Omicron: మరోసారి ఆంక్షల చట్రంలోకి కర్ణాటక.. వ్యాక్సిన్ తప్పనిసరి, వేడుకలపైనా పరిమితులు

By Siva KodatiFirst Published Dec 3, 2021, 5:25 PM IST
Highlights

కర్ణాటకలో (karnataka) రెండు ఒమిక్రాన్ వేరియంట్‌లు (omicron cases in india) నమోదవ్వడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు కట్టడి చర్యలు మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. రెండు డోసులు వేసుకున్న వారికి ఆఫీసుల్లోకి అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది

కర్ణాటకలో (karnataka) రెండు ఒమిక్రాన్ వేరియంట్‌లు (omicron cases in india) నమోదవ్వడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు కట్టడి చర్యలు మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. రెండు డోసులు వేసుకున్న వారికి ఆఫీసుల్లోకి అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే కర్ణాటకలో కరోనా కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు అధికారులు. వేడుకలు, ఇతర కార్యక్రమాల్లో 500 మందికే అనుమతి అని ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం. విద్యార్ధుల తల్లిదండ్రులకు కూడా రెండు డోసుల వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేశారు. అయితే ఎయిర్‌పోర్టుల్లో కరోనా పరీక్షలు తప్పనిసరి చేసింది కర్ణాటక ప్రభుత్వం. ప్రస్తుతానికి రాత్రి కర్ఫ్యూ మాత్రం విధించడం లేదని తెలిపింది కర్ణాటక ప్రభుత్వం. 

కర్ణాటకలోకి ఎంటరైన ఈ డేంజర్ వైరస్ ఎప్పుడు ఏ రాష్ట్రంలోకి వెలుగు చూస్తుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేవీ ఆసుపత్రిలో 12 మంది ఒమిక్రాన్ అనుమానితులు చేరారు. వీరిలో 8 మంది నిన్ననే ఆసుపత్రులకు రాగా.. మరో నలుగురు ఇవాళ చేరినట్లుగా తెలుస్తోంది. ఇవాళ చేరిన వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మిగిలిన వారి పరీక్షల ఫలితాలు రావాల్సి వుంది. వీరిలో యూకే నుంచి ఇద్దరు, ఫ్రాన్స్ , నెదర్లాండ్స్ నుంచి మరొకరు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే వీరి నమూనాలను జీనోమ్ సీక్వెన్స్‌కు పంపించబోతున్నారు అధికారులు. 

Also Read:ఒమిక్రాన్ వేరియంట్‌.. కేంద్రం కీల‌క వ్యాఖ్య‌లు

మరోవైపు ఒమిక్రాన్‌పై అప్రమత్తంగా వుండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది. ఒమిక్రాన్ లక్షణాలను బట్టి అది మరిన్ని రాష్ట్రాలకు విస్తరించవచ్చు. రానున్న రోజుల్లో మరికొన్ని కొత్త కేసులు భారత్‌లో బయటపడొచ్చని హెచ్చరించింది కేంద్రం. అయితే వేగంగా వ్యాక్సినేషన్ జరగడంతో వ్యాప్తి తీవ్రత తక్కువగా వుండొచ్చని అంచనా వేస్తోంది. ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవాలని కోరింది కేంద్రం. వైర‌స్ క‌ట్ట‌డికి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్న ప్ర‌భుత్వం.. టీకాల‌పై ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. 

SARS-CoV-2 ఒమిక్రాన్ వేరియంట్‌పై ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్‌లు పనిచేయవని సూచించడానికి ఎటువంటి ఆధారాలు లేవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. అయితే, కొన్ని ఉత్ప‌రివ‌ర్త‌నాల కార‌ణంగా కొద్దిమేర సామ‌ర్థ్యం త‌గ్గవ‌చ్చున‌ని పేర్కొంది.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఒమిక్రాన్‌పై భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్న‌ప్ప‌టికీ.. కొత్త వేరియంట్ కు సంబంధించి పూర్తి డేటా అందుబాటులో లేద‌ని తెలిపింది. ఒమిక్రాన్ వ్యాప్తి, ప్ర‌భావం వంటి ప‌లు అంశాల‌కు సంబంధించిన డేటా కోసం చేస్తున్నామ‌ని వెల్ల‌డించింది. ఒమిక్రాన్‌ను ఆందోళ‌న‌ర‌మైన వేరియంట్‌గా WHO  ప్ర‌క‌టించింది. 
 

click me!