PM Modi's US Visit: వాషింగ్టన్ డిసిలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్‌లో ఉన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. అమెరికాలో 'మినీ ఇండియా' పుట్టుకొచ్చిందనీ, ఇక్కడ 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారని అభినందించారు.
PM Modi's US Visit: వాషింగ్టన్‌లోని రీగన్ సెంటర్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నారు. రీగన్ సెంటర్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి విదేశీ భారతీయులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆడిటోరియం భారత్ మాతాకీ జై నినాదాలతో మారుమోగింది. దీని తరువాత ప్రముఖ గాయని మేరీ మిల్బెన్ భారతదేశ జాతీయ గీతాన్ని ఆలపించారు. 'భారతదేశ అభివృద్ధిలో ఎన్నారైల పాత్ర' అనే అంశంపై ఎన్నారైలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మీరు ఈ హాలులో భారతదేశం పూర్తి చిత్రాన్ని రూపొందించారని అన్నారు. మీరు చాలా దూరం నుండి ఇక్కడికి వచ్చారు. అమెరికాలో 'మినీ ఇండియా'పుట్టుకొచ్చిందనీ, ఇక్కడ 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' చిత్రాన్ని ప్రదర్శించినందుకు మీ అందరినీ అభినందిస్తున్నానని అన్నారు.
గత మూడు రోజులుగా అధ్యక్షుడు జో బిడెన్‌కి, నాకు మధ్య చాలా చర్చలు జరిగాయని ప్రధాని మోదీ అన్నారు. అధ్యక్షుడు జో బిడెన్ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడని చెప్పొచ్చు. భారత్-అమెరికా భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఆయన ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారని పేర్కొన్నారు. ఈ మూడు రోజుల్లో భారత్-అమెరికా మధ్య సంబంధాలలో నూతన, ఉజ్వల ప్రయాణం ప్రారంభమైందని అన్నారు. ఇది ప్రపంచ వ్యూహాత్మక సమస్యలపై ఇరు దేశాల కలయిక అన్నారు.
ఈ కొత్త ప్రయాణం మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ కోసం గొప్ప సహకారమని అన్నారు. సాంకేతికత బదిలీ, తయారీ సహకారం అయినా లేదా పారిశ్రామిక సమన్వయం అయినా, భారతదేశం-అమెరికా లు మెరుగైన భవిష్యత్తు దిశగా బలమైన అడుగులు వేస్తున్నాయని తెలిపారు. భారత్‌లో యుద్ధ విమానాలను తయారు చేయాలన్న జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ నిర్ణయం భారత రక్షణ రంగానికి మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. హెచ్-1బీ వీసాను పునరుద్ధరించుకునేందుకు అమెరికా వెలుపలకు వెళ్లాల్సిన అవసరం లేదని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. అమెరికాలో నివసిస్తున్నప్పుడు H-1B వీసా ఇప్పుడు పునరుద్ధరించబడుతుందని తెలిపారు.
USISPF కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగం
అంతకుముందు యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ (యుఎస్‌ఐఎస్‌పిఎఫ్) కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. అమెరికా పర్యటన సందర్భంగా ఈ కార్యక్రమం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అమెరికా అభివృద్ధి ప్రయాణానికి మీరంతా(ప్రవాస భారతీయులు) బలమైన మూల స్తంభాలు. మీరు చట్టసభల సభ్యుడైనా, వ్యాపార నాయకుడైనా, డాక్టరైనా, ఇంజనీర్ అయినా, సైంటిస్టు అయినా- అమెరికాను ఈ స్థాయికి తీసుకురావడానికి మీరంతా కష్టపడి పనిచేశారనీ, మీరు అమెరికన్ కలలో భాగమని, మీరు అమెరికన్ కలలో జీవించారని అన్నారు. భారత్-అమెరికా భాగస్వామ్యం సౌలభ్యం కోసం కాదని, మెరుగైన ప్రపంచం కోసం అని ప్రధాని మోదీ అన్నారు.
అనంతరం అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ.. వాషింగ్టన్‌లో ప్రధాని చేసిన పర్యటన నిజంగానే చారిత్రాత్మకమని అన్నారు. భారతదేశం-అమెరికా రెండు గొప్ప దేశాలు, ఇద్దరు గొప్ప స్నేహితులు, రెండు గొప్ప శక్తులు, 21వ శతాబ్దపు దిశను నిర్ణయించగలవని పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఇరు దేశాల అనేక ముఖ్యమైన ఒప్పందాలపై సంతకాలు జరిగాయని, ఇది మన భాగస్వామ్యం ఎంత విస్తృతమైందో తెలియజేస్తోందన్నారు. సముద్రం, అంతరిక్షం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల మధ్య ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయనీ, ఈ భాగస్వామ్యం వల్ల రెండు దేశాలు లాభపడతాయని తెలిపారు.
ప్రధాని మోదీకి ప్రెసిడెంట్ బిడెన్ ప్రత్యేక బహుమతి
భారతీయ-అమెరికన్ కంపెనీల CEO లతో జరిగిన సమావేశంలో ప్రెసిడెంట్ జో బిడెన్ PM నరేంద్ర మోడీకి ఒక ప్రత్యేక టీ-షర్టును బహుమతిగా ఇచ్చారు, దానిపై 'ది ఫ్యూచర్ ఈజ్ AI' అని వ్రాయబడింది. దీనితో పాటు అమెరికా, ఇండియా అని దాని కింద ఆంగ్లంలో రాసి ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అమెరికా పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ అమెరికా, భారత్‌లను ఏఐగా పేర్కొంటూ మరో ఏఐ (అమెరికా-భారత్) కూడా ప్రగతి పథంలో వెళ్తుందని పేర్కొన్నారు.