Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్లను రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సుప్రీంకోర్టు వాటిని రద్దు చేసింది. ఈ తీర్పు ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఈ పథకాన్ని 2018లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేయగా.. ఈ బాండ్ల ద్వారా ఏయే రాజకీయ పార్టీకి ఎంత విరాళం దక్కించుకుందో ఓ లూక్కేద్దాం..
Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల విషయంలో రాజకీయ పార్టీలకు ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల నిధుల్లో పారదర్శకత తీసుకురావాలనే వాదనతో ప్రారంభించిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ను రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది.పార్టీలకు ఎన్నికల ఫండింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని ఓటర్ల హక్కుగా అభివర్ణిస్తూ ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం వాటిని రద్దు చేసింది.
2019 నుంచి ఇప్పటివరకు జారీ చేసిన అన్ని బాండ్ల కొనుగోలుదారులు, వాటిని తీసుకున్న పార్టీల సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఇది కాకుండా..అన్ని రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాలను తన వెబ్‌సైట్‌లో బహిరంగపరచాలని ఎన్నికల కమిషన్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. వ్యాపార సంస్థల నుండి చాలా మంది వ్యక్తులు పార్టీలకు ఎన్నికల విరాళాలు ఇస్తున్నారు. 2022-23లో ఒక్కో పార్టీ ఎంత విరాళాన్ని పొందిందో ఓ లూక్కేద్దాం.
మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయ పార్టీలపై తీవ్ర ప్రభావం చూపించనుంది. ఇందులో ప్రధానంగా ఈ తీర్పుతో అధికార బీజేపీకి గట్టి దెబ్బే అని చెప్పాలి. దీనికి ప్రధానం కారణం.. ఇప్పటివరకు ఈ ఎన్నికల బాండ్ల రూపంలో ఆయా రాజకీయ పార్టీలు పొందిన విరాళాల్లో బీజేపీనే టాప్ ఫ్లేస్ లో ఉంది. ఈ క్రమంలో ఇప్పటివరకు 30 విడతల్లో కలిపి సుమారు 28వేల ఎన్నికల బాండ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విక్రయించింది. ఈ బాండ్ల మొత్తం విలువ రూ.16,518 కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది.
2017-18 నుంచి 2022-23 వరకు ఈ బాండ్ల ద్వారా ఏయే జాతీయ రాజకీయ పార్టీ ఎంత విరాళం దక్కిందన్న వివరాలను సుప్రీంకోర్టు తన తాజా తీర్పులో పేర్కొంది. ఈ వివరాల ప్రకారం బీజేపీ రూ.6,565 కోట్లు పొందగా..తెలుగు దేశం అత్యల్పంగా రూ.146 కోట్ల విరాళాలను అందుకుంది.
సుప్రీంకోర్టు తన తాజా తీర్పులో పేర్కొన్న వివరాల ప్రకారం...
బీజేపీ - రూ.6,565 కోట్లు
కాంగ్రెస్ - రూ. 1,122 కోట్లు
తృణమూల్ కాంగ్రెస్ - రూ. 1,093 కోట్లు
బిజూ జనతాదళ్ - రూ.773 కోట్లు
డీఎంకే - రూ.617కోట్లు
బీఆర్ఎస్ - రూ. రూ.383 కోట్లు
వైఎస్సార్సీపీ - రూ.382.44 కోట్లు
టీడీపీ - రూ.146 కోట్లు