
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కొత్త సచివాలయం నిర్మించాలని డీఎంకే జనరల్ సెక్రెటరీ, రాష్ట్ర నీటి వనరుల శాఖ మంత్రి దురైమురుగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ కొత్త సచివాలయం గురించి విజ్ఞాపన చేశారు. ఇతర సభ్యుల్లాగే తాను కూడా సీఎం స్టాలిన్ కొత్త సెక్రెటేరియట్ నిర్మిస్తే చూడాలని ఉన్నదని వివరించారు.
‘కొత్త సచివాలయ భవనం కోసం మీరు కూడా రిక్వెస్ట్ పెట్టారు. మీతో నేనూ అంగీకరిస్తాను. నేను సీఎంను కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నాను. తళపతి తన హయాంలో కొత్త సచివాలయం నిర్మించాలని కోరుకుంటున్నా’ అని మంత్రి దురైమురుగన్ పేర్కొన్నారు.
ఇతర సభ్యులు కొందరు హింట్ ఇవ్వగానే దాన్ని అందుకుని రాజ్ భవన్ భూమి కూడా ఇందుకు వినియోగించవచ్చునని వివరించారు. ‘మీరు రాజ్ భవన్ భూమి తీసుకుంటారా? అది మన భూమే. దాని చరిత్ర నేను చదివాను. గవర్నర్ అక్కడ నివసించేవాడు కాదు. కానీ, ఆ తర్వాత అందులో నివాసం ఇచ్చాం. మనం ఆ భూమి తీసుకోవచ్చు. లేదంటే గిండీ రేస్ కోర్స్‌కు చెందిన 700 ఎకరాలను తీసుకోవచ్చని తెలిపారు. అది కూడా మన భూమే.’ ఈ భూమి లేదా ఇతర చోటులోనైనా కొత్త సచివాలయాన్ని ఆయన హయాంలో నిర్మించాలనేదే తమ లక్ష్యం అని వివరించారు.
Also Read: యాపిల్ సీఈవో టిమ్ కుక్‌తో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ భేటీ.. ఎగుమతులు, ఉపాధి కల్పనపై చర్చ
తమిళనాడులో సచివాలయం భవనం గురించిన చర్చ కొత్తేమీ కాదు. గతంలో డీఎంకే కొత్త సచివాలయ నిర్మాణానికి ప్రయత్నాలు చేసింది. కానీ, తర్వాతి ఎన్నికల్లో ప్రభుత్వాన్ని జయలలిత ఏర్పాటు చేసిన తర్వాత ఆ భవనాన్ని మల్టీ స్పెషల్టీగా మార్చేసింది.