కశ్మీర్‌లోని హిందూ, బౌద్ధ చారిత్రక కట్టడాలపై సర్వే పూర్తి.. అంతర్జాతీయ గుర్తింపునకు ప్లాన్

By telugu teamFirst Published Nov 26, 2021, 2:19 PM IST
Highlights

జమ్ము కశ్మీర్‌లోయలో హిందూ, బౌద్ధ మతాలకు చెందిన పురాతన కట్టడాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. కశ్మీర్ లోయలో ఈ కట్టడాలకు సంబంధించి తొలిసారిగా నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ సమగ్ర సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా ఎన్ఎంఏ చైర్మన్ తరుణ్ విజయ్ కశ్మీర్ లోయలోని హిందూ, బౌద్ధ ఆలయాలు, ఆధ్యాత్మిక కట్టడాలను సర్వే చేశారు. అంతేకాదు, కశ్మీర్ లోయలోని కనీసం నాలుగు చారిత్రక కట్టడాలు, ప్రాంతాలకు అంతర్జాతీయ ఖ్యాతి లభించడానికి నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ ప్రయత్నాలు చేస్తున్నది.

న్యూఢిల్లీ: ఉగ్రవాదంతో కేవలం మానవ హననమే కాదు.. పురాతమైన వారసత్వ సంపద కూడా నాశనమవుతుంది. చారిత్రక కట్టడాలూ దెబ్బతిని కనుమరుగవుతాయి. జమ్ము కశ్మీర్‌లో ఏళ్ల తరబడి ఉగ్రవాద బెడద ఉన్న సంగతి తెలిసిందే. అయితే, కశ్మీర్‌ లోయలో అరుదైన హిందు, బౌద్ధ మతాలకు చెందిన నిర్మాణాలు, ఆలయాలు, ఆధ్యాత్మిక స్థలాలున్నాయి. ఉగ్రవాదం వీటినీ చెరిపేస్తున్నది. దీంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వీటి పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలోనే కశ్మీర్ లోయలో ముఖ్యమైన హిందు, బౌద్ధ మతాలకు చెందిన చారిత్రక కట్టడాలపై నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ తొలి సారిగా సమగ్ర సర్వేను పూర్తి చేసుకుంది. అంతేకాదు, కశ్మీర్ లోయలోని కనీసం నాలుగు చారిత్రక కట్టడాలు, ప్రాంతాలకు అంతర్జాతీయ ఖ్యాతి లభించడానికి నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ ప్రయత్నాలు చేస్తున్నది.

అంగవైకల్యం ఉన్నప్పటికీ, వీల్ చైర్‌లో ప్రయాణించాల్సి వచ్చినప్పటికీ నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ చైర్మన్ తరుణ్ విజయ్ కశ్మీర్ లోయలో పర్యటించి హిందు, బౌద్ధ కట్టడాలపై సమగ్ర సర్వే చేపట్టారు. ఉగ్రవాదం కేవలం కశ్మీరీల ప్రాణాలు తీయడమే కాదు.. అక్కడ ఉన్న హిందూ, బౌద్ధ ఆలయాలు, కట్టడాలనూ తీవ్రంగా దెబ్బతీసిందని ఎన్ఎంఏ చైర్మన్ తరుణ్ విజయ్ అన్నారు. ఆయన రైనావరి, మార్తాండ్ ఆలయాలు, అవంతిపొరా, హర్వాన్ బుద్ధిస్టు స్థలాలు, పరిహస్‌పురా, పట్టాన్ నరనాగ్ ఆలయ సముదాయాలు, ప్రతాప్ సింగ్ మ్యూజియం సహా శ్రీనగర్‌లోని ఇతర కీలక ప్రాంతాలనూ తరుణ్ విజయ్ సర్వే చేశారు. ఇందులో చాలా ప్రాంతాల్లోని కట్టడాలు దెబ్బతిని ఉన్నాయని, వీటికి పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోకుంటే కాలగర్భంలో కలిసిపోయే పూర్తిగా నశించిపోయే ప్రమాదం ఉన్నదని తరుణ్ విజయ్ వివరించారు.

