన మార్పులు ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు సహాయపడ్డాయి. అదే సమయంలో పాకిస్తాన్ దేశంగా అనేక రంగాల్లో క్షీణతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యాల్లో ఆపరేషన్ సింధూర్ విజయవంతమయ్యింది.

పాకిస్తాన్‌కు సంబంధించిన ఓ వెబ్‌సైట్ దీనిపై వ్యాఖ్యానిస్తూ... "ఇటీవల భారత వ్యూహాత్మక విధానాల్లో మార్పులు ప్రాధాన్యత సంతరించుకుంది'' అని పేర్కొంది. ఇది మోదీ నాయకత్వంలో భారత రక్షణ విధానంలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రతిబింబిస్తుంది.

సంప్రదాయ మోడల్స్ కంటే భిన్నంగా, గగనతలాల్లో నుంచే లేదా సరిహద్దులలో అడుగు పెట్టకుండా సైబర్, నిఘా, శాస్త్రవిజ్ఞాన ఆధారిత దాడులతో శత్రువును దెబ్బతీయడం ఆపరేషన్ సింధూర్ ప్రధాన లక్ష్యం. ఈ వ్యూహం భవిష్యత్తులో భారత రక్షణ విధానానికి దిక్సూచి అయ్యే అవకాశముంది.

నాన్ కాంటాక్ట్ వార్: టెక్నాలజీ ఆధారంగా భారత వ్యూహాల్లో మోదీ మార్పులు

భారతదేశం నాన్ కాంటాక్ట్ వార్ అనే ఆధునిక యుద్ధ మోడల్‌లోకి వేగంగా ప్రవేశించిందని పాకిస్తాన్ డిఫెన్స్ వెబ్‌సైట్ 2020 జూలై 8న (8.7.2020) పేర్కొంది. భారత్ టెక్నాలజీ ఆధారంగా సుదీర్ఘ పరిధిలో గల క్షిపణులు, అత్యంత ఖచ్చితమైన స్మార్ట్ వెపన్స్, మనుషుల అవసరం లేకుండా పనిచేసే వ్యవస్థలు, రోబోలు మరియు ఉపగ్రహాల వినియోగాన్ని పెంచి నాన్ కాంటాక్ట్ వార్ దిశగా అడుగులు వేస్తోందని పేర్కొంది.

పాకిస్తాన్ వెబ్‌సైట్ ప్రకారం, ఈ విధానం భారత వ్యూహాత్మక వర్గాల్లో ఇటీవల ప్రాధాన్యం పొందిందని వ్యాఖ్యానించింది. దీనివల్ల శత్రువుపై దాడిలో మనుషులకు ఏ హానీ జరగకుండా తొందరగా, నిర్ణయాత్మకంగా విజయం సాధించడానికి టెక్నాలజీ ఆధారిత దాడులను భారత్ ప్రాధాన్యంగా తీసుకుంటోందని స్పష్టం చేసింది.

బాలాకోట్ వైమానిక దాడులు మరియు అంతకుముందు జరిగిన సర్జికల్ దాడులపై భారత్ చెబుతున్న మాటలు, ప్రకటనలు తమ సైనిక మానసిక స్థైర్యాన్ని పెంచుకోవాలన్న అభిలాషను సూచిస్తున్నాయని, దాడుల వల్ల పెద్దగా హానీ లేకుండా శత్రువుల్లో మానసిక ఒత్తిడిని పెంచడమే లక్ష్యమని పాక్ వెబ్‌సైట్ పేర్కొంది.

ఇంకా భారత సైన్యం పునర్ నిర్మాణంలో భాగంగా నాన్ కాంటాక్ట్ వార్ ప్రాధాన్యతపై 2015 జనవరిలో భారత ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ... 2020లో  “ఇదంతా ఇటీవల జరిగిన పరిణామం” అని పేర్కొనడం గమనార్హం. భారత సైన్యంలో ఈ విధానాన్ని "గుర్తించదగిన అంశం"గా పేర్కొన్న ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు అప్పుడే ఈ మార్పులకు బీజం వేశాయని సూచించింది.

