
నమీబియా నుంచి తీసుకొచ్చి మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ వదిలేసిన చిరుత ప్రసవించింది. అది మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ చిరుత కూనలు ఎంతో క్యూట్ గా ఉన్నాయి. ఈ పరిణామాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఎక్స్ (ట్విట్టర్) లో పంచుకున్నారు. చిరుత పిల్లలకు సంబంధించిన హృదయాన్ని కదిలించే వీడియోను పోస్ట్ చేశారు.
కర్ణాటకలో గోద్రా తరహా ఘటన జరగొచ్చు - కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
‘‘కునో నేషనల్ పార్క్ ముగ్గురు కొత్త సభ్యులకు స్వాగతం పలికింది. నమీబియా చిరుత ఆశాకు ఈ పిల్లలు జన్మించాయి’’ అని ఆయన క్యాప్షన్ పెట్టారు. భారత్ లో అంతరించిపోయిన ఈ చిరుతలను కునో నేషనల్ పార్క్ లో పెంచే ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న నిపుణులు, అధికారులను కేంద్ర మంత్రి అభినందించారు. పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడానికి ప్రధాని నరేంద్ర మోడీ కలలుగన్న ప్రాజెక్ట్ చీతాకు ఈ అభివృద్ధి గొప్ప విజయం అని ఆయన అన్నారు.
‘‘ఈ ప్రాజెక్టులో పాల్గొన్న నిపుణులందరికీ, కునో వన్యప్రాణి అధికారులకు, భారతదేశం అంతటా ఉన్న వన్యప్రాణి ఔత్సాహికులకు నా పెద్ద అభినందనలు’’ అని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. 2023 మార్చిలో జ్వాలా అనే మరో చిరుత నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే వీటిలో ఒక చిరుత మాత్రమే బతికింది. ఇది కూడా నమీబియా నుంచి కునో నేషనల్ పార్క్ లోకి వచ్చిన చిరుతే. 1952లో దేశంలో ఈ రకమైన చిరుతలు అంతరించిపోయాయి. దీంతో ఏడు దశాబ్దాల తర్వాత భారతదేశంలో జన్మించిన తొలి చిరుత పిల్లలుగా అవి రికార్డుల్లోకి ఎక్కాయి.