కేంద్రంలో కొత్త సర్కారు కొలువుదీరనున్న వేళ... ట్రెండింగ్‌లో చంద్రబాబు

By Galam Venkata Rao  |  First Published Jun 5, 2024, 6:09 PM IST

కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్డీయే సిద్ధమైంది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు. అయితే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు కీలకమయ్యారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యారు....


వేసవి ఎండలను మించి హీట్‌ పుట్టించిన రాజకీయాలు ఫలితాల వెల్లడితో కాస్త చల్లబడ్డాయి. సార్వత్రిక ఎన్నికల పోరులో విజేతలెవరో జూన్‌ 4న తేలిపోవడంతో ఎన్నికల హడావుడి సద్దుమణిగింది. కేంద్రంలో మోదీయే మళ్లీ వస్తారా..? ఇండి కూటమికి అవకాశాలేమైనా ఉన్నాయా..? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా బీఆర్‌ఎస్‌.. పార్లమెంటు ఎన్నికల్లోనైనా పుంజుకుంటుందా..? ఆంధ్రాలో అధికారమెవరిదీ..? మళ్లీ జగనే వస్తారా..? లేక కూటమి గెలిచి చంద్రబాబు సీఎం అవుతారా..? ఫలితాలు వచ్చేదాకా ఏ రచ్చబండ దగ్గర చూసినా ఇదే ముచ్చట. సోషల్‌ మీడియాలోనూ ఇవే టాపిక్స్‌ ట్రెండింగ్‌ అయ్యాయి.... 

ఈసారి 400 కొడతామన్న బీజేపీ, మోదీ టీంని ఊహల పల్లకి వాస్తవంలోకి తీసుకొచ్చారు ఓటర్లు. ఎన్‌డీయేని 292 సీట్లతో సరిపెట్టుకోమన్నారు. బీజేపీకి సొంతంగా అంతంతమాత్రం స్థానాలు మాత్రమే రావడంతో ఇప్పుడు చంద్రబాబు, నితీశ్‌ ఎన్‌డీయేకి కీలకమయ్యారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా అంతటా చంద్రబాబు, నితీశ్‌ ట్రెండ్‌ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం అందుకున్న చంద్రబాబుకు సోషల్‌ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్‌డీయే సిద్ధమవుతున్న వేళ... ఎన్డీయే సర్కార్‌ హై తయ్యార్‌ (#NDA_सरकार_है_तैयार), రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (राष्ट्रपति द्रौपदी मुर्मू), రాష్ట్రపతి భవన్‌ (राष्ट्रपति भवन) ట్రెండ్‌ అవుతున్నాయి. 

Latest Videos

కాగా, ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు జూన్ 1న ముగిశాయి. 4న ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీయే 292 లోక్‌సభ స్థానాలు, ఇండియా కూటమి 234, ఇతరులు 17 స్థానాల్లో విజయం సాధించారు. ఇక కేంద్రంలో మిత్ర పక్షాలతో కలిసి భారతీయ జనతా పార్టీ కొత్త సర్కారును ఏర్పాటు చేయడమే మిగిలి ఉంది. 
 

click me!