
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ బుధవారం కలిశారు. పార్లమెంట్‌లో మోదీతో శరద్ పవార్ సమావేశమయ్యారు. ఇరువురు నేతల మధ్య 20 నుంచి 25 నిమిషాల పాటు చర్చ జరిగింది. ఇరువురు నేతల ఏం చర్చించారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ చర్చల్లో ఇరువురి మధ్య మహారాష్ట్రలో సమస్యలపై చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రపతి ఎన్నికల గురించి ఇరువురి నేతల మధ్య చర్చ సాగినట్టుగా ప్రచారం సాగుతుంది.
గత కొన్ని నెలలుగా శివసేన, ఎన్సీపీ నేతలు, వారి సహచరులపై కేంద్ర దర్యాప్తు సంస్థ దాడులు జరుగుతున్నాయి. తాజాగా మంగళవారం శివసేన నేత సంజయ్ రౌత్ కుటుంబానికి చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేస్తూ కీలక చర్యలు చేపడుతున్న తరుణంలో ప్రధాని మోదీతో పవార్ భేటీ కావడం జరగడం గమనార్హం. ఇక, గతేడాది జూలై 17న కూడా ప్రధాని మోదీని శరద్ పవార్ కలిసిన సంగతి తెలిసిందే.
మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలోని తమ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర చేస్తుందని ఆ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని విమర్శిస్తున్నారు. తమ అణిచివేసే ప్రయత్నం జరుగుతుందని మండిపడుతున్నారు.
ఇక, ఢిల్లీలోని శరద్ పవార్ నివాసం మంగళవారం రాత్రి ఓ విందు కార్యక్రమం జరిగింది. దీనికి మహారాష్ట్రలోని ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. పార్లమెంట్‌లో ఓ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం ఢిల్లీ వచ్చిన మహారాష్ట్ర ఎమ్మెల్యేలు.. చాలా మంది పవార్ నివాసంలో విందుకు హాజరయ్యారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా ఈ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ విందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరుకావడం గమనార్హం.