
జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశాల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ శత్రు దుర్భేధ్యేయంగా మారిపోయింది. సాయుధ బలగాలు, ఎన్ఎస్జీ, ఎస్పీజీ, ఢిల్లీ పోలీసులు డేగ కళ్లతో పహారా కాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా ఫుడ్ డెలివరీ చేసుకునే వారికి చేదు వార్త. సెప్టెంబర్ 8 నుంచి 10వ తేదీల్లో జరిగే జీ 20 దేశాధినేతల సదస్సు సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో వుంచుకుని ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలు నగరంలో అందుబాటులో వుండవని ఆయా సంస్థలు ప్రకటించాయి. ఎన్‌డీఎంసీ ప్రాంతంలో తాము వాణిజ్య సేవలను నిలిపివేసినందున క్లౌడ్ కిచెన్‌లు, ఫుడ్ డెలివరీలు, అమెజాన్ డెలివరీల వంటి వాణిజ్య డెలివరీలు అనుమతించబడవని స్పెషల్ పోలీస్ కమీషనర్ ఎస్ఎస్ యాదవ్ తెలిపారు.
Also Read: G-20: భారత్‌లోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ భరత్ మండపం.. జీ 20 సదస్సుకు వేదిక
ఇదే సమయంలో జీ 20 సమావేశాల సందర్భంగా నగరంలో లాక్‌డౌన్ అమలు చేస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఢిల్లీ పోలీసులు ఖండించారు. వర్చువల్ హెల్ప్ డెస్క్‌లో అందుబాటులో వున్న ట్రాఫిక్ సమాచారంతో మిమ్మల్ని మీరు అప్‌డేట్ చేసుకోండి అంటూ ఢిల్లీ పోలీసులు తెలిపారు. నగరంలో పటిష్టమైన ట్రాఫిక్ ఏర్పాట్లను కూడా ప్రకటించారు. సెప్టెంబర్ 7 అర్ధరాత్రి నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఢిల్లీలోకి వాహనాల రాకపోకలపై నిషేధం వుంటుందన్నారు. ధౌలా కువాన్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు వుంటాయన్నారు. గురుగ్రామ్‌లోని కంపెనీలకు సెప్టెంబర్ 8న వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయాలని పోలీసులు సూచించారు.
ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 10 వరకు సెలవు దినంగా ప్రకటించింది. అలాగే నగరంలోని దుకాణాలు, వ్యాపారాలు, వాణిజ్య సంస్థల యజమానులు తమ ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవులను అందించాలని ఆదేశించింది. అలాగే సమ్మిట్ సందర్భంగా ఢిల్లీలో హై అలర్ట్ అమల్లో వుంటుంది. ప్రపంచ దేశాధినేతలకు ఢిల్లీ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో దాదాపు లక్ష మందికి పైగా భద్రతా సిబ్బంది నగరంలో మోహరించారు.