అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించే విగ్రహం ఇదేనా? రామ మందిరంలో ఐదేళ్ల వయసులోని బాల రాముడి విగ్రహం కొలువుతీరనుంది. కానీ, ఈ ఫొటోలో ఉన్నది బాల రాముడు కాదు. ఈ ఫొటో 2019లో బయటకు వచ్చింది. అసలు అయోధ్య రామ మందిరంలో కొలువుదీరే విగ్రహ ఫొటో ఇప్పటికీ ఇంకా బయటకు రాలేదు.
Ayodhya: అయోధ్య రామ మందిరం ఇప్పుడు హాట్ టాపిక్. ఈ నెల 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నది. ప్రధాని మోడీ ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. అయోధ్య రామ మందిరం గురించి దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇటీవలే అయోధ్యలో ప్రతిష్టించే బాల రాముడి విగ్రహ ఎంపిక జరగడంతో మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ పేరు చర్చలోకి వచ్చింది. అంతేకాదు, ఆయన మలిచిన పలు విగ్రహాలూ, ఆ విగ్రహాలతో అరుణ్ యోగిరాజ్ సెల్ఫీ తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలా రామ విగ్రహం ముందు అరుణ్ యోగి రాజ్ ఉన్న ఫొటోను చూపుతూ.. అందులో ఉన్న విగ్రహాన్నే అయోధ్యలో ప్రతిష్టింపజేస్తున్నట్టు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రముఖ బీజేపీ నేతలూ ఇదే పని చేశారు. సిద్ధరామయ్య కూడా ఇదే చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నట్టు వార్తలు వచ్చాయి.
కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్రంలోని రాముడి విగ్రహం వేరు.. అయోధ్యలో ప్రతిష్టించే విగ్రహం వేరు. అయోధ్యలో ప్రతిష్టించే విగ్రహం ఐదేళ్ల వయసులో ఉన్న రాముడి విగ్రహం అని ఇది వరకే శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సెక్రెటరీ చంపత్ రాయ్ వెల్లడించారు. కానీ, ఈ ఫొటోలోని రామ విగ్రహం ఐదేళ్ల వయసులోనిది కాదు.
అంతేకాదు, అరుణ్ యోగి రాజ్ భార్య విజేత కూడా అయోధ్యలో ప్రతిష్టించే విగ్రహం అది కాదని స్పష్టం చేశారు. ఐదేళ్ల వయసులోని రామ విగ్రహాన్ని ప్రతిష్టిస్తారని, తాను కొంచెంగా ఆ విగ్రహాన్ని చూశానని, బాల రాముడు మందహాసంతో ఉన్నారని వివరించారు. తామెవ్వరికీ ఇప్పటి వరకు ఆ విగ్రహం ఎలా ఉంటుందో పూర్తిగా తెలియదని చెప్పారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఫొటోలోని విగ్రహం కూడా అరుణ్ యోగిరాజ్‌నే మలిచారని, కానీ, అది ఒక కస్టమర్ కోసం రూపొందించినదని తెలిపారు. అయోధ్య రామ మందిరం కోసం చెక్కిన శిల్ప అది కాదని స్పష్టత ఇచ్చారు.
Also Read: Ayodhya: రామ మందిరంలో ప్రతిష్టించే రామ విగ్రహం ఎవరు చెక్కారు? ఎలా ఉన్నది?
అరుణ్ యోగిరాజ్ అన్నయ్య కూడా ఆ ఫొటోపై స్పందించారు. ప్రొటోకాల్ ప్రకారం, ఈ విగ్రహం గురించి ఎక్కువ వివరాలు బయటకు చెప్పరాదని అన్నారు.
దీనికితోడు వైరల్ అవుతున్న ఫొటో వాస్తవానికి ఇప్పటిది కాదు. 2019లోనే డెక్కన్ హెరాల్డ్ సంస్థ ఆ ఫొటోను ప్రచురించింది. ఈ వార్త మనకు ఇంటర్నెట్‌లో కూడా లభిస్తుంది. అరుణ్ యోగిరాజ్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో గతంలోనే ఈ ఫొటోను పోస్టు చేశారు.