
న్యూఢిల్లీ: జనాభాలో భారత్ నెంబర్ వన్ స్థానానికి చేరింది. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా ఉన్న చైనా ఇప్పుడు భారత్ వెనుక రెండో స్థానానికి పరిమితమైంది. ఐరాస తాజా నివేదిక ప్రకారం, భారత దేశ జనాభా 142.86 కోట్లు కాగా, చైనా జనాభా 142.57 కోట్లు. అంటే చైనా కంటే భారత జనాభా 29 లక్షలు ఎక్కువ. జనాభాలో చైనాను భారత్ అధిగమించడాన్ని ఆ దేశం జీర్ణించుకోవడం లేదు.
సంఖ్య పెరగడం కాదు.. నాణ్యత ముఖ్యం అంటూ తామే గొప్ప అనే ప్రయత్నం చేసింది. ఆర్థికంగా తమదే పై చేయి అని, తమ వద్ద నైపుణ్య జనాభా అధికం అని చెప్పుకొచ్చింది. భారత్ పై చేయి సాధించడంపై చైనా విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్‌ను విలేకరులు స్పందన కోరారు. దీనికి సమాధానంగా ఆయన పై వ్యాఖ్య చేశారు. జనాభాలో క్వాంటిటీ కాదు.. క్వాలిటీ చూడాలని అన్నారు. జనాభా సంఖ్య ముఖ్యమే కానీ, అంతకంటే అందులో ఎంత మంది టాలెంట్ పర్సన్లు అనేది మరింత ముఖ్యం అని తెలిపారు. చైనా జనాభా 140 కోట్లు ఉంటే.. అందులో 90 కోట్ల మంది వర్కర్లే (శ్రామికులు) అని చెప్పారు. అంతేకాదు, సగటున 10.5 ఏళ్లపాటు విద్యనభ్యసించిన వారు అందులో ఉన్నారని తెలిపారు.
ప్రపంచంలోనే అత్యధిక యువత జనాభా కూడా భారత్‌లోనే ఉంది. UNFPA నివేదిక ప్రకారం.. భారతదేశ జనాభాలో
>> 0-14 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు 25% మంది.
>> 10-19 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు 18% మంది
>> 10-24 సంవత్సరాల వయస్సు గలవారు 26% మంది
>> 15-64 సంవత్సరాల వయస్సు గల వారు 68% మంది
>> 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు 7% మంది ఉన్నట్టు నివేదికల సమాచారం.
అయితే.. ఆయుర్దాయం పరంగా భారతదేశం కంటే చైనా మెరుగ్గా ఉంది. ఇక్కడ ఆడవారికి 82 ఏండ్ల కాగా.. పురుషుల ఆయుర్దాయం 76 సంవత్సరాలు. భారతదేశ ఆయుర్దాయం విషయానికి వస్తే.. ఆడవారి ఆయుర్దాయం 74 ఏండ్ల కాగా.. మగవారి ఆయుర్దాయం 71 ఏండ్లుగా ఉన్నట్టు నివేదిక తెలిపింది.