కర్ణాటక: పోర్ట్‌ఫోలియోలపై అసంతృప్తి.. మంత్రుల అసమ్మతి రాగం, చిక్కుల్లో బసవరాజ్ బొమ్మై

By Siva KodatiFirst Published Aug 10, 2021, 5:41 PM IST
Highlights

మంత్రిత్వ శాఖల కేటాయింపు వ్యవహారం కర్ణాటకలో కలకలం రేపుతోంది. కోరుకున్న పోర్ట్‌ఫోలియో రాలేదన్న అక్కసుతో నేతలు అసమ్మతి రాగం వినిపిస్తుండటంతో సీఎం బసవరాజ్ బొమ్మై చిక్కుల్లో పడ్డారు.

కర్ణాటక నూతన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన సొంత పార్టీ నుంచి అసమ్మతి ఎదుర్కొంటున్నారు. ఆయన మంత్రి వర్గంలో పదవుల కేటాయింపులో చెలరేగిన అసంతృప్తిని చల్లార్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లుగా తెలుస్తోంది. ఆయన త్వరలోనే ఢిల్లీ వెళ్లి బీజేపీ అధిష్టానంతో చర్చించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మెకెదతు వ్యవహారంపై వచ్చే వారం ఢిల్లీ వెళతానని బసవరాజ్ బొమ్మై ఇప్పటికే ప్రకటించారు. ఆ సమయంలోనే రాష్ట్ర బీజేపీ నేతల్లో అసమ్మతిపై కూడా సీఎం చర్చించబోతున్నట్లుగా సమాచారం. పార్టీ నేతల అసంతృప్తిని  రాష్ట్ర స్థాయిలో చల్లార్చలేమని కేంద్రం జోక్యం చేసుకోవడం తప్పనిసరిని  బొమ్మై భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ALso Read:కొలువుదీరిన కర్ణాటక కొత్త మంత్రివర్గం: యడియూరప్ప కొడుకుకు దక్కని చోటు

పోర్ట్‌ఫోలియో రాలేదని పురపాలక శాఖ మంత్రి ఎంటీబీ నాగరాజు బహిరంగంగనే అసంతృప్తి వ్యక్తం చేశారు. తన స్థాయిని బీజేపీ ప్రభుత్వం దిగజార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు రాకపోతే తన నిర్ణయం తాను తీసుకుంటానని  అంటున్నారు నాగరాజ్. ఆయనతో సీఎం బసవరాజ్ మాట్లాడారు. ఇక పర్యాటక శాఖ పొందిన ఆనంద్ సింగ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన రాజీనామా చేయాలని భావిస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. వెనుకబడిన వర్గాల నేత బీ. శ్రీరాములు మంత్రి పదవుల కేటాయింపుపై తనకు సంతృప్తి లేదని , అదే విధంగా నిరాశ కూడా లేదని అంటున్నారు. ఈ పరిస్ధితులను హ్యాండిల్ చేయలేకపోతున్న బొమ్మై.. ఈ పంచాయతీని అధిష్టానం ముందు పెట్టబోతున్నారని బీజేపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

click me!