నేడు నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత: 3700 కిలోల పేలుడు పదార్ధాల వినియోగం

By narsimha lodeFirst Published Aug 28, 2022, 9:53 AM IST
Highlights

నోయిడాలోని ట్విన్ టవర్స్ ను ఆదివారం నాడు మధ్యాహ్నం రెండున్నర గంటలకు కూల్చివేయనున్నారు. ఈ భవనాల కూల్చివేతకు రూ. 20 కోట్లు కేటాయించారు. ట్విన్ టవర్స్ విలువ రూ. 1200 కోట్లు ఉంటుంది. బహుళ అంతస్తుల భవనం నిబంధనలకు విరుద్దంగా నిర్మించారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 


న్యూఢిల్లీ: నోయిడాలోని ట్విన్ టవర్స్ ను ఆదివారం నాడు మధ్యాహ్నం రెండున్నర గంటలకు కూల్చివేయనున్నారు.  ఈ  భవనాల విలువ రూ. 1200 కోట్లు ఉంటుంది. ట్విన్ టవర్స్ కూల్చివేతకు రూ. 20 కోట్లకు పైగా ఖర్చుచేయనున్నారు.

పేలుడు పదార్ధాలతో ఈ ట్విన్ టవర్స్ కూల్చివేయనున్నారు. సినిమాల్లో చూపించినట్టుగా క్షణాల వ్యవధిలో భారీ భవంతులు నేల మట్టం కానున్నాయి. ఇవాళ మధ్యాహ్నమే ఈ భవనాలను కూల్చివేయనున్నందున   చివరిసారిగా ఈ భవనాలు ముందు సెల్ఫీలు దిగేందుకు పెద్ద ఎత్తున స్థానికులు ఇక్కడకు వస్తున్నారు.

ఈ ట్విన్ టవర్స్ ను కూల్చివేసేందుకు  3700 కిలోల పేలుడు పదార్దాలను ఉపయోగిస్తున్నారు.  నోయిడాలో జంట భవనాల కూల్చివేతకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ టవర్స్ కూల్చివేత కోసం అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.ఈ భవనాల చుట్టుపక్కల నివాసం ఉంటున్నవారిని ముందు జాగ్రత్తగా ఇక్కడి నుండి ఖాళీ చేయించారు. 

ఈ టవర్స్ కూల్చివేత సమయంలో గ్రేటర్ నోయిడా ఎక్స్ ప్రెస్ హైవే సుమారు 30 నిమిషాల పాటు వాహనాలను నిలిపివేయనున్నారు. ఈ భవనాల కూల్చివేత కారణంగా ఏర్పడిన వ్యర్ధాల తొలగింపునకు మూడు మాసాల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

దేశ రాజధాని ఢిల్లీకి 50 కి.మీ దూరంలోని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో సూపర్ టెక్ సంస్థ ఈ ట్విన్ టవర్స్ ను నిర్మించింది. 40 అంతస్థులతో ఈ భవనాలను నిర్మించారు.బహుళ అంతస్థుల బిల్డింగ్ లో ఫ్లాట్స్ కొనుగోలు చేసిన వారికి సూపర్ టెక్ సంస్థ పరిహారాన్ని చెల్లించనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వ తేదీ లోపుగా పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు సూపర్ టెక్ సంస్థను ఆదేశించింది. 

ట్విన్ టవర్స్ లో 915 ప్లాట్స్ లో  633 ఫ్లాట్స్ బుక్ అయ్యాయి. ఫ్లాట్స్ కొనుగోలు దారుల నుండి సూపర్ టెక్ సంస్థ రూ. 180 కోట్లను సేకరించింది. ఈ భవనాలను కూల్చివేయనుండడంతో కొనుగోలుదారులకు 12 శాతం వడ్డీని కలిపి పరిహారం చెల్లించనున్నారు. 59 ఫ్లాట్స్ కొనుగోలు దారులకు మాత్రమే పరిహారం చెల్లించాల్సి ఉందని సూపర్ టెక్ సంస్థ చెబుతుంది. మిగిలిన వారికి ప్రత్యామ్నాయం చూపినట్టుగా ఆ సంస్థ తేల్చి చెప్పింది. 

ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే ఈ భవనాలు 100 మీటర్లు ఎత్తులో ఉన్నాయి.  ట్విన్ టవర్స్ లో ఒకటి 103 మీటర్ల ఎత్తులో ఉంది. మరోటి 97 మీటర్లు మాత్రమే. ఈ బహుళ అంతస్తుల భవనం కూల్చివేతకు నిర్మాణ సంస్థ భారీగానే ఖర్చు చేయనుంది.  ఒక్కో చదరపు అడుగుకు రూ. 267 ఖర్చు చేయనున్నారు. ట్విన్ టవర్స్ లో 7.5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేశారు.  ఈ భవనాల కూల్చి వేత కోసం సూపర్ టెక్ సంస్థ రూ. 5 కోట్లను ఖర్చే చేయనుంది. భవనాల కూల్చివేత కారణంగా వ్యర్ధాల విక్రయం ద్వారా మిగిలిన మొత్తాన్ని సమీకరించనున్నారు.

ఈ భనాల కూల్చివేత ద్వారా 55 వేల టన్నుల వ్యర్ధాలు వచ్చే అవకాశం ఉందని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు.  ఈ వ్యర్ధాల్లో 4 వేల టన్నుల మేరకు ఇనుము ఉండే అవకాశం ఉందని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. 

ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ ట్విన్ టవర్స్ ను కూల్చివేసే బాధ్యతను తీసుకుంది.  ముంబై  ఎడిఫైస్ సంస్థ ధక్షిణాఫ్రికాకు చెందిన జెట్ డెమోలిషన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ట్విన్ టవర్స్ ను కూల్చివేయనున్నాయి. 

రెసిడెంట్ వేల్ఫేర్ అసోసియేషన్ సమీపంలోని అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లు, ఏటీఎస్ గ్రీన్స్ విలేజ్, ఎమరాల్డ్ కోర్టు నివాసితులను ఇవాళ  ఉదయమే ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఎమరాల్డ్ కోర్టులో 15 టవర్లున్నాయి. ఏటీఎస్ లో సుమారు 25 టవర్లున్నాయి.

ఈ భవనాల కూల్చివేతకు సుమారు 100 మంది సిబ్బంది పనిచేయనున్నారు. భవనాల కూల్చివేత సమయంలో కూల్చివేతలో పాల్గొనే సిబ్బంది, పోలీసులు, డిజార్టర్ రెస్సాన్స్ ఫోర్స్ , ఎనిమిది అంబులెన్స్ లు, నాలుగు ఫైర్ ఇంజన్లను సిద్దం చేశారు.

2005 లో  న్యూ ఓఖ్లా ఇండస్ట్రీయల్ డెవలప్ మెంట్ అథారిటీలో 14 టవర్లు నిర్మించేందుకు సూపర్ టెక్ సంస్థ అనుమతిని పొందింది. ఒక్కొక్క టవర్ తొమ్మిది అంతస్థులతో నిర్మించాలని ఆమోదం పొందారు. అయితే 2009లో సూపర్ టెక్ సంస్థ తన ప్లాన్ ను మార్చింది. ట్విన్ టవర్స్ నిర్మించాలని తలపెట్టింది. దీన్ని అపెక్స్, సెయాన్ నోయిడా అథారిటీ  ఆమోదించింది. అయితే ఎవరాల్డ్ కోర్టు ఓనర్స్ , రెసిడెంట్స్ వేల్ఫేర్ అసోసియేషన్ 2012లో అలహాబాద్ కోర్టులో పిటిషన్  దాఖలు చేశారు. ట్విన్ టవర్స్  నిర్మాణం అక్రమమని ఈ పిటిషన్ లో ఆరోపించారు. 

2014లో అలహాబాద్ హైకోర్టు ట్విన్ టవర్స్ నిర్మాణం చట్టవిరుద్దమని తేల్చిచెప్పింది. వీటిని కూల్చివేయాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నోయిడా అథారిటీ, సూపర్ టెక్ సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2021 ఆగష్టు 31న అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది.కనీస దూరం పాటించకుండా ట్విన్ టవర్స్ నిర్మించినట్టుగా సుప్రీంకోర్టు గుర్తించింది. భవన నిర్మాణ నిబంధనలు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 
 

click me!