ఈ నేపథ్యంలో, మోదీ ప్రభుత్వ కాలంలో టెక్నాలజీ ఆధారిత రక్షణ వ్యూహాలకు ప్రాధాన్యం పెరిగిందని, దీనివల్లే భారత్ నాన్ కాంటాక్ట్ వార్ మోడల్ వైపు గట్టిగా అడుగులు వేసిందని పాక్ డిఫెన్స్ వెబ్‌సైట్ విశ్లేషించింది. భారతదేశం టెక్నాలజీ ఆధారంగా శత్రు దేశాలపై ప్రత్యక్షంగా దాడి చేయకుండా, దూరదృష్టితో, దూకుడుగా చర్యలు తీసుకునే వైఖరిని అవలంబిస్తోందని ఈ విశ్లేషణలో స్పష్టంగా తెలియజేయబడింది.

ఆపరేషన్ సింధూర్ విజయాన్ని సాధించిన ఐదు నాన్ కాంటాక్ట్ అస్త్రాలు

ఆపరేషన్ సింధూర్‌ను విజయవంతంగా అమలు చేయడంలో భారత వైమానిక దళం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఐదు అత్యాధునిక నాన్ కాంటాక్ట్ యుద్ధ సాధనాలను ఉపయోగించింది. ఈ ప్రక్రియలో సాయుద బలగాలను లేదా సంప్రదాయ వైమానిక దాడులను ఉపయోగించకుండా టార్గెట్లను దూరం నుంచే ధ్వంసం చేసే విధానాన్ని అనుసరించడం ప్రత్యేకతగా నిలిచింది.

ఈ కార్యాచరణకు మూలస్తంభాలుగా నిలిచిన అయిదు నాన్ కాంటాక్ట్ ఆయుధాలు:

1. రాఫెల్ యుద్ధ విమానాలు

2. SCALP క్షిపణులు

3. HAMMER క్షిపణులు

4. ఇజ్రాయిల్ సహకారంతో అభివృద్ధి చేసిన కమికాజీ డ్రోన్లు

5. దేశీయంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణులు

ఈ ఐదు ఆయుధాలన్నీ పూర్తిగా స్వయంచాలకంగా పనిచేస్తాయి. ఒకసారి ప్రయోగించిన తరువాత అవి స్వయంగా లక్ష్యాన్ని కనుగొని దానిపై దాడి చేస్తాయి.

భారత వైమానిక దళం రాఫెల్ యుద్ధ విమానాలను ఆపరేషన్ సింధూర్‌కు రంగంలోకి దింపింది. రఫెల్స్ పై మౌంట్ చేసిన SCALP మరియు HAMMER క్షిపణులు భారత సైన్యానికి ప్రభావవంతమైన దాడులు చేయటానికి, ఖచ్చితమైన లక్ష్యాలను గమనించి మిగిలిన దళాల సమర్థతను పెంచేందుకు సహాయపడ్డాయి. SCALP క్షిపణులు సుమారు 500 కిలోమీటర్ల దూరంలోని బంకర్లు, కమాండ్ కేంద్రాలపై సీక్రెట్‌గా దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. HAMMER క్షిపణులు గాలి నుండి భూమిని లక్ష్యంగా చేసుకునే ఆయుధాలు, అవి కదిలే లక్ష్యాలపై కూడా ప్రభావవంతంగా దాడి చేయగలవు.

SCALP వ్యవస్థకు తోడుగా HAMMER మిసైళ్ళు ఉపయోగించబడ్డాయి. కమికాజీ డ్రోన్లు Do or Die తరహాలో మానవ నియంత్రణలో పనిచేసే డ్రోన్లు. ఇవి టార్గెట్‌పై తేలికగా దాడి చేయగలవు.

అత్యంత ప్రబలమైన బ్రహ్మోస్ క్షిపణులు దేశీయంగా అభివృద్ధి చేసిన సీకర్ (seeker) సాధనంతో లక్ష్యాన్ని అచ్చంగా తాకాయి. ఈ బ్రహ్మోస్ మిసైళ్ళు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి.

ఇక మే 6-7 మధ్య రాత్రి జరిగిన భారత దాడికి ప్రతిగా మే 7 నుండి 9 రాత్రివరకూ పాకిస్తాన్ డ్రోన్, మిసైల్ దాడులు జరిపింది. ఈ దాడులను సమర్థవంతంగా అడ్డుకున్నది రష్యా తయారీ S-400 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఇది భారత రక్షణ వ్యూహంలో కీలక పాత్ర పోషించింది.

ఈ ఆధునిక నాన్ కాంటాక్ట్ ఆయుధాలు భారత్‌కు ఉగ్రవాదానికి మూలం వద్దే కట్టడి చేసే శక్తిని ఇచ్చాయి. ఆపరేషన్ సింధూర్‌లో ఈ ఆయుధాల సమన్వయం, ఖచ్చితత్వం భారత సైనిక వ్యూహంలో ఒక కొత్త దశను సూచిస్తుంది.

