
న్యూఢిల్లీ:తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుండి కూడ తనకు తన తల్లి డబ్బులు ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.
బుధవారం నాడు సినీ నటుడు అక్షయ్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇంటర్వ్యూ చేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో తనకు వచ్చే జీతంలో కొంత భాగాన్ని తన తల్లికి ఇచ్చేవాడినని ఆయన గుర్తు చేసుకొన్నారు. అయితే తన తల్లిని చూసేందుకు వెళ్లిన సమయంలో కొంత మొత్తాన్ని ఆమె తనకు ఇచ్చేదని మోడీ గుర్తు చేసుకొన్నారు.
అమ్మతో ఉండాలని తాను చిన్నప్పటి నుండి కోరుకొంటున్నానని... కానీ అది సాధ్యపడడం లేదని మోడీ అన్నారు.తాను యవ్వనంలోకి అడుగుపెట్టిన తర్వాత తనతో పాటే ఉండాలని తన తల్లిని కోరినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు.
కానీ, తన స్వగ్రామంలోనే ఉండాలని తల్లి కోరుకొనేదని ఆయన గుర్తు చేసుకొన్నారు. ఈ కారణంగానే తన తల్లితో ఎక్కువ కాలం పాటు కలిసి ఉండాలనే తన కోరిక తీరలేదన్నారు.
ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడ అప్పుడప్పుడూ వెళ్లి తన తల్లిని చూసి వస్తానని ఆయన చెప్పారు. ఆమెతో కొంత సేపైనా గడపడం తనకు సంతోషాన్ని కల్గిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.తాను ఏ పదవిలో ఉన్నప్పటికీ కూడ తన కుటుంబం పట్ల తన బాధ్యతలను మాత్రం విస్మరించలేదని మోడీ చెప్పారు.
సంబంధిత వార్తలు
మిత్రులతో ఇప్పటికి సరదాగానే ఉంటా: మోడీ
ఆర్మీలో చేరాలని ఉండేది: అక్షయ్‌కుమార్ ఇంటర్వ్యూలో మోడీ