
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. అప్పుడే పుట్టిన నవజాత శిశువును ఆసుపత్రి మరుగుదొడ్డిలో పడేసి, అమానవీయంగా చంపేసింది ఓ తల్లి. ఆ తర్వాత ఆమె, ఆమెతో పాటు వచ్చిన మిగతా వారందరూ కనిపించకుండా పోయారు. ఈ ఘటన ఐదు నెలల క్రితం ఢిల్లీలో చోటుచేసుకుంది. అప్పటి నుంచి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. ఐదు నెలల తర్వాత ఈ ముఠాను అరెస్ట్ చేశారు. సదరు మహిళను సీమగా గుర్తించారు. ఆమె ఢిల్లీలోని విజయ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది.
సీమ, సందీప్ అనే వ్యక్తితో సహజీవనం చేసింది. ఈ క్రమంలో గర్భం దాల్చింది. నెలలు వినడంతో జనవరి 20న ఢిల్లీ బుద్ధవిహార్ లోని ఓ ఆసుపత్రికి నలుగురు వ్యక్తులు ఆమెను తీసుకువచ్చారు. అయితే, ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువగా వస్తుండడంతో.. డాక్టర్ వచ్చేసరికే కాన్పు అయిపోయింది. అలా ఆసుపత్రి టాయిలెట్ లోనే బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆ బిడ్డను ఎలాగైనా వదిలించుకోవాలనుకున్న ఆ తల్లి.. శిశువును అక్కడే చం పేసి మరుగుదొడ్డిలో పడేసింది.
ప్రకాశం జిల్లా దర్శిలో భారీ అగ్ని ప్రమాదం...
ఆ తర్వాత ఆ మహిళ, ఆమెతో పాటు వచ్చిన నలుగురు అక్కడి నుంచి కనిపించకుండా మాయమయ్యారు. కాసేపటి తరువాత ఆసుపత్రి సిబ్బంది విషయం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమయంలో ఎంత వెతికినా, ఎవరు? ఏమిటి? అనే విషయాలు తెలియ రాలేదు. దీంతో కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఐదు నెలల తర్వాత ఈ ముఠాను గుర్తించారు.
పోలీసులు దర్యాప్తులో భాగంగా ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న దాదాపు 250 కి పైగా సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. ఈ క్రమంలోనే సందీప్ ఓ మెడికల్ షాప్ దగ్గర మందులు కొంటుండడం గమనించారు. వెంటనే ఆ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్లి అక్కడ అతను చేసిన పేటీఎం పేమెంట్ల ఆధారంగా నిందితుడి ఆచూకీ కనిపెట్టారు. సందీప్ ను, సీమను.. వారితో పాటు వచ్చిన వారందరినీ అరెస్టు చేశారు.