
న్యూఢిల్లీ: ఆధునిక భారత్ కు కొత్త పార్లమెంట్ అద్దం పడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు ప్రారంభించారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయమని ప్రధాని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పురుడు పోసుకున్న నేల భారత్ గా మోడీ పేర్కొన్నారు. మన ప్రజాస్వామ్యమే మనకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. ప్రేరణ, సంకల్పానికి కొత్త భవనం నిలుస్తుందని మోడీ అభిప్రాయపడ్డారు.
స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కొత్త పార్లమెంట్ ను నిర్మించుకున్నామన్నారు. కొత్త పార్లమెంట్ ప్రారంభించుకున్న ఈరోజు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంతో 140 కోట్ల భారతీయుల కల సాకారమైందన్నారు.
కొత్త పార్లమెంట్ భవనం ఆత్మ నిర్బర్ భారత్ కు సాక్షిగా నిలుస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. భారత్ అభివృద్ది చెందితే ప్రపంచం కూడా అభివృద్ది చెందుతుందని మోడీ చెప్పారు.. కొత్త పార్లమెంట్ కొత్త భారత్ కు కొత్త జోష్ తీసుకువచ్చిందన్నారు.
నవభారత్ కొత్త మార్గాలను నిర్ధేశించుకుంటూ ముందుకు సాగుతుందన్నారు. ప్రపంచం మొత్తం భారత్ సంకల్పం, అబివృద్దిని గమనిస్తుందని ఆయన చెప్పారు. కొత్త ఆలోచనలు సంకల్పంతో భారత్ ప్రగతి మార్గంలో పయనిస్తుందని మోడీ వివరించారు.
ఇది కేవలం భవనం కాదు... 140 కోట్ల ప్రజల ఆంక్షాల కలల ప్రతిబింబంగా మోడీ పేర్కొన్నారు. ప్రపంచానికి భారత్ ధృడ సంకల్పం, సందేశం అందిస్తుందన్నారు. కొత్త భవనం స్వాతంత్ర్య సమరయోధుల కలల సాకార మాధ్యమంగా నిలుస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. పాత, కొత్త కలయికల అస్తిత్వానికి ఈ భవనం ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
పవిత్రమైన రాజదండాన్ని పార్లమెంట్ లో ప్రతిష్టించిన విషయాన్ని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. చోళ సామ్రాజ్యంలో రాజదండానికి ప్రత్యేక స్థానం ఉన్న విషయాన్ని ప్రధాని మోడీ గుర్తు చేశారు. సేవ, కర్తవ్యానికి రాజదండం ప్రతీకగా ఆయన పేర్కొన్నారు. రాజదండం గురించి మీడియాలో విస్తృతంగా చర్చ జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రాజదండానికి పూర్వ ప్రతిష్ట, గౌరవం తీసుకురావాల్సిన అవసరం ఉందని మోడీ పేర్కొన్నారు. సభ కార్యక్రమాల సమయంలో రాజదండం ప్రేరణగా నిలుస్తుందన్నారు.
also read:దేశం గర్వ పడాల్సిన రోజు: కొత్త పార్లమెంట్ భవన వేడుకల్లో రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్
ఎవరైతే ఆగిపోతారో వారి అభివృద్ది అక్కడే నిలిచిపోతుందని మోడీ పేర్కొన్నారు. ఎవరైతే పురోగమనం సాగిస్తారో వారు పురోభివృద్ది సాధిస్తారని ప్రధాని చెప్పారు. ముక్త భారత్ కోసం నవీన పంథా కావాలన్నారు. కొత్త పార్లమెంట్ భవనం భారత భవిష్యత్తును మరింత ఉజ్వలం చేస్తుందని మోడీ ధీమాను వ్యక్తం చేశారు.
పార్లమెంట్ భవనం అనేక సంస్కృతులకు నమ్మేళనంగా నిలిచిందన్నారు. కొత్త భవనం చూసి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నారన్నారు. ఇక్కడ చేసే చట్టాలు , పేదరిక నిర్మూలనకు దోహదపడుతాయన్నారు. ఇక్కడి ప్రతి అణువు పేద ప్రజల కళ్యాణానికి దోహదపడాల్సిన అవసరం ఉందని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు. అంతకు ముందు రూ. 75 రూపాయాల పోస్టల్ నాణెం విడుదల చేశారు ప్రధాని మోడీ.