
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) చీఫ్, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో.. ఆయనను గురువారం రాంచీలోని మేదాంత ఆసుపత్రిలో చేర్చారు. నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అమిత్ పర్యవేక్షణలో శిబు సోరెన్ చికిత్స పొందుతున్నాడు. ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని, ఆయన అప్పటికే కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లుగా వైద్యులు తెలిపారు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో ఆయనను ముందస్తుగా ఆస్పత్రిలో చేర్పించారనీ, ఆక్సిజన్ అందించిన తర్వాత శిబు సోరెన్ పరిస్థితి కొంతవరకు మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. వైద్యపరీక్షలు నిర్వహించిన తరువాత.. ఆయన ఛాతీలో కొంత నీరు చేరడంతోనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడినట్లు వైద్యులు నిర్దారించారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారనీ, ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని డాక్టర్ అమిత్ కుమార్ తెలిపారు.
ఆయన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
సీనియర్ JMM నాయకుడు సుప్రియో భట్టాచార్య మాట్లాడుతూ..చలి కారణంగా శిబు సోరెన్ ఆరోగ్యం క్షీణించిందని అన్నారు. ఫిబ్రవరి 4న ధన్‌బాద్‌లో జేఎంఎం 51వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాజరైన తర్వాత ఆయన కొంత అస్వస్థతకు గురైనట్టు తెలిపారు. అనంతరం ఇంట్లో చికిత్స చేస్తున్న వైద్యుడు మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రిలో చేర్పించాలని సూచించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందనీ, చింతించ వలసింది ఏమిలేదని తెలిపారు. ఇదిలావుంటే, శిబూ సోరెన్ ఆరోగ్యం క్షీణించన విషయం తెలుసుకున్న JMM నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుంటున్నారు.