నాన్ కాంటాక్ట్ యుద్ధానికి మోదీ ఏర్పాటు చేసిన రహస్య సైనిక మౌలిక సదుపాయాలు

ఆపరేషన్ సింధూర్ వంటి నాన్ కాంటాక్ట్ వార్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు మోదీ ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో అత్యంత ఆధునిక సైనిక మౌలిక సదుపాయాలను గుప్తంగా సృష్టించింది. వివిధ దేశాల నుండి అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేయడం ద్వారా భారత్‌ తన రక్షణ వ్యవస్థను సాంకేతికంగా విస్తృతంగా అభివృద్ధి చేసింది.

మోదీ ప్రభుత్వం కొనుగోలు చేసిన ముఖ్యమైన ఆయుధాలు, దేశాలవారీగా:

ఫ్రాన్స్ నుండి: రాఫెల్ యుద్ధ విమానాలు, HAMMER క్షిపణులు

ఇంగ్లాండ్ నుండి: SCALP క్షిపణులు

ఇజ్రాయెల్ నుండి: Heron Mk2 UAVs, HAROP డ్రోన్ల కోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం

రష్యా నుండి: S-400 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్

అమెరికా నుండి: AH-64 అపాచీ హెలికాప్టర్లు, AGM-114 హెల్‌ఫైర్ క్షిపణులు

ఈ కొనుగోళ్లలో అత్యంత ప్రతిస్పందన ఎదుర్కొన్నవే రాఫెల్ యుద్ధ విమానాలు మరియు రష్యా తయారీ S-400 వ్యవస్థ. రాజకీయ వ్యతిరేకత, అంతర్జాతీయ ఒత్తిడులు ఉన్నప్పటికీ, ఈ రెండు వ్యవస్థలను భారత్‌కు తీసుకురావడంలో మోదీ నిర్ణాయక పాత్ర పోషించారు.

ఆపరేషన్ సింధూర్‌లో రాఫెల్ విమానాల పాత్ర అనిర్వచనీయమైనది. ఈ విమానాలే SCALP మరియు HAMMER వంటి ఖచ్చితమైన మిసైళ్లను టార్గెట్లపై ప్రయోగించేందుకు ఉపయోగించబడ్డాయి. ఇవే నాన్ కాంటాక్ట్ వార్‌కు ఆధారంగా నిలిచాయి.

అదేవిధంగా మే 7, 8, 9 తేదీల్లో పాకిస్తాన్ భారత వైమానిక స్థావరాలపై చేసిన డ్రోన్, క్షిపణి దాడులను అడ్డుకోవడంలో S-400 వ్యవస్థ కీలకంగా నిలిచింది. పాకిస్తాన్ ప్రయోగించిన మిసైళ్లు, వాయు మార్గంలోనే గుర్తించి, వాటిని పక్షుల్లా కూల్చడంలో ఈ రష్యన్ వ్యవస్థ పాత్ర అపూర్వం.

ఇంకా మోదీ ప్రభుత్వం వివిధ దేశాల నుండి మరిన్ని సాంకేతిక పరిజ్ఞానాలు, గోప్యమైన రక్షణ పరికరాలను కూడా సుదీర్ఘ ప్రణాళికతో సేకరించింది. వీటన్నింటినీ మిళితం చేయడం ద్వారా, భారత్ నాన్ కాంటాక్ట్ వార్ మోడల్‌లో తనకు తానుగా ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఈ వ్యవస్థల సమన్వయం వల్లే ఆపరేషన్ సింధూర్‌లో విజయం సాధ్యమైందని సైనిక విశ్లేషణలు స్పష్టంగా సూచిస్తున్నాయి.

రాఫెల్, S-400 కొనుగోలుపై కాంగ్రెస్, అమెరికా ఒత్తిడిని తిప్పికొట్టిన మోదీ

భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడానికి మోదీ తీసుకున్న రెండు ప్రధాన నిర్ణయాలు కీలకంగా నిలిచాయి. అవి రాఫెల్ యుద్ధ విమానాలు మరియు రష్యా తయారీ S-400 మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ కొనుగోలు. అయితే ఈ రెండింటికీ తీవ్ర రాజకీయ, అంతర్జాతీయ వ్యతిరేకత ఎదురైంది.

రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. అవినీతి ఆరోపణలు చేస్తూ, ఈ ఒప్పందాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నించింది. ఈ వ్యవహారంపై దేశ రాజకీయాలు వేడెక్కగా, చివరికి సుప్రీంకోర్టు ఈ ఒప్పందాన్ని సమర్థించడంతో రాఫెల్ డీల్‌కు మార్గం సుగమమైంది.

2019 ఎన్నికల సమీపంలో మోదీ రాజకీయంగా అత్యధిక రిస్క్ తీసుకుని రాఫెల్ డీల్‌ను కొనసాగించాడు. ఈ విమానాలు ఇప్పుడు భారత్‌కు నాన్ కాంటాక్ట్ వార్‌ నిర్వహించే సామర్థ్యాన్ని అందించాయి. రాఫెల్ ద్వారా ప్రయోగించగల SCALP, HAMMER మిసైళ్లు 250 కిలోమీటర్ల దూరంలోని టెర్రరిస్ట్ శిబిరాలను సరిహద్దు దాటి వెళ్లకుండానే ధ్వంసం చేశాయి.

ఇక అమెరికా విషయానికి వస్తే భారతదేశం రష్యాతో S-400 కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు, అమెరికా తీవ్ర అభ్యంతరం తెలిపింది. 2018లో ఈ ఒప్పందం కొనసాగితే భారత్‌పై టెక్నాలజీ ఆంక్షలు విధిస్తామని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది. అయినప్పటికీ మోదీ వెనక్కి తగ్గకుండా దేశ రక్షణ అవసరాలపైనే దృష్టిపెట్టి, ఈ వ్యవస్థను కొనుగోలు చేశాడు.

మే 7, 8, 9 తేదీల్లో పాకిస్తాన్ దాడులు చేపట్టినప్పుడు భారత వైమానిక స్థావరాలపై దాడులకు వచ్చిన వందల కొద్దీ డ్రోన్లు, మిసైళ్లను అడ్డుకున్నది ఈ S-400 వ్యవస్థే. ఈ వ్యవస్థ లేకపోయి ఉంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్‌పై జరిగిన ప్రతీకార దాడులను అడ్డుకోవడం సాధ్యమయ్యేది కాదు.

కాంగ్రెస్ ఒత్తిడికి లొంగకుండా రాఫెల్ కొనుగోలు చేయడం, ట్రంప్ హెచ్చరికల్ని పక్కనపెట్టి S-400 ఒప్పందాన్ని కొనసాగించడం వల్లే భారత్‌కు నాన్ కాంటాక్ట్ వార్ మోడల్ సాధ్యమయ్యింది. ఇవే ఆపరేషన్ సింధూర్ విజయానికి బలమైన ఆధారాలుగా నిలిచాయి.

ఆత్మనిర్భర్ భారత్‌లో కమీకాజీ డ్రోన్ల స్వదేశీ వికాసం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశ రక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తులపై ప్రధాన దృష్టి సారించడమే కాక, వాటిని విజయవంతంగా అభివృద్ధి చేయడంలో భారత్‌ కీలకమైన ముందడుగు వేసింది. 2014లో దేశంలో రక్షణ అవసరాలకు 32 శాతం ఉత్పత్తి మాత్రమే జరగగా, ఇప్పటి వరకు ఈ సంఖ్య 88 శాతానికి పెరగడం గమనార్హం.

ఈ విప్లవాత్మక మార్పుల్లో ఒక ముఖ్య ఘట్టం కమీకాజీ డ్రోన్ల అభివృద్ధి. ఇజ్రాయెల్ టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి చేసిన ఈ డ్రోన్లు స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యాయి. నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ (NAL) నిర్మించిన ఈ డ్రోన్లు 2023 ఏప్రిల్‌లో భారత రక్షణ దళాల్లోకి ప్రవేశించాయి. ఆగస్టు 15న జరిగిన 78వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఈ డ్రోన్లు సేవలోకి వచ్చాయి.

కమీకాజీ డ్రోన్లు "do-or-die" డ్రోన్లుగా పరిగణించబడతాయి. స్వదేశీ ఇంజిన్లతో రూపొందించిన ఈ డ్రోన్లు 1,000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలవు. లక్ష్య ప్రాంతంపై 9 గంటలపాటు గాలిలో తిరుగుతూ సరైన సమయంలో లక్ష్యంపై క్షిపణి దాడికి యత్నిస్తాయి.

