
ఢిల్లీ : కరోనా కొత్త వేరియంట్ సి.1.2 ను భారత్ లో గుర్తించలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటివరకు సి.1.2కు సంబంధించి దేశంలో ఎలాంటి కేసులు నమోదు నమోదు కాలేదని కేంద్రం చెప్పినట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. కొత్తగా పుట్టుకొచ్చిన తొలిసారి దక్షిణాఫ్రికాలో గుర్తించారు.
ప్రస్తుతం ఇది చైనా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ సహా ఆరు దేశాలకు వ్యాప్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇప్పటివరకు కనుగొన్న వేరియంట్లలో పోలిస్తే సి.1.2 ఎంతో ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.
ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టీకాల ద్వారా లభించిన రక్షణ సైతం ఈ వేరియంట్ తప్పించుకోగలదని నిపుణులు హెచ్చరించారు. అయితే, ప్రస్తుతానికి ఈ రకం వేరియంట్ భారత్ లోకి ప్రవేశించలేదని కేంద్రం వెల్లడించడం ఊరటనిస్తుంది.
కాగా, C.1.2 గా పిలిచే ఈ రకం వేరియంట్ ను మే లో గౌటెంగ్, మపుమలాంగా, దక్షిణాఫ్రికా రాజధాని ప్రిటోరియా ప్రావిన్సులు, జోహన్నెస్ బర్గ్ లలో కనుగొన్నామని శాస్త్రవేత్తలు ఓ పరిశోధనా పత్రంలో తెలిపారు. ఆగస్ట్ 13 నాటికి ఇది దక్షిణాఫ్రికాలోని తొమ్మిది ప్రావిన్సుల్లో ఆరు ప్రావిన్సుల్లో.. రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మారిషస్, పోర్చుగల్, న్యూజిలాండ్ స్విట్జర్లాండ్ లలో కనిపించింది.
వైరస్ లోని ఉత్పరివర్తనలు ‘పెరిగిన ట్రాన్స్ మిసిబిలిటీతో సంబంధం కలిగి ఉంటాయి’..అంతేకాదు ప్రతిరోధకాలను తప్పించుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘ఉత్పరివర్తనాల సమూహానికి సంబంధించి ఈ వేరియంట్ మీద దృష్టి పెట్టడం ముఖ్యం’ అని తెలిపారు.
covid 19 : ఆరు దేశాల్లో డేంజరస్ C.1.2 వేరియంట్.. ఆందోళనలో శాస్త్రవేత్తలు..
వైరస్ లో మార్పులు.. డెల్టా వేరియంట్ తో కరోనా వైరస్ లలో వేవ్ లకు కారణమవుతుంది. ఈ డెల్టా వేరియంట్ ముందు భారత్ లో కనుగొనబడింది. ఇదిప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంక్రమణ రేటును పెంచుకుంటుంది. ఈ ఉత్పరివర్తనాలను వేరియంట్లుగా ప్రపంచఆరోగ్య సంస్థ వర్గీకరిస్తుంది. వాటిని కనిపెట్టిన తరువాత వాటి తీవ్రత ఏ స్థాయిలో ఉంది అన్న దాన్ని బట్టి ఆందోళనకరమా, కాదా అనేది గుర్తిస్తుంది.
C. 1.2 అనేది 2020 మధ్యలో దక్షిణాఫ్రికాలో ఫస్ట్ వేవ్ కు కారణమైన C.1 నుంచి అభివృద్ధి చెందింది. ఇది చైనాలోని వుహాన్ లో కనుగొనబడిన అసలు వైరస్ కంటే 44 -55 ఉత్పరివర్తనాలు కలిగి ఉంది. క్రిస్ప్ అని పిలిచే క్వాజులు-నాటల్ రీసెర్చ్ ఇన్నోవేషన్ ప్లాట్ ఫాం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ కమ్యూనికబుల్ డిసీజెస్ తో సహా దక్షిణాఫ్రికా గ్రూపులు ఈ పరిశోధనను ప్రచురించాయి. మేలో ఈ వేరియంట్ 0.2 శాతం జన్యువులు కలిగి ఉన్నట్టు తేలగా, అది జూన్ లో 1.6 శాతం, జూలైలో 2 శాతానికి పెరిగింది.
టీకాలు వేసుకున్నవారిలో, వేసుకోని వారిలో ఈ వేరియంట్ ను యాంటీబాడీలు ఏవిధంగా న్యూట్రలైజ్ చేస్తున్నాయన్న అంశాన్ని మేము ప్రసుతం అంచనా వేస్తున్నామని శాస్త్రవేత్త అంటున్నారు. ఈ ఫలితాలు ఓ వారంలోగా చెబుతామని క్రిస్ప్ డైరెక్టర్ తులియోడి ఒలివెరా సోమవారం జరిగిన ఓ ఇమ్యునాలజీ సమావేశంలో చెప్పారు.