
Bihar Assembly Election Results 2025 : బీహార్ లో ఎన్డిఏ విజయం సాధించింది. బిజెపి, జనతాదళ్ యునైటెడ్ పాార్టీల సారథ్యంలోని ఎన్డిఏ కూటమి అత్యధిక సీట్లు సాధించి భారీ మెజారిటీతో విజయం సాధించింది. కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ కూటమి ఘోర ఓటమిని చవిచూసింది.
బిహార్ లో మరోసారి ఎన్డిఏ కూటమి అధికాారాన్ని చేపట్టడం ఖాయంగా మారింది. ఈసిఐ తాజా సమాచారం ప్రకారం 84 సీట్లలో బిజెపి ఆధిక్యంలో ఉండగా 7 చోట్ల విజయం సాధించింది. ఇక దాని మిత్రపక్షం జనతాదళ్ (యునైటెడ్) 77 చోట్ల ఆధిక్యంలో ఉంది... 6 సీట్లు గెలుచుకుంది. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) పార్టీ 19 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇలా ఎన్డీఏ దాదాపు 200 పైగా సీట్లను గెలుచుకునేలా కనిపిస్తోంది.
మహాఘట్ బంధన్ కూటమిలో రాష్ట్రీయ జనతాదళ్ 26 సీట్లలో ఆధిక్యం, 1 చోట విజయంతో పరవాలేదనిపిస్తోంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఘోర ప్రదర్శన కనబరుస్తోంది... కేవలం ఐదు సీట్లలో మాత్రమే ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఆసక్తికరంగా మజ్లిస్ 5 చోట్ల ఆధిక్యంలో ఉంది.
బిహార్ లో బిజెపి సారథ్యంలోని ఎన్డిఏ కూటమి 200 సీట్లకు చేరువగా వెళుతోంది. మొత్తం 243 అసెంబ్లీ సీట్లుంటే అందులో బిజెపి 85, జనతాదళ్ యునైటెడ్ 75, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 22 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇక మహాఘట్ బంధన్ లోని రాష్ట్రీయ జనతాదళ్ 36, కాంగ్రెస్ కేవలం 6 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.
బిహార్ లో ఎన్డిఏ కూటమి ఆధిక్యం మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ అయ్యింది. ఇప్పటివరకు వెలువడిన ఓట్ల లెక్కింపు వివరాలను పరిశీలిస్తే ఎన్డిఏకు 160 సీట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ సారథ్యంలోని మహాఘట్ బంధన్ కేవలం 79 సీట్లలో ఆధిక్యంలో ఉంది.
ప్రస్తుతం ఎన్డిఏ 127, మహాఘట్ బంధన్ 71, జన్ సురాజ్ పార్టీ 3 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఈ ఫలితాల సరళిని చూస్తుంటే ఎన్డిఏ మరోసారి అధికారాన్ని చేపట్టేలా ఉంది.
నితీశ్ కుమార్ సారథ్యంలోని ఎన్డిఏ కూటమి 124 సీట్ల లీడింగ్ లో ఉంది. తేజస్వి యాదవ్ సారథ్యంలోని మహాఘట్ బంధన్ 68 సీట్ల ఆధిక్యంలో ఉంది. ప్రశాంత్ కిషోర్ సారథ్యంలో జన సూరజ్ పార్టీ కేవలం 3 సీట్లలో ఆధిక్యంలో ఉంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 ఫలితాలు నేడు వెలువడుతున్నాయి. రాష్ట్రంలోని 243 నియోజకవర్గాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల కౌంటింగ్ మొదలైంది. వివిధ కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కించి, ఆ తర్వాత 8:30 గంటలకు ఈవీఎంల లెక్కింపు మొదలయ్యింది.
పోస్టల్ బ్యాలెట్స్ లో ఎన్డిఏ కూటమి ఆధిక్యం సాధించింది. 4,372 కౌంటింగ్ టేబుళ్లు, 18,000 మందికి పైగా కౌంటింగ్ ఏజెంట్లతో కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తూ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు.
బిహార్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్ డేట్స్ కోసం https://newsable.asianetnews.com/ ఫాలో కండి.
బీహార్‌లో 1951 తర్వాత అత్యధికంగా 67.13% ఓటింగ్ నమోదైంది. పురుషుల (62.8%) కంటే మహిళా ఓటర్లు (71.6%) ఎక్కువగా ఓటు వేశారు. ఈసీఐ అధికారిక ప్రకటన ప్రకారం, నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరిగిన ఈ ఎన్నికల్లో 2,616 మంది అభ్యర్థులు, 12 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. ఏ నియోజకవర్గంలోనూ రీపోలింగ్ కోరలేదు. బీహార్ ఎన్నికల్లో ప్రధాన పోటీ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, తేజస్వి యాదవ్ మహాఘటబంధన్ మధ్య ఉంది.
చాలా ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ సునాయాసంగా గెలుస్తుందని అంచనా వేస్తుండగా, కొన్ని మాత్రం మహాఘటబంధన్ గెలుస్తుందని చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలనే ప్రతిబింబిస్తున్నాయి.