ఈ డ్రోన్లు ఆపరేషన్ సింధూర్లో తొలిసారిగా వినియోగించబడ్డాయి. శత్రు భూభాగంపై అడుగు పెట్టకుండానే ఈ డ్రోన్లు ఆత్మాహుతి దాడుల ద్వారా టెర్రరిస్ట్ శిబిరాలను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించాయి.

దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ డ్రోన్ల వినియోగం భారత్ రక్షణ రంగంలో స్వావలంబన దిశగా ఎత్తుగడలు వేస్తోందని స్పష్టం చేస్తోంది. మోదీ ప్రభుత్వ ఆత్మనిర్భర్ లక్ష్యాల్లో ఇది ఒక ప్రధాన ఘట్టంగా నిలిచింది.

ప్రపంచ వేదికపై మోదీ ఔన్నత్యం: 73 దేశాల పర్యటనలతో భారత్‌కు గౌరవం

భారతదేశ రక్షణ సామర్థ్యం ఒక్కటే సరిహద్దులు దాటి శత్రు దేశంపై దాడి చేయడానికి సరిపోదు. ఇందుకోసం అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు మద్దతు, ప్రధానిగా నరేంద్ర మోదీ సాధించిన వ్యక్తిగత సంబంధాలు, ప్రపంచవ్యాప్తంగా ఆయ‌న బలంగా ఏర్పరచుకున్న మైత్రీ సంబంధాలు కీలకం అయ్యాయి.

మోదీ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు దేశీయ విపక్షాలు మరియు అంతర్జాతీయ లిబరల్ వర్గాలు ఆయ‌నపై ప్రతికూల అభిప్రాయాన్ని వ్యాప్తి చేశాయి. అయితే ఆ ప్రతికూలతను ఎదుర్కొనడానికి అతని దృష్టి మౌలికంగా వేరుగా ఉండింది. విలువైన పీఆర్ సంస్థల సేవలు ఆశ్రయించకుండా స్వయంగా ప్రపంచ పర్యటనల ద్వారా తన అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేశారు.

గత 10 ఏళ్లలో మోదీ 73 దేశాలను సందర్శించారు. అందులో 41 దేశాలకు ఒక్కసారి, 14 దేశాలకు రెండుసార్లు, 8 దేశాలకు మూడుసార్లు (ఇందులో యూకే, సౌదీ అరేబియా ఉన్నాయి), శ్రీలంకకు నాలుగుసార్లు, చైనా సహా మూడు దేశాలకు అయిదుసార్లు, జర్మనీకి ఆరు సార్లు, జపాన్, రష్యా, యూఏఈకి ఏడుసార్లు, ఫ్రాన్స్‌కు ఎనిమిదుసార్లు, అమెరికాకు పది సార్లు వెళ్లారు. ఇవన్నీ రొటీన్ పర్యటనలు కాదు, అత్యంత బలమైన వ్యక్తిగత సంబంధాలు మోదీ ఏర్పరచుకున్న మార్గాలు.

ప్రపంచ ప్రముఖులు మోదీపై చెప్పిన వ్యాఖ్యలు గమనార్హం.

ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని బెన్నెట్: "మోదీ ఇజ్రాయెల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు."

అమెరికా  అధ్యక్షుడు ట్రంప్: "మోదీ అద్భుత వ్యక్తి, విజేత."

అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్: "మోదీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలనిపించింది."

రష్యా అధ్యక్షుడు పుతిన్: "మోదీ తెలివైన నాయకుడు. జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీపడడు."

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ: "మోదీ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు."

ఆస్ట్రేలియా ప్రధాని అల్‌బనీస్: "మోదీ మా బాస్."

ఇంగ్లాండ్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్: "మోదీ మార్పు తీసుకొచ్చిన నాయకుడు."

ఈ పర్యటనలు భారత్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠ తెచ్చాయి. మోదీ నాయకత్వం దేశాన్ని విశ్వవ్యాప్త రాజకీయ భద్రతా వేదికపై కీలక స్థానానికి చేర్చింది. ఇలా ప్రపంచ రాజకీయ రంగంలో మోదీ వేసిన అడుగులు, భారత్‌ను ఆర్థిక, భద్రతా, వ్యూహాత్మక శక్తిగా తీర్చిదిద్దిన ఘట్టంగా నిలిచాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రపంచవ్యాప్తంగా అరుదైన గుర్తింపు లభించింది. 21 దేశాలు, అందులో సౌదీ అరేబియా, అఫ్గానిస్థాన్, యుఏఈ, బహ్రెయిన్, ఈజిప్ట్, కువైట్ వంటి ముస్లిం దేశాలు, అలాగే అమెరికా, ఫ్రాన్స్, రష్యా, గ్రీస్ వంటి గ్లోబల్ శక్తులు అత్యున్నత పౌర పురస్కారాలతో గౌరవించాయి. ఈ స్థాయిలో అన్ని దేశాల నుంచి ఒకే నాయకుడికి ఈ గౌరవం దక్కడం ప్రపంచంలో మరే ఇతర నాయకుడికి జరగలేదు.

