US Visa: విద్యార్థి వీసాల కోసం అమెరికా కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. F, M, J కేటగిరీ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారందరూ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసేటప్పుడు , వారి అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసేటప్పుడు వారి స్వంత పాస్‌పోర్ట్ సమాచారాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలి. వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించిన, మోసం, దుర్వినియోగాన్ని నిరోధించడానికి పలు మార్పులు చేస్తున్నట్లు భారతదేశంలోని యుఎస్ ఎంబసీ తెలిపింది.
US Visa: అగ్ర రాజ్యం అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాలని చాలా మంది విద్యార్థులు కల కంటుంటారు. అక్కడ చదువు పూర్తి కాగానే అక్కడే మంచి ఉద్యోగంలో స్థిరపడి అమెరికాలో శాశ్వత నివాసం పొందాలని ఆశపడుతుంటారు. ఈ క్రమంలోనే అందుకు తగ్గట్టుగా అన్ని రకాలుగా సిద్దమవుతారు. ఇలా భారత్ నుంచి ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో విద్యార్థులు అమెరికా వెళుతుంటారు.
ఈ నేపథ్యంలో విద్యార్థి వీసాల కోసం అమెరికా కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఎమ్, ఎఫ్, జే కేటగిరీ వీసాల కోసం దరఖాస్తు పలు మార్పులు తీసుకవచ్చింది. ఈ క్రమంలో వీసా నిబంధనల్లో తీసుకవచ్చిన నిబంధనలను గమనించాలని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. కొత్త నిబంధనలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది.
కొత్త నిబంధనలు ఏమిటి?
US ఎంబసీ ప్రకారం.. F, M, J విద్యార్థి కేటగిరీల క్రింద దరఖాస్తు చేసుకునే వారందరూ ప్రొఫైల్‌ను రూపొందించేటప్పుడు, వారి వీసా అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసేటప్పుడు వారి స్వంత పాస్‌పోర్ట్ సమాచారాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలి.
ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం.. భాషా శిక్షణా కార్యక్రమంలో లేదా గుర్తింపు పొందిన కళాశాల, విశ్వవిద్యాలయం, సెమినరీ, కన్సర్వేటరీ, అకడమిక్ హైస్కూల్ లేదా ఇతర విద్యాసంస్థల్లో చేరిన వారు F-1 వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వృత్తిపరమైన లేదా ఇతర విద్యాతేర కార్యక్రమాలను చేపట్టాలనుకునే వారికి M-1 వీసా అవసరం. ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లలో పాల్గొనే వారికి J-1 వీసా అవసరం. రీసెర్చ్ స్కాలర్‌లు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, ట్రైనీలు, ఇంటర్న్‌లు, వివిధ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలలో పాల్గొనే వారందరికీ J-2 వీసా అవసరం.
ప్రొఫైల్‌ను సృష్టించిన లేదా తప్పు పాస్‌పోర్ట్ నంబర్‌ని ఉపయోగించి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్న దరఖాస్తుదారులు వీసా అప్లికేషన్ సెంటర్‌లలో (VAC) అంగీకరించబడరని రాయబార కార్యాలయం తెలిపింది. అటువంటి అపాయింట్‌మెంట్‌లు రద్దు చేయబడతాయి.అలాంటి సమయంలో వీసా రుసుము జప్తు చేయబడుతుంది. తప్పు పాస్‌పోర్ట్ నంబర్‌ని ఉపయోగించి ప్రొఫైల్‌ను సృష్టించిన లేదా అపాయింట్‌మెంట్ బుక్ చేసిన ఎవరైనా ఇలా చేయాలి:
సరైన పాస్‌పోర్ట్ సమాచారాన్ని కలిగి ఉన్న కొత్త ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవాలి. అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి సరైన పాస్‌పోర్ట్ సమాచారాన్ని కలిగి ఉన్న ఏదైనా ప్రొఫైల్‌ను యాక్సెస్ చేయాలి.దానికి అనుగుణంగా కొత్త వీసా రుసుము రసీదు అవసరం అవుతుంది.
పాత పాస్‌పోర్ట్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన తర్వాత ఇటీవల పాస్‌పోర్ట్‌ను పునరుద్ధరించిన లేదా కొత్త పాస్‌పోర్ట్ పొందిన దరఖాస్తుదారు, పాత పాస్‌పోర్ట్ నంబర్‌కు సంబంధించిన ఫోటోకాపీ లేదా ఇతర సాక్ష్యాలను తీసుకురావచ్చు. వారు తమ నియామకాన్ని కొనసాగించడానికి అనుమతించబడతారని రాయబార కార్యాలయం పేర్కొంది.
ప్రక్రియను సులభతరం చేస్తుందా?
అపాయింట్‌మెంట్ సిస్టమ్‌లో మోసాలను అరికట్టడానికి ఈ మార్పులు చేస్తున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది. 2022-2023 విద్యా సంవత్సరంలో అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 35 శాతం పెరిగిందని ఓపెన్ డోర్స్ నివేదికను ఉటంకిస్తూ బిజినెస్ స్టాండర్డ్ పేర్కొంది. రికార్డు స్థాయిలో 2,68,923 మంది విద్యార్థులు యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లారు. యునైటెడ్ స్టేట్స్‌లోని మిలియన్ కంటే ఎక్కువ మంది విదేశీ విద్యార్థులలో 25 శాతం మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు.
US ఎంబసీ 2023లో రికార్డు స్థాయిలో వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసినట్లు తెలిపింది. వీసా బ్యాక్‌లాగ్‌ను తగ్గించేందుకు తమ దేశం మరింత మంది సిబ్బందిని నియమించుకోవడంతోపాటు మరిన్ని కాన్సులేట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు యుఎస్ అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి పేర్కొన్న విషయం తెలిసిందే. 2023 నాటికి కనీసం ఒక మిలియన్ వీసాలను ప్రాసెస్ చేయాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుందని గార్సెట్టి చెప్పారు.
వ్యక్తిగత ఇంటర్వ్యూల అవసరాన్ని తగ్గించడం వంటి వీసా ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి మేము వినూత్న పరిష్కారాలను తీసుకవస్తామనీ, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాన్సులర్ బృందాలు పెరుగుతున్న భారతీయ ప్రయాణీకుల కోసం వీసాల ప్రాసెసింగ్‌లో సహాయం చేయడానికి వీలు కల్పిస్తుందని గార్సెట్టి తెలిపారు. ఇలా చేయడం వల్ల భారతదేశంలోని యుఎస్ ఎంబసీ వెయిటింగ్ పీరియడ్ తగ్గుతుంది.