
ఎంఎస్పీకి చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రైతు సంఘాలు చేపడుతున్న నిరసనలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో సంయుక్త కిసాన్ మోర్చా, ఇతర రైతు సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో దేశ వ్యాప్తంగా నేడు నిరసనలు కొనసాగనున్నాయి.
ఉదయం 6 గంటలకు ప్రారంభమైన భారత్ బంద్ సాయంత్రం 4 గంటల వరకు అమల్లో ఉంటుంది. నిరసన తెలుపుతున్న రైతులు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రధాన భారతీయ రహదారులపై భారీ 'చక్కా జామ్'లో పాల్గొంటారు. ఈ బంద్ వల్ల నేడు అనేక పనులకు ఆటకం కలిగే అవకాశం ఉంది. అయితే అత్యవసర సేవలకు మాత్రం రైతు సంఘాలు మినహాయింపు ఇచ్చాయి.
ఈ బంద్ కు కాంగ్రెస్‌తో పాటు పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి.. కాగా గురువారం అర్థరాత్రి వరకు చండీగఢ్‌లో ముగ్గురు కేంద్ర మంత్రులతో రైతు సంఘాల నాయకులు మారథాన్ చర్చలు జరిగాయి. అయితే ఇందులో చర్చలు కొలిక్కి రాలేదు. దీనిపై కేంద్ర మంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ.. చర్చలు సానుకూలంగా ముగిశాయని, మరో సమావేశం ఆదివారం (ఫిబ్రవరి 18న) జరుగుతుందని చెప్పారు.
రైతుల నిరసనల నేపథ్యంలో ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అలాగే సమావేశాల నిర్వహణకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అయితే రైతుల నిరసనకు పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ మాన్ సంఘీభావం తెలిపారు. పారామిలటరీ దళాలు రైతులను రెచ్చగొట్టేందుకు డ్రోన్లను ఉపయోగించడం, హర్యానాతో రాష్ట్ర సరిహద్దుల్లో ముళ్ల కంచెలు వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిని సవతి తల్లి ప్రేమగా అభివర్ణించారు.