2019 నుండి అమెరికాలోని ‘మోర్నింగ్ కన్సల్ట్’ సంస్థ నిర్వహించిన సర్వేలో మోదీ ప్రతి త్రైమాసికానికి ప్రపంచంలో అత్యధికంగా ఆదరించబడిన నాయకుడిగా నిలిచారు. ఆయనకు 70% కంటే అధిక మద్దతు రేటింగ్ లభించింది.

మోదీ విదేశీ పర్యటనల ద్వారా భారతదేశ ప్రతిష్ఠను పెంచేందుకు శ్రమిస్తుంటే విపక్ష కాంగ్రెస్ పార్టీ ఆయన్ను నాన్-రెసిడెంట్ ప్రధాని అని విమర్శించింది. కానీ ఇదే సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాలుగు సంవత్సరాల్లో 247 సార్లు గోప్యంగా విదేశాలకు ప్రయాణించారు. ఆయన ఎక్కడ ఉన్నారో ఆయన పార్టీకి కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

మోదీ వ్యక్తిగత పాపులారిటీతో భారత్‌కు వచ్చిన లాభాలు అనేకం. ఆయ‌న పర్యటనల వలన భారత్‌కు టెక్నాలజీ, పెట్టుబడులు, వ్యూహాత్మక సాయుధ పరికరాలు లభించాయి. ఇది మోదీ ఏర్పాటు చేసిన సంబంధాల వల్లే సాధ్యమయ్యింది. ఇది భారత్‌ను గ్లోబల్ స్టేజ్‌పై మిగతా దేశాలకు బలంగా నిలిపింది.

ఆపరేషన్ బాలాకోట్ సమయంలో భారత్ చర్యలకు ప్రపంచం మిశ్రమ స్పందన ఇచ్చింది. అయితే తాజా ఆపరేషన్ సిందూర్ సందర్భంలో, మోదీ సరిహద్దులు దాటి పాక్‌పై బహిరంగ దాడిని ప్రకటించారు. ఈసారి ముస్లిం దేశాల్లో టర్కీ తప్ప ఎవరూ పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వలేదు. మునుపటిదాకా పాక్‌కు సహచరంగా ఉన్న ఖతార్ కూడా ఈసారి భారత్‌కు మద్దతు తెలిపింది.

భారతదేశం ఈ స్థాయిలో ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించగలగడం అంతర్జాతీయ మద్దతు వల్లే సాధ్యమైందని స్పష్టం. మోదీ స్థాపించిన భూభౌగోళిక స్థాయిల ఆధారంగా, భారత్‌ను గ్లోబల్ శక్తిగా తీర్చిదిద్దిన నేపథ్యాన్ని ఇది వెల్లడిస్తోంది.

భారత్ ఆర్థిక శక్తిగా ఎదుగుతూ పాకిస్తాన్‌ను దెబ్బేసింది

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం సాధించిన ఆర్థిక పురోగతిని ప్రపంచం గమనిస్తోంది. మోదీ 2014లో పదవిలోకి వచ్చినప్పుడు భారత్‌ ప్రపంచంలోని దుర్బల ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉంది. కానీ 2024 నాటికి భారత్ ప్రపంచంలో అగ్రశ్రేణి నాలుగు ఆర్థిక శక్తుల్లో ఒకటిగా ఎదిగింది. దేశం $3.88 ట్రిలియన్ జిడిపీతో ఉన్నత స్థితిలో నిలిచింది.

ఇతర దేశాలతో పోలిస్తే పాకిస్తాన్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. 2024 నాటికి పాకిస్తాన్ జిడిపీ కేవలం $0.37 ట్రిలియన్, భారత్ కన్నా పది రెట్లు వెనుకబడింది. గత దశాబ్దంలో భారత్ తన జిడిపీని రెట్టింపు చేయగా, పాకిస్తాన్ దీర్ఘకాలిక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అభివృద్ధిలో వెనుకబడింది.

