75 ఏళ్ల సాంప్రదాయం.. హజ్రత్ నిజాముద్దీన్ దర్గాలో ఖవ్వాలీ పాడుతున్న నిజామీ కుటుంబం

By Asianet NewsFirst Published Jun 9, 2023, 2:43 PM IST
Highlights

75 ఏళ్లుగా నిజామీ కుటుంబం హజ్రత్ నిజాముద్దీన్ దర్గాలో ఖవ్వాలీ పాటను పాడుతున్నారు. ఇది తమ పూర్వీకులు తమకు అందించిన బాధ్యత అని ప్రస్తుత సింగర్ ఆజాం నిజామీ తెలిపారు. సూఫీలు, ఫకీర్‌లకు దక్షిణ ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ దర్గా కేంద్రం వంటిది.
 

25 ఏళ్ల ఆజాం నిజామీ ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ దర్గాలో ప్రతి రోజు సాయంత్రం ఖవ్వాలీ పాడుతుంటారు. హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా శాశ్వత సేద తీరుతున్న ఈ దర్గాను భారత ఉపఖండంలోని ముస్లింలు, హిందువులు ఆరాధిస్తారు. ఈ కళ తనకు వారసత్వంగా వచ్చిందని ఆజాం నిజామీ తెలిపారు. ఆయన తండ్రి ఖాస్ ఖలీల్ అహ్మద్, తాత ఉస్తాద్ ఖాస్ ఖవ్వాల్ షఫీఖ్ అహ్మద్ నిజామీ, ఆయన తండ్రి ఖాస్ ఖవ్వాల్ రఫీఖ్ అహ్మద్ నిజామీ వీరంతా ఈ దర్గా వద్ద ఖవ్వాలీ పాడారు. ఈ సూఫీ గురువుకు గౌరవంగా, ఆరాధనగా ఈ పాటలు పాడేవారు.

1946లో చాలా మంది ముస్లింలు ఢిల్లీ నుంచి అప్పుడే ఏర్పడబోతున్న పాకిస్తాన్‌కు వెళ్లుతున్నారని ఆజాం నిజామీ గతాన్ని గుర్తు చేశారు. 1947లో చివరకు దేశ విభజన జరిగిందని తెలిపారు. ఆయన ముత్తాత రఫీక్ అహ్మద్ నిజామీ పుట్టిన భూమిలోనే జీవించాలా? ముస్లింల భూమి పాకిస్తాన్‌కు వెళ్లాలా? అనే డైలామాతో హజ్రత్ నిజాముద్దీన్ ఔలియాకు వెళ్లారని వివరించారు. 

ఆ సమయంలో తమ కుటుంబానికి ఈ దర్గాతో అవినాభావ సంబంధం ఉన్నదని, తమ తాత కింగ్ నిజాముద్దీన్ ఔలియా‌ను కలిశారని ఈ రోజు తాను తన ట్రూప్‌తో కలిసి ప్రతి రోజు సాయంత్రం ఇక్కడ ఖవ్వాలీ పాడుతున్నానని తెలిపారు.

700 ఏళ్ల పురాతనమైన ఖవ్వాలీ పాట కళ సూఫీజంలో భాగం. 13వ శతాబ్దంలో ఇరాన్, అఫ్ఘనిస్తాన్ నుంచి సూఫీలు ఇస్లాంను ఇక్కడ ప్రచారం చేయడానికి వచ్చినప్పుడే ఖవ్వాలీ కళను ఇక్కడకు తీసుకువచ్చారు.

ఇప్పటి వరకు హజ్రత్ నిజాముద్దీన్ దర్గాలో ప్రతి రోజు సాయంత్రం ఖవ్వాలీ పాడుతారు. దక్షిణ ఢిల్లీలోని ఈ దర్గాను సూఫీలు, ఫకీర్‌లకు కేంద్రంగా భావిస్తారు.

