రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. క్షేతస్థాయిలోకి వచ్చి తనపై పోటీ చేసి గెలవాలని అన్నారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్ లో జరిగిన బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేశారని ఆరోపించారు.
‘మీ నాయకుడు (రాహుల్ గాంధీ) ఎన్నికల్లో వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని సవాల్ విసురుతున్నాను. మీరు పెద్ద పెద్ద స్టేట్ మెంట్లు ఇస్తూనే (కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి) ఉన్నారు. క్షేత్రస్థాయికి వచ్చి నాపై పోరాడండి.’’ అని అన్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారు చాలా విషయాలు చెబుతారని, కానీ ఆ పార్టీ హయాంలో బాబ్రీ మసీదు, సెక్రటేరియట్ మసీదును కూల్చివేశారని ఆరోపించారు.
ఇటీవల తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఒవైసీ ఈ విధంగా స్పందించారు. ఆ సభలో తెలంగాణ బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పని చేస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ కూటమికి వ్యతిరేకంగా తమ పార్టీ పోరాడుతోందని తెలిపారు. ‘‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాత్రమే కాకుండా.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంతో కలిసి పోరాడుతోంది. వారు తమను తాము వేర్వేరు పార్టీలుగా చెప్పుకుంటారు. కానీ వారు ఐక్యంగా పనిచేస్తున్నారు’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీలపై సీబీఐ, ఈడీ కేసులు లేవని రాహుల్ గాంధీ అన్నారు. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ వారిని తమ సొంత మనుషులుగా భావిస్తున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలో ఈ సారి విజయం సాధించేందుకు విశ్వప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన కూడా చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఆరు ప్రధాన హామీలను కూడా ఆ పార్టీ ప్రకటించింది.