ఇజ్రాయిల్ కు చెందిన ఎన్ఎస్ వో గ్రూప్ (NSO group) తయారు చేసిన పెగాసస్ స్పైవేర్ (Pegasus Spyware) ఇప్పటికీ పలు దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించి ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర గాడ్జెట్స్ ను హ్యాక్ చేసి.. పౌరులపై నిఘా పెడుతున్నారని ఇటీవల ఓ అంతర్జాతీయ నివేదిక పలు వివరాలను వెల్లడించింది. మన దేశంలోనూ దీనిపై రాజకీయ రచ్చ నడిచింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం పెగాసస్.. ఎన్ ఎస్‌వో పై కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇజ్రయిల్‌కు చెందిన ఎన్ఎస్‌వో గ్రూప్ తయారు చేసిన పెగాసస్ స్పైవేర్ (Pegasus Spyware) ను ఉపయోగించి ప్రభుత్వం పౌరులపై నిఘా పెడుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి. దాదాపు రెండేండ్ల క్రితం ఈ అంశం దేశంలో తీవ్ర చర్చకు తెరలేపింది. ఏడాది జులైలో పెగాసస్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ స్పైవేర్‌ను ఉపయోగించి పౌరులపై నిఘా పెడుతున్నదని పలు మీడియా సంస్థలు సంచలన కథనాలు ప్రచురించాయి. దేశంలోని పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయనీ, దీని ద్వారా వారిపై నిఘా పెట్టారని గార్డియన్, వాషింగ్టన్ పోస్టు, లేమాండ్తో వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలతో పాటు దేశీయ మీడియా ది వైర్ సహా మొత్తం 17 మీడియా సంస్థల కథనాలు పేర్కొన్నాయి. దీనిపై దేశంలో రచ్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ అంశం తీవ్రతరమైన సుప్రీంకోర్టుకు సైతం చేరింది. దీనిపై కోర్టు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
Also Read: ఆర్థిక చాణక్యుడు.. అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోశయ్య
undefined
ఇదిలావుండగా, పెగాసస్ స్పైవేర్ (Pegasus Spyware) ను తయారు చేసిన ఎన్ఎస్‌వో గ్రూప్‌పై పలు దేశాలు నిషేధం విధించాయి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో అంశాన్ని పలువురు నేతలు లేవనెత్తారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్‌వో గ్రూపుపై నిషేధం విధించే ప్రణాళికలు లేవని తెలిపింది. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు విశంబర్ ప్రసాద్ నిషాద్, చౌదరి సుఖ్‌రాయ్ సింగ్ యాదవ్ లు.. “జర్నలిస్టులు, రాయబార కార్యాలయ సిబ్బంది, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించిన పెగాసస్ స్పైవేర్ అందించిన ఎన్ఎస్‌వో గ్రూపు (NSO group) ను అమెరికా బ్లాక్ లిస్టులో చేర్చిందా? చేరిస్తే.. దానికి సంబంధించిన వివరాలు, భారత్ ప్రభుత్వం ఎన్ఎస్‌వో గ్రూప్ (NSO group) పై నిషేధం విధించడం, సంబంధిత వివరాలు తెలియజేయాలంటూ" ప్రశ్నించారు. దీనికి కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. "ఈ మంత్రిత్వ శాఖ వద్ద అలాంటి సమాచారం ఏదీ అందుబాటులో లేదు. ఎన్‌ఎస్‌వో గ్రూపు పేరుతో ఏ గ్రూపును నిషేధించే ప్రతిపాదన లేదు" అని తెలిపారు.
Also Read: భారత్‌లో లక్షదిగువకు క్రియాశీల కేసులు.. మరోవైపు ఒమిక్రాన్ ఆందోళనలు
కాగా, నవంబర్ లో అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్.. ఇజ్రాయిల్ కు చెందిన రెండు స్పైవేర్ (NSO group) తయారీ కంపెనీలను బ్లాక్ లిస్టు చేసింది. వాటిని హానికరమైన సైబర్ కార్యకలాపాలకు పాల్పడే విదేశీ సంస్థల నిషేధిత జాబితాలో చేర్చింది. ఇదిలావుండగా, ఈ ఏడాది ఆగస్టులో ఇజ్రాయిల్ సైబర్ సెక్యూరిటీ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందా లేదా అనే వివరాలను కోరుతూ రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రం సంబంధిత వివరాలు వెల్లడించడానికి నిరాకరించింది. దీని తర్వాత పెగాసస్ స్పైవేర్‌పై రాజకీయ రచ్చ మొదలైంది. చివరకు పలు మీడియా సంస్థలతో పాటు పౌరహక్కుల కార్యకర్తలు సుప్రీంకోర్టులు పెగాసస్ (Pegasus Spyware) వ్యవహారం గురించి పిటిషన్ దాఖలు చేశారు. పలుమార్లు సుప్రీంకోర్టు దీనిపై విచారణ జరిపింది. అనంతరం సుప్రీంకోర్టు దీనిపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే, హ్యాక్ అయినట్టు భావిస్తున్న గాడ్జెట్స్ ను తమకు అందించాలని పిటిషన్ దారులను కోరింది.
Also Read: ఆర్థిక మంత్రిగా సరికొత్త ఒరవడిని తీసుకొచ్చిన కొణిజేటి రోశయ్య.. రాజకీయ ప్రస్థానం..