
తమ ప్రభుత్వం పూర్తి పదవీకాలాన్నీ పూర్తి చేస్తుందని, వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకొని విజయం సాధిస్తుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మహారాష్ట్ర మంత్రి మండలి విస్తరణపై వచ్చే వారం ముంబైలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఉదయ్ పూర్ ఘటనపై హిందువులు రాజ్యంగ బద్దంగా, శాంతియుతంగా స్పందించారు - ఆర్ఎస్ఎస్
శుక్రవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న షిండే, ఫడ్నవీస్‌లు శనివారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు. అంతకుముందు మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం లు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సుదీర్ఘ చర్చలు జరిపారు, ఈ సమయంలో అధికార భాగస్వామ్య ఏర్పాటు విస్తృత ఆకృతిని ఖరారు చేసినట్లు తెలిసింది.
మధ్యంతర ఎన్నికల కోసం శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ఇచ్చిన పిలుపును షిండే తోసిపుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బలంగా ఉందని, 288 మంది సభలో 164 మంది ఎమ్మెల్యేల మద్దతును పొందామని, ప్రతిపక్షానికి కేవలం 99 మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారని తెలిపారు.
మీడియా సమావేశంలో ఫడ్నవీస్‌ను ఉప ముఖ్యమంత్రి పదవికి తగ్గించడంపై బీజేపీ క్యాడర్ అసంతృప్తిగా ఉన్నారా అని విలేకరులు ప్రశ్నించారు. అయితే దీనికి ఫడ్నవీస్ సమాధానం ఇచ్చారు. 2019లో తమకు జరిగిన అన్యాయం పట్ల అసంతృప్తిగా ఉన్నారని, అయితే ఇప్పుడు సంతోషంగానే ఉన్నారని చెప్పారు. మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిని తొలగించి సహజ మిత్రపక్షాలు బీజేపీ, శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో బీజేపీ కార్యకర్తలు ఆనందంగానే ఉన్నారని ఆయన తేల్చి చెప్పారు. ‘‘ఇది చాలా స్పష్టంగా ఉంది. ముఖ్యమంత్రి నాయకుడు. ఈ ప్రభుత్వాన్ని విజయవంతం చేయడానికి మేము పని చేస్తాము ’’ అని ఫడ్నవీస్ అన్నారు.