జమ్ము కశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధికారుల్లో నూతన ఉత్తేజాన్ని కల్పించారని తరుణ్ విజయ్ ప్రశంసించారు. వారసత్వ సంపదను కాపాడటానికి ఆయన అధికారుల్లో ఉత్సాహాన్ని కల్పించారని, అలాగే, సాంస్కృతిక, వారసత్వ సంపద పరిరక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నారని తెలిపారు.  

కేంద్ర, రాష్ట్ర ఏఎస్ఐ అధికారులు స్వయంగా వారసత్వ సంపద పరిరక్షణకు పూనుకుంటే వారికి ప్రత్యేక బహుమానాలు ఇస్తున్నామని ఈ సందర్భంగా తరుణ్ విజయ్ ఓ ప్రకటనలో తెలిపారు. నరనాగ్ ఆలయ సముదాయ ప్రాంతంలోనే చట్టానికి విరుద్ధంగా 19 అక్రమాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయని, దీనితోపాటు ఇతర చోట్ల కూడా అనేక విధాల్లో భూ ఆక్రమణ ఘటనలున్నాయని తెలిపారు. 

రైనావరిలోని విటల్ భౌరవ్ ఆలయాన్ని కాల్చేశారని, ధ్వంసం చేశారని ఆయన తెలిపారు. అయితే, దానికి అటు కేంద్ర ఏఎస్ఐ, ఇటు రాష్ట్ర ఏఎస్ఐ జాబితాలో చోటు కల్పించలేదని వివరించారు. ఇవాళ్టికి ఈ ఆలయ గేటుపై జాతి వ్యతిరేక నినాదాలు రాసి ఉన్నాయని చెప్పారు. మార్తాండ్ ఆలయాన్ని పునరుద్ధరించాలని ఆయన ప్రణాళికలు వేస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు, మూడు ప్రధానమైన చారిత్రక కట్టడాలకు యునెస్కో ప్రపంచ వారసత్వంగా ప్రకటించాలని యోచిస్తున్నట్టు వివరించారు. రాష్ట్ర ఏఎస్ఐకి ఓ డైరెక్టర్ లేదా డిప్యూటీ డైరెక్టరే నియమితులు కాలేదని, పెద్ద ఎస్‌పీఎస్ మ్యూజియంలోనూ ఒక్క ఏసీ రూమ్ లేదని, క్యూరేటర్లు లేరని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వ రక్షణలో ఉణ్న ఒక్క కట్టడానికీ భద్రత లేదని, ఒక్క సెక్యూరిటీ గార్డూ లేడని అన్నారు. వీటన్నింటికీ సరైన రీతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయించాలని ఆశించారు.

యునెస్కో గుర్తింపునకు కశ్మీర్‌లోని నాలుగు సైట్లు!

జమ్ము కశ్మీర్‌లో ప్రపంచశ్రేణి వారసత్వ కట్టడాలు, స్థలాలు ఎన్నో ఉన్నాయని, అవి వెలుగులోకి రాకపోవడం దురదృష్టకరమని ఎన్ఎంఏ చైర్మన్ తరుణ్ విజయ్ అన్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలోకీ ఇవి చేరకపోవడం బాధాకరమని తెలిపారు. అయితే, కశ్మీర్‌లోని కనీసం నాలుగు చారిత్రక కట్టడాలైనా ఈ జాబితాలోకి చేరడానికి ఎన్ఎంఏ ప్రయత్నిస్తుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఏఎస్ఐ(ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా)తో ఎన్ఎంఏ సమన్వయం చేసుకుంటూ కనీసం నాలుగు పురాతన కట్టడాలు, స్థలాలైన మార్తాండ్, పరిహస్‌పొరా, నరనాగ్, హర్వన్‌లను ప్రపంచ వారసత్వ గుర్తింపునకు సిద్ధం చేసే జాబితాలో చేర్చడానికి ప్రయత్నిస్తామని, తద్వారా అవి యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరడానికి ఆస్కారం ఏర్పడుతుందని వివరించారు. దీనికి సంబంధించి ఒక సమగ్ర నివేదికను జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు తరుణ్ విజయ్ అందించనున్నారు.

click me!