
రాజస్థాన్‌లోని దౌసాలో వెయ్యి కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 65 డిటోనేటర్లు, 13 వైర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాన్ని అక్రమ మైనింగ్‌కు వినియోగించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. విశేషమేమిటంటే.. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే మొదటి దశను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 12వ తేదీన దౌసాకు వస్తున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా జిల్లా యంత్రాంగం, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో భారీ ఎత్తున సోదాలు నిర్వహించగా.. గురువారం భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి.
ప్రధాని పర్యటనకు ఏమైనా లింక్ ఉందా?
స్వాధీనం చేసుకున్న వాటిలో 65 డిటోనేటర్లు, 360 పేలుడు షెల్స్, 13 కనెక్టింగ్ వైర్లు ఉన్నాయి. అరెస్టయిన నిందితుడిని రాజేష్ మీనాగా గుర్తించారు. ప్రధానమంత్రి పర్యటనతో దీనికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పేలుడు పదార్థాన్ని అక్రమ మైనింగ్‌లో ఉపయోగిస్తారని తేలింది. అలాగే ఈ పేలుడు పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి సరఫరా చేయాల్సి ఉంది అనే సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. 1000 కిలోలకు పైగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సదర్ పోలీస్ స్టేషన్ అధికారి సంజయ్ పూనియా తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరిపిన తర్వాతే నిజం బయటపడనున్నదని తెలిపారు.
ఫిబ్రవరి 12న దౌసాకు రానున్న ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ఫిబ్రవరి 12న ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవానికి రాజస్థాన్ లోని దౌసాకు రానున్నారు. దాదాపు 12 లేన్‌లతో రూపొందించిన తొలి ఎక్స్‌ప్రెస్‌వే ఇదే. దీని మీద గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు పరుగెత్తుతాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇప్పుడు ఢిల్లీ నుండి జైపూర్ మరియు దౌసా చేరుకోవడానికి కేవలం 2 గంటలు పడుతుంది. ఢిల్లీ-ముంబై కారిడార్ పూర్తయితే కేవలం 12 గంటల్లో ఢిల్లీ నుంచి ముంబై చేరుకోవడం సాధ్యమవుతుందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు చెబుతున్నారు.
గతేడాది ఉదయ్‌పూర్‌లో కల్వర్టు పేల్చివేత
గతేడాది నవంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో రైల్వే ట్రాక్ పేలుడు ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఇక్కడ రెండు రోజుల్లోనే సోమ్ నదిలో 252 కిలోల పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరోసారి 1000 కిలోల పేలుడు పదార్థాలు లభించడంతో పోలీసులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు.