ఏ బీజేపీ నాయకుడూ జమ్మూ కాశ్మీర్‌లో ఇలా నడవలేరు.. హింసను ప్రేరేపించేవారు ఆ బాధను అర్థం చేసుకోలేరు: రాహుల్ గాంధీ

By Sumanth KanukulaFirst Published Jan 30, 2023, 3:25 PM IST
Highlights

జమ్మూ కాశ్మీర్‌లో తాను చేపట్టిన విధంగా యాత్ర చేపట్టాలని బీజేపీ నేతలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ సవాల్ విసిరారు. వారు భయంతో ఎప్పటికీ ఇలాంటి యాత్ర చేయలేరని అన్నారు.

జమ్మూ కాశ్మీర్‌లో తాను చేపట్టిన విధంగా యాత్ర చేపట్టాలని బీజేపీ నేతలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ సవాల్ విసిరారు. ఈ విధంగా బీజేపీ నాయకులు నడవలేరని అన్నారు. వారు భయంతో ఎప్పటికీ ఇలాంటి యాత్ర చేయలేరని విమర్శించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్‌లో సోమవారం భారీ సభ నిర్వహించారు. భారీగా హిమపాతం కురుస్తున్నప్పటికీ రాహుల్ గాంధీ, ఇతర నేతలు వేదికపై నుంచి ప్రసంగించారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్రలో తాను కలిసిన నలుగురు పిల్లల కథను వివరించారు. వారు బిచ్చగాళ్లు, వారు స్వెటర్లు ధరించలేదని.. శీతాకాలంలో చలికి వణుకుతున్నారని.. యాత్రలో జాకెట్ ధరించకుండా తనను ప్రేరేపించారని చెప్పారు.

భారత్ జోడో యాత్రతో తాను చాలా నేర్చుకున్నానని  చెప్పారు. ‘‘ఒకరోజు నాకు చాలా బాధ కలిగింది. నేను ఇంకా 6-7 గంటలు నడవాలని అనుకున్నాను. అది కష్టంగా ఉంది. కానీ ఒక యువతి నా దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి..నా కోసం ఏదో రాశానని చెప్పింది. ఆమె నన్ను కౌగిలించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. నేను ఆమె ఇచ్చిన పత్రాన్ని చదవడం మొదలుపెట్టాను  అందులో ఆమె.. 'మీ మోకాలి నొప్పిని నేను చూడగలను ఎందుకంటే మీరు ఆ కాలుపై ఒత్తిడి చేసినప్పుడు అది మీ ముఖం మీద కనిపిస్తుంది. నేను మీతో నడవలేను.. కానీ మీరు నా కోసం, నా భవిష్యత్తు కోసం నడుస్తున్నారని నాకు తెలుసు. అందుకే నా హృదయం మీ పక్కనే నడుసస్తోంది' అని రాశారు. ఆ క్షణంలోనే నా బాధ మాయమైంది’’ అని రాహుల్ పేర్కొన్నారు. 

తనపై దాడి జరగవచ్చనే కారణంతో జమ్మూ కాశ్మీర్ నేలపై నడవవద్దని తనకు భద్రతా సిబ్బంది సలహా ఇచ్చారని రాహుల్ గాంధీ చెప్పారు. మూడు, నాలుగు  రోజుల క్రితం తాను కాలినడకన వెళితే.. తనపై గ్రెనేడ్ విసిరివేస్తానని పరిపాలన అధికారులు తనకు చెప్పారని అన్నారు. అయితే తనను ద్వేషించేవారికి.. తన తెల్ల టీ షర్టు రంగును ఎరుపుగా మార్చడానికి అవకాశం ఇవ్వాలని అనుకున్నానని చెప్పారు. అయితే తాను ఊహించినట్టే జమ్మూ కాశ్మీర్ ప్రజలు తనకు ప్రేమను ఇచ్చారని.. గ్రెనేడ్ ఇవ్వలేదని అన్నారు. నిర్భయంగా జీవించమని తన కుటుంబం, గాంధీజీ తనకు నేర్పించారని అన్నారు. అలా ఉండకపోతే అది జీవించడం కాదని అన్నారు. 

మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యలు జరిగిన సమయాల్లో తనకు ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేసిన క్షణాలను గుర్తుచేసుకుంటూ రాహుల్ గాంధీ ఉద్వేగానికి లోనయ్యారు. హింసను ప్రేరేపించే వారు ఆ బాధను ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అన్నారు. ‘‘హింసను ప్రేరేపించే మోదీజీ, అమిత్‌ షాజీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి వారు ఈ బాధను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఆర్మీ మనిషి కుటుంబానికి అర్థం అవుతుంది, పుల్వామాలో మరణించిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కుటుంబీకులు అర్థం చేసుకుంటారు. కాశ్మీరీలు అర్థం చేసుకుంటారు. ఆ కాల్ వచ్చినప్పుడు బాధను అర్థం చేసుకోండి’’ అని కోరారు. 

ఇక, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్‌లోని షేర్-ఏ-కశ్మీర్ క్రికెట్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. భారీగా మంచు కురుస్తున్న లెక్కచేయకుండా నేతలు ప్రసంగాలు కొనసాగించారు. ఈ సభకు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ కార్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో డీఎంకే, జేఎంఎం, బీఎస్పీ, ఎన్‌సీ, పీడీపీ, సీపీఐ, ఆర్‌ఎస్‌పీ, వీసీకే, ఐయూఎంఎల్‌ల నేతలు కూడా హాజరయ్యారు. 

click me!