
బెంగళూరు: కర్ణాటక మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ లేదా ఆన్‌లైన్ బెట్టింగ్‌పై నిషేధం విధిస్తూ నిర్ణయం చేసింది. అయితే, లాటరీ, గుర్రపు పందేలపై బెట్టింగ్‌ను నిషేధించలేదు. హైకోర్టు సూచనలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు న్యాయశాఖ, అసెంబ్లీ వ్యవహారల శాఖ మంత్రి జేసీ మధుస్వామి మీడియాకు వెల్లడించారు. గతేడాది నవంబర్‌లో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ను నిషేధిస్తూ తమిళనాడు ఆర్డినెన్స్ జారీ చేసింది. కాగా, కేరళ ఈ ఏడాదే ఆన్‌లైన్ రమ్మీపై నిషేధం విధించడం గమనార్హం.
‘మేం కర్ణాటక పోలీసు చట్టాన్ని సవరిస్తున్నాం. హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌పై నిషేధం విధించే లక్ష్యంతో ఈ సవరణ చేస్తున్నాం. ఈ సవరణలను క్యాబినెట్ ఆమోదించింది. త్వరలోనే ఈ ప్రతిపాదనలను అసెంబ్లీలో ప్రవేశపెడుతాం’ అని మధుస్వామి తెలిపారు.
ఈ ముసాయిదా బిల్లు ప్రకారం ఆన్‌లైన్ గేమ్ అంటే, అన్నిరూపాల్లో బెట్టింగ్‌ను ప్రోత్సహించే గేమ్‌లన్నీ ఈ కోవ కిందకు వస్తాయి. డబ్బు రూపంలోని టోకెన్స్, వర్చువల్ కరెన్సీని గేమ్ ముందు లేదా తర్వాత ఎలక్ట్రానిక్ పద్ధతిలో ట్రాన్స్‌ఫర్ చేయడమూ ఈ నిర్ణయంతో నిషేధానికి గురవుతుందని మంత్రి వివరించారు. అయితే, లాటరీలు, గుర్రం పందేలపై బెట్టింగ్‌లు అది రాష్ట్రంలోనైనా, వెలుపుల అయినా నిషేధం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 13న మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లులను ప్రవేశపెడుతామని తెలిపారు.
అన్ని రూపాల్లో జరుగుతున్న ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్‌లపై నిషేధం విధించాలని హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ఈ పిటిషన్ విచారిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. వీటిని నిషేధించడానికి బిల్లు ముసాయిదాను రూపొందిస్తున్నట్టు జులైలో హైకోర్టుకు తెలిపింది.