వర్కవుట్ అయిన సీఎం భేటీ.. కాంగ్రెస్ చీఫ్‌గా కొనసాగనున్న సిద్దూ

By telugu teamFirst Published Sep 30, 2021, 6:36 PM IST
Highlights

పంజాబ్‌ కాంగ్రెస్‌లో మరో మలుపు ఎదురైంది. సీఎం చన్నీతో సమావేశమయ్యాక పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా కొనసాగడానికి నవజ్యోత్ సింగ్ సిద్దూ అంగీకరించినట్టు తెలిసింది. సిద్దూ డిమాండ్లను చాలా వరకు సీఎం చన్నీ అంగీకరించారని, తర్వాతే తన రాజీనామాను వెనక్కి తీసుకున్నట్టు సమాచారం. 
 

చండీగడ్: పంజాబ్ రాజకీయాల్లో అనూహ్య ట్విస్టులకు బ్రేక్ పడింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో మొదలైన పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. సీఎం చరణ్‌జిత్ చన్నీకి పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్దూకు మధ్య పొరపొచ్చాలు వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఆయన కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. అయితే, అభిప్రాయబేధాలను తొలగించుకోవడానికి సిద్దూను సమావేశానికి సీఎం చన్నీ ఆహ్వానించారు. ఈ సమావేశం వర్కవుట్ అయింది. ఆయన పంజాబ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా కొనసాగడానికి ఆయన అంగీకరించినట్టు తెలిసింది. ఈ రోజు సాయంత్రం 3 గంటలకు సమావేశం జరిగింది.

సీఎం చన్నీ ఆహ్వానం మేరకు చండీగడ్‌లోని పంజాబ్ భవన్‌కు డ్రైవింగ్ చేసుకుంటూ నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ వెళ్లారు. సమావేశంలో ఏ విషయం చర్చించడానికైనా సీఎంకు అవకాశముందని ఓ ట్వీట్ చేశారు కూడా. సీఎం చన్నీ, సిద్దూల మధ్య సమావేశం సజావుగా సాగినట్టు ఆ భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యే గుర్దీప్ వెల్లడించారు. సిద్దూ డిమాండ్లలో చాలా వరకు సీఎం చన్నీ అంగీకరించారని సమాచారం. అనంతరం సిద్దూ పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా కొనసాగడానికి అంగీకరించారని తెలిసింది. అక్టోబర్ 4న పంజాబ్ క్యాబినెట్ సమావేశం కాబోతున్నది.

ఢిల్లీకి వెళ్లిన కెప్టెన్ అమరీందర్ సింగ్ నిన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఇవాళ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌‌తో భేటీ అయ్యారు. ఆయన బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం సాగుతున్న తరుణంలో అమిత్ షాతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖరారైందన్న విశ్లేషణలు వచ్చాయి. కానీ, ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశానికి ప్రయత్నించలేదు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌లో కొనసాగబోరని, పార్టీ వీడబోతున్నట్టు వెల్లడించారు. అయితే, బీజేపీలోనూ చేరబోవడం లేదని స్పష్టం చేశారు. 

click me!