
నా భార్యకు నా కన్నా వీధి కుక్కలు అంటేనే ఇష్టం. ఇక ఇలాంటి భార్యతో బతకడం నావల్ల కాదు. విడాకులు ఇప్పించండి.. అంటూ ఒక భర్త హైకోర్టు మెట్లు ఎక్కాడు. ఈ సంఘటన అహ్మదాబాద్లో జరిగింది. ఇక్కడ మేము భార్యా భర్తల పేర్లు వెల్లడించడం లేదు. భర్త చెబుతున్న వివరాలు ప్రకారం అతనికి 2006లో వివాహం జరిగింది. అతని భార్య మొదట ఒక వీధి కుక్కను ఇంట్లోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. ఆమె ఒక్క కుక్కతో ఆపలేదు. మరిన్ని వీధి కుక్కలను ఇంట్లోకి తీసుకొచ్చి స్నానం చేయించి వాటిని జాగ్రత్తగా చూసుకునేది. వాటిని మంచాల పై కూడా పడుకోబెట్టేది. ఓసారి మంచంపై పడుకున్న ఇతడిని కుక్క కరిచింది కూడా. అయినా భార్యలో మార్పు రాలేదు.
ఇలా ఫ్లాట్లో కుక్కలు అధికంగా ఉండటం వల్ల ఇరుగుపొరుగు వారితో గొడవలు వచ్చేవి. దీంతో 2008లో వీరిపై పోలీసులకు కంప్లైంట్ కూడా అందింది. తర్వాత ఇతని భార్య జంతువు హక్కుల సంఘంలో చేరింది. అలా చేరాక తమ కుక్కల్ని ఎవరైనా ఏమైనా అంటే పదే పదే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేది. అలా ఫిర్యాదు చేయడానికి తనతో పాటు భర్తను కూడా తీసుకెళ్లేది. అతను రాను అంటే నోటికి వచ్చినట్టు తిట్టేది. దీంతో ఈ వ్యక్తికి వెళ్లక తప్పేది కాదు.
భార్య ప్రవర్తన ఈ కుక్కల వల్ల తనకు విపరీతమైన ఒత్తిడి కలిగిందని, ఆరోగ్యం పాడయిందని ఆయన చెప్పాడు. అంతేకాదు అది అంగస్తంభన సమస్యకు కూడా దారి తీసిందని వివరించాడు. వీధి కుక్కల వల్ల భార్యతో తనకి దాంపత్య సుఖం కూడా లేకుండా పోయిందని ఆయన వివరించాడు. తన భార్య పెళ్లి అయినప్పటి నుంచి వీధి కుక్కలనే చూసుకుంటూ తనని కనీసం పట్టించుకోలేదని వివరించాడు. అంతే కాదు తమ మధ్య ఉన్న గొడవల గురించి ఒక రేడియో జాకీతో ప్రాంక్ కాల్ చేయించిందని.. దాని వల్ల తాను సమాజంలో తలదించుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పాడు.
2017లో తాను అహ్మదాబాద్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం కేసు వేశాడు భర్త. అతని భార్య మాత్రం తనకు కుక్కలను పరిచయం చేసిందే ఆయనని, కుక్కలతో కలిసి జీవించడం ఆయనే నేర్పాడని కోర్టులో వాదించింది. అంతేకాదు అతను కుక్కలను ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం వంటి ఫోటోలను కూడా చూపించింది. దీంతో భార్యనే సమర్థించింది కోర్టు. గత ఏడాది కుటుంబ న్యాయస్థానం అతని పిటిషన్ కొట్టివేసింది. 2024లో కూడా కుటుంబ న్యాయస్థానం విడాకులు ఇవ్వకుండా పిటిషన్ కొట్టేసింది. భర్త విడాకులతో పాటు 15 లక్షల రూపాయల భరణం చెల్లిస్తానని ఒప్పుకోగా.. భార్య మాత్రం రెండు కోట్ల రూపాయలు చెల్లించాలని పట్టుబట్టింది. దీంతో కేసు వాయిదా పడింది. ఈ భర్తకు ఎప్పుడు ప్రశాంతమైన జీవితం దక్కుతుందో. ఇప్పటికే అతనికి 41 ఏళ్లు. వివాహమై విచ్ఛినమైపోయింది. పిల్లలు లేరు. ఇక కేసు ఎన్నాళ్లు సాగుతుందో తెలియదు.