
Online Gaming Bill : ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఇప్పటికే లోక్ సభ ఈ బిల్లును ఆమోదించగా తాజాగా రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొందింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు... అయితే గందరగోళం మధ్యే ఇది ఆమోదం పొందింది. అమాయక ప్రజలకు డబ్బులు ఆశచూపే ఆన్లైన్ గేమ్స్ పై కఠినంగా వ్యవహరించడమే కాదు మంచి ఆన్లైన్ గేమ్స్ ను ప్రోత్సహించేలా ప్రభుత్వం రూపొందించిన చట్టాలు ఇక అమల్లోకి రానున్నాయని మంత్రి పేర్కొన్నారు.
భారత ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును ఆమోదించడం వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ గేమింగ్ పరిశ్రమలో కీలక మలుపుగా చెప్పవచ్చు. బుధవారం లోక్‌సభ, గురువారం రాజ్యసభ ఆమోదించిన ఈ బిల్లు అన్ని రియల్ మనీ ఆన్‌లైన్ గేమ్‌లను నిషేధిస్తుంది. ప్రజలు ఆన్లైన్ గేమ్స్ ద్వారా ఆర్థిక మోసాలకు గురికాకుండా ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు ఈ చట్టాలు ఉపయోగపడతాయి.
పార్లమెంట్ ఆమోదం తర్వాత ఇది చట్టంగా మారాలంటే రాష్ట్రపతి ఆమోదాన్ని పొందాల్సివుంటుంది. ఆన్ లైన్ గేమింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా కొనసాగుతున్న జూదం, మనీలాండరింగ్, ఆర్థిక మోసాలను అరికట్టడానికే ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కొన్ని ఆన్లైన్ గేమ్స్ ఉగ్రవాద కార్యకలాపాల కోసం వాడుతున్నారని... ఇవి దేశ భద్రతకే ముప్పు తెస్తున్నాయని మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రమాదకరమైన ఆన్లైన్ గేమ్స్ పై ఉక్కుపాదం మోపనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.