బ్లాక్ ఫ్రైడే : 14 ఏళ్ల క్రితం కూడా కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం, అప్పుడూ శుక్రవారమే.. నాడు ఒడిషాలోనే

By Siva KodatiFirst Published Jun 3, 2023, 3:08 PM IST
Highlights

కోరమండల్ ఎక్స్‌ప్రెస్ 14 ఏళ్ల క్రితం ఒడిషాలోనే , శుక్రవారం పూట ప్రమాదానికి గురైంది. నాటి ఘటనలో 16 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు రైల్వే రికార్డులు చెబుతున్నాయి. 
 

ఒడిషాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పటి వరకు ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 300కు చేరువైనట్లుగా తెలుస్తోంది. మరోవైపు.. తమ వారి క్షేమ సమాచారంపై బంధువులు, సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరికోసం రైల్వే శాఖ హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. అటు కేంద్ర ప్రభుత్వం ఘటనాస్థలిలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. కటక్, భద్రక్, బాలేశ్వర్, మయూర్‌భంజ్, భువనేశ్వర్ తదితర ప్రాంతాలకు వందలాది మంది క్షతగాత్రులను తరలించారు. సహాయక చర్యల కోసం హెలికాఫ్టర్లను రంగంలోకి దించింది వాయుసేన. 

కాగా.. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ గతంలోనూ ప్రమాదానికి గురైంది. 2009 ఫిబ్రవరి 13న జైపూర్ రోడ్ రైల్వేస్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురైంది. నాటి ఘటనలో ట్రాక్ మార్చుకుంటున్న సమయంలో రైలు అదుపుతప్పి బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే యాదృచ్చికమో , దురదృష్టమో కానీ నాటి ఘటన కూడా శుక్రవారమే జరిగింది. అప్పుడు కూడా రాత్రి 7.30 గంటల నుంచి 7.40 గంటల మధ్య ప్రమాదం జరిగింది. దీంతో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ను బ్లాక్ ఫ్రైడే వెంటాడుతుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. అయితే నాటి ఘటనలో కేవలం పట్టాలు తప్పగా.. నేటి ఘటనలో ఒకేసారి మూడు రైళ్లు ఢీకొట్టుకోవడంతో తీవ్రత అధికంగా వుంది. 

ALso Read: ఒడిశా రైలు ప్రమాదాన్ని ‘కవచ్’ ఎందుకు ఆపలేకపోయింది.. ? ఆ టెక్నాలజీ ఫెయిల్ అయ్యిందా.. ? అసలేం జరిగిందంటే

మరోవైపు.. ప్రస్తుతం ఘటన స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తైనట్టుగా రైల్వే శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఘటన స్థలంలో రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనులు జరుగుతున్నాయి. ‘‘రెస్క్యూ ఆపరేషన్‌ పూర్తి చేసి పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. మేము ఈ ప్రమాదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూస్తాము’’ అని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆయన ప్రస్తుతం ఘటన స్థలంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రైలు ప్రమాదం జరిగిన మార్గంలో కవచ్ సౌకర్యం లేదని రైల్వే శాఖ అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు. 

click me!