మిజోరంలో మయన్మార్ విమానం క్రాష్ ల్యాండైంది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు.
న్యూఢిల్లీ: మిజోరంలోని లెంగ్ పుయి విమానాశ్రయంలో మయన్మార్ ఆర్మీ విమానం మంగళవారంనాడు క్రాష్ ల్యాండ్ కావడంతో ఆరుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పైలెట్ తో పాటు 14 మంది ఉన్నారు.
క్షతగాత్రులను లెంగ్ పుయి ఆసుపత్రిలో చేర్చారని మిజోరం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలిపారు. భారత్ లో ప్రవేశించిన మయన్మార్ ఆర్మీ సిబ్బందిని తీసుకెళ్లేందుకు ఈ విమానం వచ్చింది. లెంగ్ పుయి ఎయిర్ పోర్టులో రన్ వేపైకి దూసుకెళ్లిన తర్వాత దెబ్బతిందని ప్రాథమిక నివేదికలు వెల్లడించాయి.
గత వారం మిజోరాంకు 184 మంది మయన్మార్ సైనికులు వచ్చారు. మిజోరాంలో తిరుగుబాటు గ్రూప్ కాల్పులకు తెగబడడంతో వారిని స్వంత దేశానికి తిరిగి పంపించిందని అసోం రైఫిల్స్ ప్రకటించింది.
గత వారం మొత్తం 276 మంది మయన్మార్ సైనికులు మిజోరంలోకి ప్రవేశించారు. అయితే ఇందులో 184 మందిని సోమవారం నాడు వెనక్కి పంపినట్టుగా అధికారులు తెలిపారు. ఐజ్వాల్ సమీపంలోని లెంగ్ పుయి విమానాశ్రయం నుండి పొరుగు దేశంలోని రఖైన్ రాష్ట్రంలోని సిట్వేకు మయన్మార్ వైమానిక దళ విమానాల్లో వారిని తరలించినట్టుగా అధికారులు తెలిపారు.
ఈ నెల 17న మయన్మార్ సైనికులు ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో దక్షిణ మిజోరంలోని లాంగ్టై జిల్లాలో ప్రవేశించారు. మయన్మార్ -బంగ్లాదేశ్ ట్రై జంక్షన్ వద్ద ఉన్న బందుక్ బంగా గ్రామంలోకి ప్రవేశించారు. అయితే మయన్మార్ సైనికులను సమీపంలోని పర్వాలోని అస్సాం రైఫిల్స్ శిబిరానికి తీసుకెళ్లారు. వీరిలో ఎక్కువ మంది లుంగ్లీకి తరించినట్టుగా ఓ అధికారి తెలిపారు.
అప్పటి నుండి మయన్మార్ ఆర్మీ అస్సాం రైఫిల్స్ పర్యవేక్షణలోనే ఉన్నారని అధికారులు వివరించారు. వీరిని లెంగ్ పుయి విమానాశ్రయం నుండి మయన్మార్ కు తరలించడానికి శని, ఆదివారాల్లో వీరిని ఐజ్వాల్ కు తీసుకు వచ్చారు. ఈ బృందానికి కల్నల్ సహా 36 మంది అధికారులు, 240 మంది సిబ్బంది ఉన్నారు.
నవంబర్ లో 104 మంది మయన్మార్ ఆర్మీ సిబ్బందిని భారత వైమానిక దళం హెలికాప్టర్ల ద్వారా మిజోరంలోని వివిధ ప్రాంతాల నుండి మణిపూర్ సరిహద్దు పట్టణం మోరేకు పంపారు. ఆ తర్వాత స్వదేశానికి తరలించారు. ఈ నెల ప్రారంభంలో మయన్మార్ ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా 255 మంది సైనికులను లెంగ్ పుయి విమానాశ్రయం ద్వారా వెనక్కి పంపారు.మయన్మార్ తో మిజోరం 510 కి.మీ పొడవైన సరిహద్దు ఉంటుంది.