Odisha Train Accident: ఆ తప్పిదమే ప్రమాదానికి కారణమా?: నిపుణుల ప్రాథమిక నివేదిక ఏం చెబుతుందంటే..

By Sumanth KanukulaFirst Published Jun 3, 2023, 3:52 PM IST
Highlights

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ఈ ప్రమాదంపై రైల్వే అధికారుల బృందం ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ఈ ప్రమాదంపై రైల్వే అధికారుల బృందం ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 'సిగ్నలింగ్ వైఫల్యం' కారణంగా ఒడిశా రైలు ప్రమాదం జరిగిందని నిపుణుల బృందం ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. లూప్ లైన్‌లో ఉన్న గూడ్స్ రైలును 12841 షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టి పట్టాలు తప్పిందని నిపుణులు బృందం తెలిపింది. ‘‘12841 షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ కోసం అప్ మెయిన్ లైన్ కోసం సిగ్నల్ ఇవ్వబడింది.  ఆ తర్వాత ఆపివేయబడింది. ఈ క్రమంలోనే రైలు లూప్ లైన్‌లోకి ప్రవేశించి.. అప్ లూప్ లైన్‌లో ఉన్న గూడ్స్ రైలుతో ఢీకొని పట్టాలు తప్పింది’’ నిపుణుల నివేదిక పేర్కొంది. 

‘‘అదే సమయంలో రైలు నంబర్ 12864 (యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్) డౌన్ మెయిన్ లైన్ గుండా వెళ్లింది. దానిలోని రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. బోల్తా పడ్డాయి’’ అని నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక పేర్కొంది. సాయంత్రం 6.55 గంటలకు ప్రమాదం జరిగిందని తెలిపింది. ప్రమాదంలో 21 కోచ్‌లు పట్టాలు తప్పాయని తెలిపింది. అయితే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ సిగ్నల్ ఇచ్చి ఎందుకు టేకాఫ్ చేశారన్నది మాత్రం నిపుణుల బృందం ప్రాథమిక నివేదికలో స్పష్టం చేయలేదు. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు సమగ్ర దర్యాప్తులో మాత్రమే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 

Also Read: ఏపీలో తప్పిన రైలు ప్రమాదం.. గేట్‌మెన్ నిర్లక్ష్యం.. లోకో పైలట్ సకాలంలో స్పందించడంతో..

ఇక, ఒడిశాలో రైలు ప్రమాద స్థలాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం పరిశీలించారు. ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి, ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి, సహాయక చర్యల గురించి ఆరా తీసిన అనంతరం అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇది పెద్ద విషాదకరమైన ప్రమాదం. రైల్వే, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నాయి. సాధ్యమైనంత ఉత్తమమైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందించబడతాయి. ఈ ప్రమాదంపై వివరణాత్మక ఉన్నత స్థాయి విచారణ నిర్వహించబడుతుంది. రైలు భద్రతా కమిషనర్ స్వతంత్ర విచారణ కూడా చేస్తారు’’ అని చెప్పారు. ప్రస్తుతం తమ దృష్టి రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లపై ఉందని తెలిపారు. జిల్లా యంత్రాంగం నుంచి అనుమతి వచ్చిన తర్వాత పునరుద్ధరణ ప్రారంభిస్తామని చెప్పారు. రైలు ప్రమాదానికి గల కారణాలు విచారణ తర్వాత తెలుస్తాయని పేర్కొన్నారు.

Also Read: ఇది రాజకీయాలకు సమయం కాదు.. ఆ పరికరం రైలులో ఉంటే ఈ విషాదం జరిగేది కాదు.: మమతా బెనర్జీ

ఇదిలా ఉంటే, జూన్ 2 సాయంత్రం ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలుతో జరిగిన భారీ ప్రమాదంలో కనీసం 261 మంది ప్రయాణికులు మరణించారు. 900 మందికి పైగా గాయపడ్డారు. 

click me!