2024లో భారత్ 8.2% ఆర్థిక వృద్ధిరేటుతో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలవగా, పాకిస్తాన్ వృద్ధిరేటు కేవలం 2.4% మాత్రమే. అదే సమయంలో భారత్‌కు గల విదేశీ మారకద్రవ్య నిల్వలు $676 బిలియన్లు, కానీ పాకిస్తాన్‌కి కేవలం $9 బిలియన్లు మాత్రమే. గత పదేళ్లలో భారత్‌లో వ్యక్తిగత ఆదాయం (పర్ కాపిటా జిడిపీ) 74% పెరగగా, పాకిస్తాన్‌లో అంతంతమాత్రంగానే ఉంది.

పాకిస్తాన్ గత నాలుగు దశాబ్దాలలో ఐఎంఎఫ్ సహాయం కోసం 20 సార్లు వెళ్ళాల్సి వచ్చింది. ఇటీవల లభించిన $7 బిలియన్ ఐఎంఎఫ్ రుణం, ఆ దేశ చరిత్రలో అతిపెద్ద సహాయ ప్యాకేజీలలో ఒకటి. ఈ రుణాల ఉద్దేశ్యం ఆర్థిక స్థిరత సాధించడం అయినా, పాకిస్తాన్ చాలాసార్లు వాటిని సైనిక బలాన్ని పెంచేందుకు, భయోత్పాత చర్యలకు మద్దతుగా ఉపయోగించినట్లు విమర్శలు ఉన్నాయి.

ఇలా భిన్నంగా ఉన్న ఆర్థిక గణాంకాలు, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశానికి గ్లోబల్ మద్దతును పొందడంలో కీలక పాత్ర పోషించాయి. భారతదేశం స్థిరమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ప్రపంచమంతా గుర్తించగా, పాకిస్తాన్ మాత్రం అంతర్జాతీయంగా తీవ్రంగా వెనుకబడిపోయింది.

ఆపరేషన్ సిందూర్: ఇండియా-పాకిస్తాన్ సంబంధాల్లో కొత్త అధ్యాయం

ఆపరేషన్ సిందూర్ భారతదేశానికి, పాకిస్తాన్‌కు మధ్య పరస్పర సంబంధాలపై గంభీరమైన మలుపు తీసుకువచ్చింది. ఈ చర్యతో భారతదేశం ఈ ప్రాంతంలో నిబంధనలు విధించే స్థాయికి ఎదిగింది. ఈ ఆపరేషన్‌కు అనేక కీలక అంశాలు ఉన్నాయి.

మొదటిగా పహల్గాం మారణహోమానికి ప్రతీకారం తీర్చేందుకు భారత్ తొమ్మిది ఉగ్ర శిబిరాలపై భారీ మిస్సైల్ దాడులు నిర్వహించింది. గతంలో వలె పాక్ ఈ దాడులను ఖండించలేక నిజం అంగీకరించాల్సి వచ్చింది.

రెండవది భారత్ దాడి తరువాత పాకిస్తాన్ యుద్ధం ప్రారంభించినా, భారత్ యొక్క గగనతల రక్షణ వ్యవస్థను ఛేదించలేకపోయింది.

మూడవది భారత బలగాలు పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడంతో పాటు, వారి వైమానిక స్థావరాలపై దాడులు చేసి నష్టం కలిగించాయి.

నాలుగవది తీవ్రంగా దెబ్బతిన్న పాకిస్తాన్ అణు బెదిరింపును భారత్ గౌరవించకపోవడంతో, వారి డీజీఎంఓ ద్వారానే వారు కాల్పుల విరమణను విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది.

ఐదవది భవిష్యత్తులో ఉగ్రదాడి జరిగితే దానిని యుద్ధ ప్రకటనగా పరిగణించి, ఉగ్రవాద శిబిరాలపై దేశాంతర దాడులు చేయబోతున్నట్లు భారత్ స్పష్టంగా తెలిపింది.

ఆరవది ప్రపంచ వ్యతిరేకుల్లో ఉన్న ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ సైనికాధికారులు హాజరవడం, ఉగ్రవాదంపై ఆర్మీ మద్దతుకు ఆధారంగా నిలిచింది.

ఏడవది ప్రధాని మోదీ తన ప్రసంగంలో "ఉగ్రవాదం, వాణిజ్యం, చర్చలు కలసి సాగలేవు" అని ప్రకటించారు.

ఎనిమిదవది పాక్‌తో చర్చలు జరిగితే అవి కేవలం పీఓకే అంశంపైనే జరుగుతాయని మోదీ స్పష్టంగా చెప్పారు.

తొమ్మిదవది "రక్తం మరియు నీరు కలిపి ప్రవహించలేవు" అనే సందేశం ద్వారా ఇండస్ నీటి ఒప్పందం పాకిస్తాన్ ఉగ్రవాదం త్యాగానికి అనుసంధానమైందని తెలిపారు.

పదవది పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వదలకపోతే, అదే దాని విధ్వంసానికి కారణమవుతుందని మోదీ హెచ్చరించారు.

చివరగా అణు బెదిరింపులకు భారత్ భయపడదని, అవసరమైతే ‘నో ఫస్ట్ యూజ్’ విధానాన్ని కూడా పునఃసమీక్షించవచ్చని మోదీ హెచ్చరించారు. ఈ మొత్తం పరిణామాల ద్వారా ఆపరేషన్ సిందూర్, భారత్-పాకిస్తాన్ సంబంధాలను కొత్త కోణంలోకి తీసుకువెళ్లింది. యుద్ధానికి అయినా శాంతికి అయినా ఇది నూతన ఆరంభం.

ఎస్ గురుమూర్తి 

తుగ్లక్ తమిళ్ మ్యాగజైన్ ఎడిటర్, వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్ట్రటేజిక్ థింక్ ట్యాంక్ ఛైర్మన్. 
 

PREV
SG
About the Author

Swaminathan Gurumurthy

ಸ್ವಾಮಿನಾಥನ್ ಗುರುಮೂರ್ತಿ ತುಘಲಕ್ ಸಂಪಾದಕರು. ಇವರ ದೃಷ್ಟಿಕೋನವನ್ನು ನಿಮಯ ರೂಪಿಸುವವರು ಸದಾ ಗಮನಿಸುತ್ತಿರುತ್ತಾರೆ. ರಾಜ್ಯ ರಾಜಕಾರಣದ ಗಮ್ಯ ತಲುಪುವಲ್ಲಿಯೂ ಇವರ ಚಿಂತನೆಗಳು ಮುಖ್ಯ ಪಾತ್ರವಹಿಸುತ್ತವೆ. ದಶಕಗಳ ಇವರ ವಸ್ತು ನಿಷ್ಟ ವರದಿಗಳು ದೇಶಾದ್ಯಾಂತ ಹಲವು ತಿರುವುಗಳಿಗೆ ಕಾರಣವಾಗಿವೆ. ಕಾರ್ಪೋರೇಟ್ ಜಗತ್ತಿನ ದೈತ್ಯ ಕಂಪನಿಗಳಾದ ರಿಲಯನ್ಸ್‌ನಂತ ಕಂಪನಿಗಳು ಹಾಗೂ ಸರಕಾರದ ನಡುವಿನ ಕಾನೂನುಬಾಹಿರ ವ್ಯವಹಾರ, ಬೋಫೋರ್ಸ್‌ನಂತ ಹಗರಣಗಳ ಬಗ್ಗೆ ಇಡೀ ಜಗತ್ತಿಗೇ ಗೊತ್ತು ಮಾಡಿಸಿದ ಇವರು ಭ್ರಷ್ಟಚಾರದ ವಿರುದ್ಧ ಸಮರ ಸಾರಿದವರು. ಗುಣಮಟ್ಟದ ಸಂಶೋಧನೆ, ಆಳ ಅಧ್ಯಯನ ಹಾಗೂ ಸಂಘರ್ಷಕ್ಕೆ ಪರಿಹಾರ ಕಂಡು ಕೊಳ್ಳುವ ವಿವೇಕಾನಂದ ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಸಂಸ್ಥೆಯ ಸಂಸ್ಥಾಪಕರಲ್ಲಿ ಒಬ್ಬರು. ಐಐಟಿ ಮುಂಬೈ ಅತಿಥಿ ಉಪನ್ಯಾಸಕರು. ಅರ್ಥಶಾಸ್ತ್ರ, ವಿತ್ತೀಯ ನಿರ್ವಹಣೆ ಪರಿಣತರು. ಸಸ್ತ್ರ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದ ಕಾನೂನು ಮಾನವಶಾಸ್ತ್ರದ ಪ್ರಸಿದ್ಧ ಪ್ರಾಧ್ಯಾಪಕರೂ ಹೌದು.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్