ఈ దర్గా సందర్శకులు ఇక్కడ కూర్చుని ఖవ్వాలీ పాటలు, సూఫియానా సంగీతం, ఆధ్యాత్మిక లిరిక్స్ వింటుంటారు. అన్ని మతస్తులు, విదేశీయులు, సంగీత ప్రియులూ వీటిని విని ఆస్వాదిస్తారు.

‘ఇక్కడ ఖవ్వాలీ పాడటం ద్వారా వచ్చే డబ్బులతో సంతోషంగా జీవిస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది’ అని ఢిల్లీ ఓల్డ్ సిటీ దర్యాగంజ్ ఏరియాలో నివసించే ఆజాన్ నిజామీ అన్నారు. దర్గా వద్ద తను సేవలు చేయడం సహా ఆయన ట్రూప్ వార్షిక ఉర్దూ ఫెస్టివల్ ఆఫ్ జష్నే రేఖ్తా, జష్నే ఆదాబ్ వంటి ఇతర వేడుకలు, హునార్ హాత్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, ఆల్ ఇండియా రేడియో వంటి ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లోనూ సంగీత ప్రదర్శనకు వారికి ఆహ్వానం అందుతూ ఉంటుంది.

ఆజామ్ నిజామీ తమ్ముడు నాజిమ్ నిజామీ కూడా ఆయనతోపాటు ఖవ్వాలీ పాడటంలో భాగమయ్యాడు. ‘నేను నా చిన్నప్పటి నుంచి  రోజు సాయంత్రం ఇక్కడ ఖవ్వాలీ పాడుతూ వస్తున్నాను. ప్రజలు సంతోషంగా డబ్బులు ఇస్తున్నారని, హజ్రత్ నిజాముద్దీన్ ఆశీర్వాదంతో తమకు ఈ డబ్బులు అందుతున్నాయని వివరించారు. తమ జీవితం ఇప్పుడు సంతోషంగా సాగుతున్నదని చెప్పారు.

Also Read: లిక్కర్ బ్యాన్ చేయాలని అనుకున్నా.. కానీ, అది చూసి భయపడ్డా: ఛత్తీస్‌గడ్ సీఎం భూపేశ్ బాఘేల్

ఆజామ్ నిజామీ దర్గాలో ఖవ్వాలీ పాడటాన్ని ప్రొఫెషనల్‌గా తీసుకోరు. అది తమ బాధ్యత అని, వారసత్వంగా తమకు వచ్చినదని వివరించారు. తమ తాత ముత్తాతలు బోధించినట్టుగానే తాము తమ పిల్లలకు ఇక్కడ ఖవ్వాలీ పాడాలని బోధిస్తామని పేర్కొన్నారు. తమ కుటుంబంలోని పిల్లలు చిన్న వయసులోనే గాయకులతో పరిచయం అవుతారని, చిన్నతనం నుంచే వారిలో మ్యూజిక్ పై అవగాహన ఏర్పడుతుందని తెలిపారు. అందుకే వారికి ప్రత్యేకంగా మ్యూజిక్ విభాగంలో శిక్షణ ఇప్పించాల్సిన అవసరం లేదని వివరించారు. చిన్న చేప పిల్లలకు నీటిలో ఈత నేర్పాల్సిన అవసరం లేదని చెప్పారు. తమ కుటుంబం ఇప్పుడు నెలకు 40 నుంచి 50 వేలు సంపాదిస్తున్నదని తెలిపారు.

ఝూమ్ బరాబర్ ఝూమ్ వంటి హిందీ సినిమాల్లో ఖవ్వాలీ పాడిన సింగర్ ఉస్మాన్ నియాజీ కూడా నిజాముద్దీన్ దగ్గర రోజు సాయంత్రం పాడుతుంటారు. తన వారసులూ ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలనీ ఉస్మాన్ నియాజీ తెలిపారు. 

 

 

---- మొహమ్మద్ అక్రం

click me!