PM Modi Resign:ప్రధాని మోడీ రాజీనామా.. ఢిల్లీలో ఉత్కంఠ.. 

By Rajesh Karampoori  |  First Published Jun 5, 2024, 3:32 PM IST

PM Modi Resign: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. మంత్రిమండలిని కలిసి ఆయన తన రాజీనామాను సమర్పించారు. మరోవైపు.. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఢిల్లీలో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీయే కూటమితో పాటు ఇండియా కూటమి కూడా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
 


PM Modi Resign: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన పదవికి రాజీనామా చేశారు. మోడీ తన కేంద్ర మంత్రి మండలితో భేటీ అనంతరం తన పదవికి రాజీనామా చేశారు. జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బుధవారం ఈ రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమై తన రాజీనామాను సమర్పించారు. రాష్ట్రపతి దానిని ఆమోదించారు. ఈ సమాచారాన్ని రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ రాజీనామాను ఆమోదించడంతో పాటు, కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు బాధ్యతలు చేపట్టాలని కోరారు. జూన్ 8న కొత్త ఎన్డీయే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
 
ప్రధాని మోదీ రాజీనామా

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. బుధవారం ఢిల్లీలో ఎన్డీయే, ప్రతిపక్ష భారత కూటమి పార్టీల వేర్వేరు సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా ఎన్డీయే సమావేశంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ జరిగింది. ఎన్డీయే కూటమి అధినేతగా నరేంద్రమోడీ జూన్‌ 8న మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చని చెబుతున్నారు.
 

Latest Videos

click me!